Munugode By Election: ‘మునుగోడు’ ఫలితాలపై ఆ ఒక్క ప్రాంతంలోనే ఎన్ని కోట్ల పందేలు కాశారంటే..
ABN , First Publish Date - 2022-11-04T21:26:12+05:30 IST
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కేంద్రం కానున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ ఆసక్తి నెలకొంది.
నల్లగొండ: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కేంద్రం కానున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ ఆసక్తి నెలకొంది. ప్రతి ఉప ఎన్నికపైన బెట్టింగ్‌లు సహజం కాగా దుబ్బాక, హుజూరాబాద్‌తో పోలిస్తే మునుగోడు ఫలితంపై అవి మరింత పెద్దఎత్తున జరిగాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేదెవరు? రెండో స్థానం ఎవరిది? మెజార్టీ ఎంత? అనే అంశాలపైన బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదికూడా ప్రధాన పట్టణాల్లోనే బెట్టింగ్‌లు జరిగాయి. ఇందులో క్రికెట్ బుకీలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో నెంబరు-2 వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన నియోజకవర్గంలోని కొందరు వ్యక్తులు కీలక భూమిక పోషించారు. ఏపీలో అత్యధికంగా రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమంటూ హాట్ ఫేవరెట్‌గా ఆయనపైనే పందేలు కాశారు. ఒక్క వైజాగ్ నగరంలోనే రూ.100కోట్ల వరకు బెట్టింగ్‌లు జరగగా విజయవాడ, భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో బెట్టింగ్ పెట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో నెంబరు-2 వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన నియోజకవర్గంలోని వ్యక్తులు పెద్దసంఖ్యలో బెట్టింగ్‌లు జరిపినట్లు సమాచారం. మునుగోడు సర్వేలో పాల్గొన్న సిబ్బందికి పందెం రాయుళ్లు రూ.లక్ష చొప్పున చెల్లించి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇక తెలంగాణలోనూ హైదరాబాద్ కేంద్రంగా పందాలు సాగాయి. రియల్టర్లు, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు హైదరాబాద్‌లో పందేలకు దిగారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.1,600 కోట్ల మేర బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ బెట్టింగ్ రూపాయికి ఐదు రూపాయిల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్, ఏపీలోని కడప, కర్నూల్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు మునుగోడు ఉప ఎన్నికపై పెద్దఎత్తున పందెం కాస్తున్నట్లు తెలిసింది.