Halloween Stampede: తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై భారత్ దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2022-10-30T12:02:50+05:30 IST
దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై
సియోల్ : దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ కష్టకాలంలో దక్షిణ కొరియా ప్రభుత్వానికి సంఘీభావం తెలిపింది. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపాయి.
దక్షిణ కొరియాలో కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలను సడలించింది. దీంతో హాలోవీన్ (Halloween) సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకొనేందుకు యువతీయువకులు బహిరంగ ప్రదేశాలకు తరలివచ్చారు. శనివారం రాత్రి సుమారు 1,00,000 మంది ఇటావోన్ ప్రాంతంలో ఒకే చోట చేరారు. వీరిలో అత్యధికులు 25 ఏళ్ళ లోపు వయస్కులే. ఇరుకైన మార్గంలో వీరంతా నడుస్తుండగా తొక్కిసలాట జరిగింది. హుటాహుటిన సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రోడ్డుపై కుప్పకూలినవారికి సహాయక చర్యలు చేపట్టాయి.
స్థానికుల కథనం ప్రకారం, రోడ్లన్నీ ప్రజలు, వాహనాలతో క్రిక్కిరిసిపోయాయి. బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 151 మంది ప్రాణాలు కోల్పోగా, 81 మంది గాయపడ్డారు. దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యివోల్ ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయపడటానికే తన ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మృతుల అంత్యక్రియలకు, గాయపడినవారి చికిత్సకు ప్రభుత్వం సాయపడుతుందని చెప్పారు
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ట్విటర్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కొరియా రిపబ్లిక్‌కు సంఘీభావం, మద్దతు తెలిపారు.