నది చెంతనే.. తాగునీటి కష్టాలు
ABN , First Publish Date - 2022-10-30T23:14:40+05:30 IST
మండలంలోని రాజులగుమ్మ, రుషింగి, కొండచాకరాపల్లి, తలగాం నాగావళి నది చెంతనే ఉన్నా వర్షాకాలంలోనూ తాగునీటికి కష్టాలు తప్పడం లేదు.

- వర్షాకాలంలోనూ చెలమలే ఆధారం
- ఇదీ ఆ నాలుగు గ్రామాల దుస్థితి
(వంగర)
మండలంలోని రాజులగుమ్మ, రుషింగి, కొండచాకరాపల్లి, తలగాం నాగావళి నది చెంతనే ఉన్నా వర్షాకాలంలోనూ తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. ఏటా వర్షాకాలంలోనూ నది ఒడ్డున చెలమలు తవ్వి దాహర్తి తీర్చుకుంటున్నారు. వేసవిలో నది మధ్యలో చలమలు తవ్వి నీటిని సైకిళ్లు, కావిళ్లతో తరలిస్తున్నారు. నది నుంచి 300 నుంచి 500 మీటర్లు దూరం ఉండడంతో బిందెలతో నీరు మోసేందుకు మహిళలు అవస్థలకు గురవుతున్నారు.
జేజేఎం మంజూరు కాక...
మండలంలోని 39 గ్రామాలకు గాను రాజులగుమ్మ, రు షింగి, కొండచాకరాపల్లి, తలగాం తప్ప మిగతా అన్ని గ్రామాలకు తాగునీటి పథకాలు ఏర్పాటుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని గ్రామాలకూ పైపులైన్ ద్వారా తాగు నీరందించాలన్న లక్ష్యం చేపట్టిన జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) కింద కూడా ఈ గ్రామాలు ఎంపికకాకపోవడం విశేషం. ఇక్కడ ఎన్నికల సమయంలో వచ్చే రాజకీయ నాయకులు నీటి సమస్యపై హామీఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవ డంలేదని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. అయితే తరచూ గ్రామాల్లోకి వస్తున్న ప్రజా ప్రతినిధులను నీటిసమస్య శాశ్వతంగా పరిష్కరించాలని మహిళలు నిలదీస్తున్నా అప్పటి కప్పుడు హామీ ఇచ్చి తప్పించుకుంటున్నారని వాపోతున్నారు.
నేల బావులు శిథిలం
శతాబ్దాల కిందట నాలుగు గ్రామాల్లో నిర్మించిన నేలబావులే నేటీకి ఆధారం. అయితే నిర్వహణ లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పురాతన బావులు కావడంతో రాళ్లు ఊడిపడుతున్నాయి. దీంతో ఆయా బావుల్లో పూడికను తీసేందుకు గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నేలబావుల్లో నీరు కలుషితంకావడంతో ఎటువంటి వ్యాధులు ప్రబలుతాయోనని భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు ఈ నాలుగు గ్రామాల్లో 20 వరకు బోర్లు కూడా పాడైనా మరమ్మతులకు నోచుకోవడం లేదు.
వర్షాకాలంలో భయాందోళన...
గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షా కాలంలో నాగావళి నది నుంచి నీటినీ తీసుకురావడానికి వర్షాకాలంలో భయాందోళన చెందు తున్నాం. నాయకులు గ్రామానికి వచ్చినప్పుడు హడావిడిగా తాగునీరందిస్తామని చెప్పడం తప్పా ప్రయోజనం లేదు.
- నిర్మల, రాజులగుమ్మడ
ఫిర్యాదు చేసినా పట్టించుకోక..
ప్రజలు గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులిచ్చినా పట్టించుకోలేదు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
- కిరన్ రాజులగుమ్మడ
నేలబావులు కలుషితం..
గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. గ్రామంలో బోర్లు తరచూ పాడవుతుండడంతోపాటు నేల బావులు కలుషితం అవతున్నాయి. పొల పనులు ముగించి సైకిల్‌పై క్యాన్ కట్టి నీరు తీసుకొస్తున్నా.
- అప్పారావు రాజులగుమ్మడ
తాగునీటికి ఇబ్బంది వాస్తవమే..
గ్రామంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడడం వాస్తవమే. ఇక్కడ బోర్లు పాడైన తర్వాత యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశాం. గ్రామంలో ఆరు బోర్లు ఉన్నా ప్రజలు తాగడానికి వినియోగించడంలేదు. బోర్ల నుం చి వస్తున్న నీరు దుర్వాసనగా ఉండడంతో నదిలో నీటిని తీసుకొచ్చి తాగుతున్నారు. రక్షి త మంచి నీటికి మినీ పఽథకంగాని, జేజేఎం ద్వారా తాగునీటి సమస్య పరిష్కరించాలి. ఈ విషయం అధికారుల దృష్టికి పలుసార్లు తీసుకువెళ్లా.
- ద్వారపు రెడ్డిసింహచలం, రాజులగుమ్మడ సర్పంచ్
జేజేఎం కోసం అంచనా తయారీ..
రాజులగుమ్మడలో ప్రజలు తాగునీటికి పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆరు బోర్లు మరమ్మతులు చేశాం. కొందరు బోరు బావి నీరు తాగడానికి ఇష్టం లేక నది నుంచి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం జేజేఎం ద్వారా గ్రామంలో పెద్దబోరు కొట్టి ఇంటింటికి కుళాయిల ద్వారా నీరందించే చర్యలకు అంచనాలు తయారు చేయిస్తున్నాం. మొదటి దశలో తొమ్మిది గ్రామాల్లో కుళాయిల వేయగా, రెండో దశలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కొళాయిలు వేస్తాం.
- శంకరరావు, ఎంపీడీవో, వంగర