Share News

Sunita Williams: క్షేమంగా పుడమికి

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:23 AM

తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్‌) వెళ్లి 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.

Sunita Williams: క్షేమంగా పుడమికి

9 నెలల అనంతరం భూమ్మీదికి సునీతా విలియమ్స్‌

  • అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన మరో ముగ్గురు

  • ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్‌

  • తెల్లవారుజామున 3:27 గంటలకు సేఫ్‌ ల్యాండింగ్‌

  • వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్‌ పోస్ట్‌

  • అధ్యక్షుడు మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు: వైట్‌హౌస్‌

  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు

న్యూఢిల్లీ, మార్చి 19: తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్‌) వెళ్లి 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆమెతోపాటు నాసాకు చెందిన బుచ్‌ విల్మోర్‌, కమాండర్‌ నిక్‌ హేగ్‌, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. అంతరిక్షం నుంచి 17 గంటల ప్రయాణం అనంతరం స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-9 డ్రాగన్‌ వారిని క్షేమంగా భూమిపైకి తీసుకొచ్చింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్‌ 5న బోయింగ్‌ స్టార్‌ లైనర్‌లో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన సునీత, బుచ్‌ విల్మోర్‌.. సాంకేతిక కారణాలతో 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. కాగా, సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్‌ను నాసా బృందం సురక్షితంగా రికవరీ నౌకలోకి చేర్చింది. అనంతరం క్రూ తలుపు తెరచి ఒక్కొక్కరినీ బయటకు తీసింది. క్యాప్సూల్‌ నుంచి బయటకు రాగానే సునీతా విలియమ్స్‌ చిరునవ్వులు చిందిస్తూ, చేతులూపుతూ అభివాదం చేసింది. నాసా బృందం వెంటనే వారిని రికవరీ నౌకలోనే వైద్యసేవలకు తరలించింది.


భూమికి ప్రయాణం సాగిందిలా..

భూమికి 409 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్‌) నుంచి తిరిగి భూమికి చేరుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఏ మాత్రం తేడా వచ్చినా నలుగురు వ్యోమగాముల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌, నిక్‌ హేగ్‌, గోర్బునోవ్‌లను ఐఎ్‌సఎస్‌ నుంచి భూమిపైకి తీసుకొచ్చే క్రమంలో కాస్త ఉత్కంఠ రేగినా.. నాసా, స్పేస్‌ఎక్స్‌ చివరకు ఈ ప్రక్రియను సురక్షితంగా ముగించింది. క్రూ-9 డ్రాగన్‌ భూమికి బయల్దేరే ముందు ఐఎ్‌సఎ్‌సలో ఉన్న వ్యోమగాములకు సునీత, విల్మోర్‌, నిక్‌ హేగ్‌, గోర్బునోవ్‌ వీడ్కోలు పలికారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 గంటలకు క్రూ డ్రాగన్‌ తలుపును మూసివేయగా.. 10:35 గంటలకు క్రూ ఐఎ్‌సఎస్‌ నుంచి విడిపోయింది. భూ దిశగా 17 గంటల ప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వ్యోమనౌకలోని దిగువ (ట్రంక్‌) భాగాన్ని అక్కడే వదిలిపెట్టింది. ఆ తర్వాత భూమిపై ల్యాండింగ్‌ ప్రదేశం దిశగా క్రూ డ్రాగన్‌ ముందు భాగంలోని నాలుగు డ్రాకో ఇంజన్లు మండుకోవడం మొదలైంది. ఆ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం కోన్‌ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. భూవాతావరణంలోకి రీ ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్‌ చేసింది.


1600 డిగ్రీల వేడి.. కాపాడిన పికా..!

రీ ఎంట్రీ సమయంలో వ్యోమనౌక గంటకు 28,800 కి.మీ వేగంతో భూవాతవరణంలోకి ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1600 డిగ్రీల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో వ్యోమనౌకతో కొద్దిసేపు కమ్యూనికేషన్‌ తెగిపోయి కాస్త ఉత్కంఠ ఏర్పడింది. అయితే డ్రాగన్‌ క్యాప్సూల్‌లో నాసా ఫినోలిక్‌-ఇంప్రెగ్నేటెడ్‌ కార్బన్‌ అబ్లేటర్‌ (పికా) అనే హీట్‌ రెసిస్టెంట్‌ పదార్ధాన్ని వాడింది. వ్యోమనౌక చుట్టూ ఉన్న ఈ ఉష్ణ కవచం 1600 డిగ్రీల వేడిని తట్టుకుని నిలబడింది. ఈ కవచమే లోపల ఉన్నవారికి వేడి నుంచి రక్షణ ఇచ్చింది. కాసేపటికి కమాండర్‌ నిక్‌ హేగ్‌ మాట్లాడడంతో నాసా కమాండ్‌ సెంటర్‌లో ఉన్నవారిలో ఉత్కంఠ వీడింది.

ట్రంప్‌ మాట నిలబెట్టుకున్నారు: వైట్‌హౌస్‌

అంతరిక్షం నుంచి వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరడంపై వైట్‌హౌస్‌ ఎక్స్‌ వేదికగా స్పందించింది. ‘తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వారిని భూమిపైకి తీసుకొస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు’ అని ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌కు, స్పేస్‌ ఎక్స్‌ బృందానికి అభినందనలు తెలిపింది. కాగా, వ్యోమగాముల రాకపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. వారికి స్వాగతం పలికిన ట్రంప్‌.. ట్రూత్‌ సోషల్‌ వేదికగా వ్యోమగాముల ఫొటోలను పోస్టు చేశారు. ఈ సందర్భంగా స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు.


పుడమికి స్వాగతం: మోదీ

భారత సంతతి వ్యోమగామి సునీత క్షేమంగా భూమిపైకి తిరిగిరావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అభినందలనలు తెలియజేశారు. ఈ మిషన్‌ కోసం సునీత చూపిన ద్రుఢ సంకల్పాన్ని, సమష్టి కృషిని రాష్ట్రపతి ముర్ము కొనియాడారు. మోదీ కూడా సునీతకు స్వాగతం పలుకుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ క్రూ-9. ఈ పుడమి మిమ్మల్ని ఎంతో మిస్‌ అయింది. సునీతా విలియమ్స్‌ బృందం ధైర్యానికి, స్ఫూర్తికి పరీక్ష ఎదురైంది. వారు సురక్షితంగా తిరిగిరావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, సునీత క్షేమంగా తిరిగిరావడం నాసా, స్పేస్‌ఎక్స్‌, అంతరిక్ష పరిశోధనల పట్ల అమెరికాకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ అన్నారు. సునీతా విలియమ్స్‌, విల్మోర్‌ సురక్షితంగా భూమికి తిరిగి రావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి కూడా సునీతను ఎక్స్‌ వేదికగా అభినందించారు.

సునీత పూర్వీకుల గ్రామంలో సంబరాలు

సునీతా విలియమ్స్‌ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకోవడంతో గుజరాత్‌లో ఉన్న ఆమె పూర్వీకుల గ్రా మంలో సంబరాలు మిన్నంటాయి. మెహసానా జిల్లాలోని ఝులాసన్‌ గ్రామంలో ఆమె బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చి, డ్యాన్స్‌లు చేసి సంబరాలు చేసుకున్నారు.


కుటుంబ నేపథ్యం ఇదీ..

భారత సంతతికి చెందిన న్యూరోఅటానమిస్ట్‌ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీల దంపతులకు 1965 సెప్టెంబరు 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్నకుమార్తె. దీపక్‌ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. మసాచుసెట్స్‌లో 1983లో హైస్కూల్‌ విద్యను పూర్తిచేసిన సునీత.. 1987లో యూఎస్‌ నావల్‌ అకాడమీ నుంచి బీఎస్సీ పూర్తిచేశారు. 1995లో ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 1997లో అమెరికా మిలటరీలో చేరారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. కాగా, సునీత విలియమ్స్‌ త్వరలోనే భారత్‌కు రానుందని ఆమె బంధువు పాల్గుణి పాండ్య సూచనప్రాయంగా చెప్పారు. గుజరాత్‌లోని ఝులాసన్‌లో ఉండే పాల్గుణి ఇప్పుడిక సునీతకు కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుందని ఆయన అన్నారు.

గంటకు 560 కి.మీ. వేగంతో దూసుకొచ్చి

సముద్ర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక గంటకు 560 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రమంగా దాని వేగం తగ్గిపోయింది. ఈ వేగం గంటకు 190 కి.మీ.కి చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 మీటర్ల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్‌ వేగాన్ని సమర్థంగా తగ్గించి గంటకు 25 కి.మీ. వేగానికి తీసుకురావడంతో ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో క్రూ నెమ్మదిగా దిగింది. సహాయక సిబ్బంది స్పీడ్‌ బోట్లలో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని క్రూ నుంచి విష వాయువులేవీ విడుదల కావడంలేదని నిర్ధారించుకున్నాక.. దాన్ని రికవరీ కోసం సిద్ధంగా ఉంచిన మేగన్‌ నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత స్పేస్‌ ఎక్స్‌ సిబ్బంది లోపల ఉన్న నలుగురిని వరుసగా బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్‌ నిక్‌ హేగ్‌.. ఆ తర్వాత గోర్బునోవ్‌, సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ క్రూ నుంచి బయటకు వచ్చారు.


అంతరిక్షంలో ఏం తిన్నారు.. 9 నెలలు ఎలా ఉన్నారు?

ఎనిమిది రోజుల యాత్ర కోసం ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన సునీత, విల్మోర్‌.. సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు అక్కడ ఏం తిన్నారు.. ఇన్నాళ్లు ఎలా ఉండగలిగారు అనే సందేహాలు అందరికీ వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది నవంబరు 18న న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సునీత, విల్మోర్‌.. ఐఎ్‌సఎ్‌సలో పిజ్జా, రోస్ట్‌ చికెన్‌, రొయ్యలు ఆహారంగా తీసుకున్నారు. వ్యోమగాములకు మిల్క్‌పౌడర్‌, పిజ్జాలు, రోస్ట్‌ చికెన్‌, రొయ్యలు, ట్యూనా ఫిష్‌తోపాటు తృణధాన్యాలు అందుబాటులో ఉంచుతామని నాసా అధికారి ఒకరు వెల్లడించారు. నాసా వైద్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 9న నాసా విడుదల చేసిన ఫొటోలో విల్మోర్‌, సునీత ఐఎ్‌సఎ్‌సలో భోజనం చేస్తున్నట్టు కనిపించింది. మొదట్లో వారికి తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉండేవని, కానీ మూడు నెలల్లోనే అవి అయిపోయాయని నాసా అధికారి పేర్కొన్నారు. మాసం, గుడ్లు భూమిపై నుంచి ముందే వండి పంపిస్తారని, అక్కడ తినేముందు వేడి చేసుకుంటారని తెలిపారు. ఐఎ్‌సఎ్‌సలో 530 గ్యాలన్ల మంచినీటి ట్యాంకు ఉంటుందని, ఆ నీటిని వాడుకుంటారని చెప్పారు. వ్యోమగాముల మూత్రం, చెమటను రీసైకిల్‌ చేసి మంచినీటిగా మార్చే వ్యవస్థ ఐఎ్‌సఎ్‌సలో ఉందని ఆయన తెలిపారు.


సునీతకు ఎదురయ్యే సమస్యలు..

అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపి వచ్చిన వారు తిరిగి ఇక్కడి భూవాతావరణానికి అలవాటు పడడం కష్టమే. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు.. కాబట్టి శరీరం తేలికగా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండడం వల్ల ఆమె ఎముకలు పెళుసుబారి, కండరాలు క్షీణించి ఉంటాయి. రేడియేషన్‌ కారణంగా దృష్టి లోపం వంటి సవాళ్లను ఎదుర్కోవచ్చు. రక్త ప్రసరణలోనూ తేడా వస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకుని మళ్లీ భూవాతావరణానికి అలవాటు పడేందుకు నెలల సమయం పడుతుంది.

Updated Date - Mar 20 , 2025 | 04:23 AM