Justice Aruna Jagadeesan: పోలీసులు హద్దుమీరారు...

ABN , First Publish Date - 2022-10-19T13:47:19+05:30 IST

తూత్తుకుడి కాల్పుల ఘటనపై పోలీసులు హద్దు మీరి ప్రవర్తించారని జస్టిస్‌ అరుణా జగదీశన్‌(Justice Aruna Jagadeesan) నేతృత్వంలోని కమిషన్‌ తేల్చిచెప్పింది. ఈ

Justice Aruna Jagadeesan: పోలీసులు హద్దుమీరారు...

- ఈపీఎస్‏కు అంతా తెలుసు

- తూత్తుకుడి కాల్పుల ఘటనపై అరుణా జగదీశన్‌ కమిషన్‌ వెల్లడి

- కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ సహా ముగ్గురు అధికారులపై చర్యలకు సిఫారసు

- రజనీ ప్రకటన తప్పుబట్టిన కమిషన్‌

- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం


పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 18: తూత్తుకుడి కాల్పుల ఘటనపై పోలీసులు హద్దు మీరి ప్రవర్తించారని జస్టిస్‌ అరుణా జగదీశన్‌(Justice Aruna Jagadeesan) నేతృత్వంలోని కమిషన్‌ తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలకు సిఫారసు చేసింది. అంతేగాక బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన సాయంపైనా పలు సూచనలు చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెండు కమిషన్ల  నివేదికలను ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్‌ అందించిన నివేదికను, తూత్తుకుడి కాల్పుల వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలోని కమిషన్‌ నివేదికలను సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అందులోని ముఖ్యమైన అంశాలను విశదీకరించారు. జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నివేదికలోని ముఖ్యాంశాలు..

- పలు కోణాల్లో జరిపిన విచారణ మేరకు తూత్తుకుడి కాల్పుల ఘటనలో పోలీసులు హద్దులు దాటారు.

- అప్పటి తూత్తుకుడి కలెక్టర్‌, తిరునల్వేలి డీఐజీ, తూత్తుకుడి సహా 17 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలి.

- ఈ ఘటనలో సుడలైకన్ను అనే పోలీసు 17 రౌండ్లు కాల్పులు జరిపారు.

- కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆందోళనకారులపై పార్క్‌లో దాగిన పోలీసులు కాల్పులు జరిపారు. 

- ఆ సమయంలో బాధ్యత విస్మరించి, కోవిల్‌పట్టిలో వున్న కలెక్టర్‌.. అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. 

- కాల్పుల ఘటనలో మృతుల వారసులకు రూ.50 లక్షలు అందజేయాలి. ఇప్పటికే చెల్లించిన రూ.20 లక్షలు మినహాయించి, మిగిలిన సొమ్ము అందజేయాలి.

- తుపాకి కాల్పుల ఘటనలో గాయపడిన వారికి రూ.10 లక్షలు అందజేయాలి. ఇప్పటికే వారికి రూ.5 లక్షలివ్వగా, మిగిలిన నగదు అందజేయాలి.

- అల్లర్లసమయంలో మృతిచెందిన జస్టిన్‌ సెల్వమిదీష్‌ కుటుంబీకులకు కూడా ఇతర కుటుంబాలతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఆయన తల్లికిప్రభుత్వఉద్యోగం ఇవ్వాలి.

- ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలీసు శాఖకు చెందిన మణికంఠన్‌కు తగిన వైద్యం, నివారణ అందించాలి.

- తూత్తుకుడి కాల్పులువంటి ఘటనలుభవిష్యత్తులో జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలి.


రజనీ వ్యాఖ్యలను తప్పుబట్టిన కమిషన్‌

తూత్తుకుడి తుపాకి కాల్పుల ఘటనకు సంబంధించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలను అరుణా జగదీశన్‌ కమిషన్‌ తప్పుబట్టింది. తూత్తుకుడి తుపాకి కాల్పుల ఘటనపై అప్పట్లో స్పందించిన రజనీకాంత్‌(Rajinikanth).. స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడింది సంఘ విద్రోహులని, అలాంటి వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీసులపై సంఘ విద్రోహులు దాడిచేయడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని, ప్రజలు ఇలాంటి ఆందోళనలకు పాల్పడితే రాష్ట్రం శ్మశానంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై నేరుగా హాజరై  సమాధానమివ్వాలని అరుణా జగదీశన్‌ కమిషన్‌ రజనీకి సమన్లు జారీచేసింది. అందుకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన రజనీ.. స్టెరిలైట్‌ వ్యతిరేక పోరాటంలో నెలకొన్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలియదని, అలాంటి ఘటనల వెనుక సంఘ విద్రోహులున్నట్లు భావించానే తప్ప, సంఘ విద్రోహుల గురించి తనకు తెలియదన్నారు. సంఘ విద్రోహులు హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు తాను తెలిపిన సమాచారంలో ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు. కాగా ఈ నివేదికలో రజనీ వ్యాఖ్యలను కమిషన్‌ తప్పుబట్టింది. రజనీ లాంటి ప్రముఖులు ఒక ప్రకటన చేసే సమయంలో అందుకు సంబంధించిన ఆధారాలను నిర్ధారించుకోవాల్సిందని, ప్రముఖులు బాధ్యతగా మెలగాల్సి ఉందని అభిప్రాయపడింది.


ఈపీఎస్‏కు అంతా తెలుసు...

తూత్తుకుడి కాల్పుల ఘటనకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అంతా తెలుసని అరుణా జగదీశన్‌ కమిషన్‌ నివేదికలో పేర్కొంది. తూత్తుకుడి తుపాకి కాల్పుల ఘటన ప్రసార మాధ్యమాల్లో చూసి తెలుసుకున్నట్లు ఈపీఎస్‌ చెప్పడం అవాస్తవమని, ఈ ఘటనకు సంబంధించి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌, డీజీపీ రాజేంద్రన్‌, ఇంటెలిజెన్స్‌ ఐటీ సత్యమూర్తి ఎప్పటికప్పుడు సీఎంకు వివరించారని కమిషన్‌ పేర్కొంది.


ఏమిటీ తూత్తుకుడి కాల్పుల కేసు?

తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలు 100వ రోజు చేరుకున్న సమయంలో 2018 మే 22న శాంతియుతంగా చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది.



Updated Date - 2022-10-19T13:47:19+05:30 IST

News Hub