tdp: కాపుల అణచివేతే జగన్ లక్ష్యం
ABN , First Publish Date - 2022-11-01T06:04:55+05:30 IST
కాపుల అణచివేతే లక్ష్యంగా జగన్‌రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కాపుల గొంతు కోసిన జగన్‌రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.

మూడున్నరేళ్లలో వారికి ఏం చేశారు?: టీడీపీ
వైసీపీ ద్రోహంపై నిలదీద్దాం: కళా
హ్యాండ్ ఇచ్చారు: చినరాజప్ప
కాపు మంత్రులవి బానిస బతుకులు: బొండా
వైసీపీ నేతలు మేకవన్నె పులులు: అశోక్‌బాబు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కాపుల అణచివేతే లక్ష్యంగా జగన్‌రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కాపుల గొంతు కోసిన జగన్‌రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో కాపులకు జగన్‌రెడ్డి ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. కాపులకు చంద్రబాబు చేకూర్చిన ప్రయోజనాలను వారికి దక్కనీయని జగన్.. ఇప్పుడు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని సోమవారం పలువురు టీడీపీ నేతలు వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు.
తడిగుడ్డలతో గొంతు కోస్తున్నారు: కళా
తడిగుడ్డలతో కాపుల గొంతు కోస్తున్న జగన్‌రెడ్ది ద్రోహంపై నిలదీద్దామని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ‘వంగవీటి రంగాను హత్య చేయడం తప్పు లేదన్న గౌతంరెడ్డికి ఫైబర్‌నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ కేసులో దేవినేని నెహ్రూకు సంబంధం ఉందని చెప్పి, ఆయన కొడుకు దేవినేని అవినా్‌షను పార్టీలో చేర్చుకున్నారు. స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి రాజంపేట ఎంపీ టికెట్ బలిజలకు ఇస్తుంటే, జగన్‌రెడ్డి వచ్చి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఇచ్చారు. కోనసీమ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కాపులు, బలిజలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారు. తిరుపతిలో చిరంజీవి బస చేసిన హోటల్‌పై దాడి చేయించారు. ఇన్ని రకాలుగా కాపుల్ని అవమానించిన జగన్‌కు వైసీపీ కాపు నేతలు సన్మానాలు చేయడం ఊడిగం చేయడమే’ అని విమర్శించారు.
ఆదుకుంటామని హామీఇచ్చి..: చినరాజప్ప
జగన్ పాదయాత్రలో కాపులను ఆదుకుంటామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారికి హ్యాండిచ్చారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కాపుల ద్రోహి జగన్‌రెడ్డికి ఊడిగం చేస్తున్న వైసీపీ కాపుఎమ్మెల్యేలు, మంత్రుల కాలర్ పట్టుకుని నిలదీయాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. కాపు మంత్రులు రెడ్లకు బానిస బతుకు బతుకుతున్నారన్నారు. రాజమండ్రి సభలో ప్రసంగించిన నాయకులు కాపులే కాదని, మేకవన్నె పులులని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ఆరోపించారు. కొందరు మంత్రులు కాపు నేతలుగా చెప్పుకొంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కేటాయించిన 5ు రిజర్వేషన్‌ను జగన్ ఎత్తేయడం ముమ్మాటికీ కాపులకు చేసిన ద్రోహమేనని మండిపడ్డారు.