Kuwait: ప్రవాసులకు పరీక్షలు.. కువైత్ మరో సంచలన నిర్ణయం!
ABN , First Publish Date - 2022-11-06T09:07:26+05:30 IST
ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ (Kuwait).. తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.
కువైత్ సిటీ: ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ (Kuwait).. తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. కువైత్ వచ్చే కొత్త ప్రవాసులకు ఇకపై వృత్తిపరమైన పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ స్మార్ట్ మెకానిజంను తీసుకురానుంది. వివిధ దేశాలకు చెందిన కువైత్‌లోని రాయబార కార్యాలయాల భాగస్వామ్యంతో వారి దేశాలలో వారిని పరీక్షించడానికి స్మార్ట్ మెకానిజంను వినియోగించనుంది. టాప్ ప్రొఫెషన్స్‌లో జరిగే నియమకాల్లో మొదట ఈ టెస్టుల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా తమ ఉద్యోగులను పంపే దేశాల్లో మొదట పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి ప్రాక్టికల్, థియరిటికల్‌గా రెండు భాగాలుగా నిర్వహించబడతాయి. ప్రాక్టికల్ పరీక్ష వచ్చేసి కువైత్‌లో ఉంటే.. థియరిటికల్ టెస్టు వారివారి దేశాలలో నిర్వహించబడుతుంది.
ఇక మొదటి దశలో దాదాపు 20 వృత్తుల వారికి ఈ పరీక్షలు ఉంటాయని పీఏఎం పేర్కొంది. అలాగే ఇంజనీరింగ్ రంగంలోని కార్మికులకు కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (Kuwait Society of Engineers) నిర్వహించే టెస్టు అదనం. ఇంజనీరింగ్ రంగంలోని కార్మికులకు 71 రకాల ప్రొఫెషన్స్‌పై నిర్వహించే వృత్తిపరమైన పరీక్షల కోసం కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ఒక కేంద్రాన్ని సిద్ధం చేసింది. కాగా, కొత్త వర్క్ పర్మిట్‌లను (New work permits) లక్ష్యంగా చేసుకునే ఈ కొత్త విధానాన్ని కువైత్ సర్కార్ శ్రీకారం చుట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (Public Authority for Civil Information) విడుదల చేసిన గణాంకాల ప్రకారం నేచురల్ సైన్సెస్ (Natural sciences), ఇంజనీరింగ్‌లో సాంకేతిక నిపుణులు, అసిస్టెంట్ స్పెషలిస్టుల సంఖ్య 21,387కి చేరింది. అయితే, ఇకపై ఈ ఉద్యోగాలకు తాజాగా తీసుకువస్తున్న ప్రాక్టికల్, థియరిటికల్ టెస్టులు తప్పనిసరి అని పీఏసీఐ వెల్లడించింది.