రోజంతా వర్షం
ABN , First Publish Date - 2022-11-02T00:03:54+05:30 IST
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరు (హరనాథపురం), నవంబరు 1 : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుంతల పడ్డ రోడ్లలో వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల ముందున్న కాలువల్లో చెత్త పేరుకుపోయి ఉండటంతో మురుగు ఉప్పొంగింది. నెల్లూరు, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, దగదర్తి, ముత్తుకూరు, కొడవలూరు తదితర చోట్ల వర్షం దంచికొట్టింది. మంగళవారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా 48.8 మి.మీ వర్షం పడింది. అత్యధికంగా బోగోలులో 138.2 మి.మీ, అత్యల్పంగా వరికుంటపాడులో 2.6 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. నెల్లూరునగరంలోని ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి, రామలింగాపురంలోని రైల్వే అండర్ బ్రిడ్జి, విజయమహల్ గేటు బాక్సు టైపు బ్రిడ్జీలలో వర్షపునీటితో పాటు డ్రైనేజీ నీరు చేరటంతో వాహన రాకపోకలు స్తంభించాయి. రామలింగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధ, గురువారాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాఽశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.