Drug Control మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:45 PM
Measures for Drug Control జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటు సారా, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా పార్వతీపురం మన్యం ఉండాలన్నారు. పక్కాగా పర్యవేక్షణ జరగాలని సూచించారు. అసైన్డ్ భూముల్లో ఎవరైనా నాటుసారా తయారు చేస్తే పట్టాలు రద్దు చేస్తామన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించారు. మెడికల్ షాపుల్లో వివిధ రూపాల్లో మందుల విక్ర యాలు, కాలం చెల్లిన మందులు ఉన్నట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 288 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 394 పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. రోజూ డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి డి.ఆశ మాట్లాడుతూ.. పట్టణంలో నాలుగు మందులు దుకాణాలపై దాడులు నిర్వహించామని, మూడు షాపుల లైసెన్స్‌లు రద్దు చేశామని వెల్లడించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు మాట్లాడుతూ.. నవోదయం కార్యక్రమం కింద జిల్లాలో 137 గ్రామాలను గుర్తించా మన్నారు. 168 గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితసురానా, డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీఎఫ్‌వో ప్రసూన తదితరులు పాల్గొన్నారు.