Share News

Dairy Development: పాల ఉత్పత్తికి దన్ను

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:34 AM

దేశంలో పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2 పథకాలకు వ్యయాలను రూ.6,190 కోట్లకు పెంచింది.

Dairy Development: పాల ఉత్పత్తికి దన్ను

  • 2 పథకాల వ్యయాలు 6,190 కోట్లకు పెంపు

  • రూ.2వేలలోపు యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు

  • కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2 పథకాలకు వ్యయాలను రూ.6,190 కోట్లకు పెంచింది. ఈ మేరకు సవరించిన రాష్ర్టీయ గోకుల్‌ మిషన్‌ (ఆర్‌జీఎం), నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ (ఎన్‌పీడీడీ)లకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసినట్టు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ పశుసంవర్ధక రంగంలో వృద్ధిని పెంచేందుకుగాను సవరించిన ఆర్‌జీఎంకు ఆమోదం తెలిపిందని కేంద్రం మంత్రి తెలిపారు. రూ.1,000 కోట్ల అదనపు వ్యయంతో సవరించిన ఆర్‌జీఎంను అమలు చేస్తారు. దీంతో 15వ ఆర్థిక సంఘం కాలంలో (2021-22 నుంచి 2025-26) మొత్తం వ్యయం రూ.3,400 కోట్లకు చేరుతుంది.


సవరించిన ఎన్‌పీడీడీకి రూ.1,000 కోట్ల అదనపు కేటాయింపుతో 15వ ఆర్థిక సంఘం కాలంలో మొత్తం బడ్జెట్‌ రూ.2,790 కోట్లకు చేరుతుంది. కాగా రూ.2వేలలోపు బీమ్‌-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికిగాను దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ప్రోత్సాహకాల పథకానికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఇది 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు వర్తిస్తుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జేఎన్‌పీఏ పోర్ట్‌ (పగోటె) నుంచి చౌక్‌ (29.219కిలో మీటర్లు) వరకు 6 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైస్పీడ్‌ నేషనల్‌ హైవే నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కాగా అసోంలో రూ.10,601.4కోట్లతో యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Mar 20 , 2025 | 04:35 AM

News Hub