New Tax regime: నూతన పన్ను విధానం ఎందుకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది? కారణాలు ఇవేనా..

ABN , First Publish Date - 2022-12-05T17:27:36+05:30 IST

బడ్జెట్ (Budget) సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance ministry) గత నెల నవంబర్ 26న సాధారణ ప్రజానీకం నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది.

New Tax regime: నూతన పన్ను విధానం ఎందుకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది? కారణాలు ఇవేనా..

న్యూఢిల్లీ: బడ్జెట్ (Budget) సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance ministry) గత నెల నవంబర్ 26న సాధారణ ప్రజానీకం నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. గతంలో సరళీకృత నూతన పన్ను విధానాన్ని (New Tax regime) ప్రవేశపెట్టిన నేపథ్యంలో తాజా అభిప్రాయాలు, సూచనలు తదుపరి బడ్జెట్‌ 2023లో మార్పులు చేర్పులకు మరింత దోహదపడతాయని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం (New tax regime) చెల్లింపుదార్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది?, కొత్త, పాత పన్ను విధానాలపై చెల్లింపుదారుల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...

ఆర్థిక సంవత్సరం 2019-2020, అసెస్‌మెంట్ ఇయర్ 2020-21 వరకు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌కు (Hindu Undivided Family) ఒకే పన్ను విధానం పాతది ఉండేది. చెల్లింపుదార్ల ఆదాయాన్ని బట్టి వేర్వేరు స్లాబు రేట్లు, పన్ను తగ్గింపులు, ఇతర మినహాయింపులు ఇందులో లభించేవి. అయితే కేంద్ర బడ్జెట్ 2020లో ఐచ్చిక నూతన పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. రాయితీ పన్ను రేట్లతో ‘తగ్గింపులు-మినహాయింపులులేని విధానం’ ఇది. అసెస్‌మెంట్ ఇయర్ 2021-22లో దీనిని ప్రవేశపెట్టగా.. ఈ విధానంలో ప్రత్యేక తగ్గింపులు, మినహాయింపులు ఏమీ ఉండవు. పన్ను రేటు తగ్గింపు రూపంలో మాత్రమే ఉపశమనం ఉంటుంది. దీంతో కొత్త ఐచ్ఛిక విధానంతో కలిపి ప్రస్తుతం రెండు పన్ను విధానాలు చెల్లింపుదార్లకు అందుబాటులో ఉన్నాయి.

కొత్త విధానంలో మినహాయింపులు ఉండవ్..

పన్ను చెల్లింపుదార్లకు ప్రస్తుతం సహజంగా లభిస్తున్న తగ్గింపులు, మినహాయింపుల జాబితాలో పీపీఎఫ్, ఈఫీఎఫ్, ఎన్‌పీఎస్, జీవితబీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హౌసింగ్ లోన్ల మూలధనం, వడ్డీలు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఉన్నాయి. ఇక మినహాయింపుల విషయానికి వస్తే హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయి. ఆసక్తికరంగా గత కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతున్న సేవింగ్ అకౌంట్స్‌పై వడ్డీ, హౌసింగ్ లోన్స్‌పై వడ్డీ, హౌసింగ్ రెంట్ అలవెన్స్‌పై మినహాయింపులు, లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఫ్యామిలీ పెన్షన్, స్టాండర్డ్ డిడక్షన్ వంటివేమీ కొత్త పన్ను విధానంలో లభించవు.

క్షేత్ర స్థాయి అభిప్రాయాలు ఇవే..

250 నుంచి 750 మంది వ్యక్తుల ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసిన 5 ఛార్టెడ్ అకౌంటెంట్ సంస్థలు కీలకమైన కొన్ని విషయాలను వెల్లడించాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

1. రూ.10 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన చెల్లింపుదార్లు ‘పాత పన్ను విధానం’ ఎంచుకుంటున్నారు. కొత్త, పాత విధానాల మధ్య పెద్దగా వ్యత్యాసమేమీ లేకపోవడంతో పాత విధానాన్ని ఎంచుకుంటున్నారు.

2. ఇక ఆదాయం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉన్నవారు (వయసు 40 నుంచి 60) ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హెచ్‌ఆర్ఏ, హౌసింగ్ లోన్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం పాత పన్నుల విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆర్థిక మినహాయింపులు ఏమీలేని 25-40 ఏళ్ల మధ్య వయస్కులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. అయితే భవిష్యత్ అవసరాలను బట్టి పాత విధానంలోకి మారేందుకు ఏమాత్రం సంకోచించబోమని వారు అభిప్రాయపడుతున్నారు.

3. రెంటల్ ఆదాయం, ఇతర వనరులపై రాబడి ఉన్న పన్నుచెల్లింపుదార్లు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఈ విధానం సులభంగా ఉండడమే దీనికి కారణం

4. సేవింగ్స్, రిటైర్మెంట్ తర్వాత సంతోషకరమైన జీవితం, రక్షణాత్మకంగా ఆలోచించేవారు పాత పన్ను విధానాన్ని కొనసాగించడమే మేలని భావిస్తున్నారు.

5. మొత్తంగా 33 నుంచి 37 శాతం మంది పన్ను చెల్లింపుదార్లు కొత్త పన్ను విధానంలోకి మారే అవకాశం ఉంది.

Untitled-2.jpg

కాగా నేరుగా చెల్లింపుదార్లనే సంప్రదించగా మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొత్త విధానం లేక పాత విధానాన్ని ఎంచుకుంటారా? అని ప్రశ్నించగా.. 35 శాతానికిపైగా మంది కొత్త విధానానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉండడం, విధానం కూడా సురళీకృతంగా ఉండడం వంటి పలు కారణాలను పేర్కొన్నారు. రెండు అంచనా సంవత్సరాలు/రిటర్న్ ఫైలింగ్ సీజన్ల తర్వాత కూడా పాత విధానంలోనే కొనసాగాలనుకుంటున్నారా, ఎందుకు? అని ప్రశ్నంచిగా.. 65 శాతానికిపైగా చెల్లింపుదార్లు ఔనని సమాధానం ఇచ్చారు. తగ్గింపులు, మినహాయింపులను ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో కొత్త విధానానికి మారతారా అని ప్రశ్నించగా.. దీర్ఘకాలంలో ఏవిధంగా ప్రయోజనం పొందానున్నామనే అంశాల ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇక ఎప్పటికీ పాత విధానంలోనే కొనసాగాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. మెజారిటీ అవుననే సమాధానం ఇచ్చారు. దీర్ఘకాల గృహ రుణాలు, పెట్టుబడులు, పిల్లల చదువులు, కూతురి పెళ్లి, స్థిర, చరాస్థులు కొనాలనే లక్ష్యాల కారణంగా పాత విధానంలోనే కొనసాగుతామని చెప్పారు.

పైన వెల్లడైన అభిప్రాయాలను బట్టి కొత్త పన్నుల విధానం అంతగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ మాజీ రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ తన రిటైర్మెంట్‌ ముందు మాట్లాడుతూ.. కొత్త పన్ను విధానంపై పునరాలోచించాల్సిన అవసరంలేదని చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఆర్థిక మంత్రి, బడ్జెట్ టీమ్ కొత్త విధానంపై విలువైన సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటోంది.

Updated Date - 2022-12-05T17:34:45+05:30 IST