సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిన మోటార్‌సైకిల్
ABN , First Publish Date - 2022-11-12T21:55:02+05:30 IST
మండల పరిధిలోని జాతీయ రహదారిపై బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీ రవితేజ (29) దుర్మరణం చెందాడు.

మనుబోలు, నవంబరు 12: మండల పరిధిలోని జాతీయ రహదారిపై బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీ రవితేజ (29) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా తిరుపతి సప్తగిరినగర్‌కు చెందిన రవితేజ నెల్లూరులోని రిలయన్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో భార్యాబిడ్డను చూసేందుకు నెల్లూరు నుంచి తిరుపతికి మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు. బద్దెవోలు క్రాస్ రోడ్డుకు వచ్చేసరికి నిర్మాణంలో ఉన్న రోడ్డు కావడంతో ఒకే మార్గంలో వాహనాలు వెళుతున్నాయి. దీంతో రోడ్డుకు తూర్పు వైపున సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ రోడ్డు కుంచించుకుపోవడంతో వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను అదుపుచేసే క్రమంలో సిమెంట్ దిమ్మెను ఢీకొంది. దీంతో రవితేజ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ. ముత్యాలరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రవితేజ వద్ద ఉన్న ఆధార్, లైసెన్సు కార్డుల ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
శిరస్త్రాణం ధరించి ఉంటే..
ద్విచక్ర వాహన చోదకులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని పోలీసులు పదేపదే చెబుతుంటారు. చాలామంది పాటించడం లేదు. ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే... రవితేజ వెంట శిరస్త్రాణం ఉంది. అయితే తలకు ధరించకుండా మోటార్‌సైకిల్‌కే తగిలించి ఉంది.దాన్ని తలకు ధరించి ఉంటే ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకునేవాడు కాదేమో... అని పలువురు భావిస్తున్నారు.
------------