జవహార్ లాల్ నెహ్రూ గురించి ఈ విషయం మీకు తెలుసా.. ఆయన 11 సార్లు..
ABN , First Publish Date - 2022-11-14T13:28:45+05:30 IST
ఈయన జీవితంలో ఆసక్తికరమైన ఘట్టాలు ఏమిటి ??
భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ. ఈయనను చాచా నెహ్రు అని కూడా పిలుస్తారు. ఈయనకు పిల్లలతో ఉన్న అనుబంధం కారణంగా ఈయన పుట్టినరోజు(నవంబర్ 14)ను బాలల దినోత్సవంగా 1957సంవత్సరం నుండి జరుపుకొంటున్నాం. నెహ్రు గురించి చరిత్రలో విభిన్న అభిప్రాయాలు ఉన్నా ఆయన జీవితంలో చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈయన నోబెల్ బహుమతి కోసం అనేకసార్లు నామినేట్ అయ్యారనే విషయం కాసింత ఆసక్తి పెంచుతుంది. అసలు నెహ్రు నోబెల్ బహుమతికి ఎందుకు ఎంపికయ్యారు. ఈయన జీవితంలో ఆసక్తికరమైన ఘట్టాలు ఏమిటి వంటి వివరాలలోకి వెళితే..
నవంబర్ 14, 1889లో జన్మించిన పండిట్ జవహార్ లాల్ నెహ్రూ.. కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. ఈయన తన జీవితంలో భారతదేశ అభివృద్దికి, ఇతర దేశాలతో పెంచుకున్న సత్సంబంధాలకు, శాంతి కోసం చేసిన కృషి కారణంగా నోబెల్ శాంతి బహుమతికి ఏకంగా 11సార్లు నామినేట్ అయ్యారు. ఇదంతా 1950-1955 సంవత్సరాల మధ్య జరిగింది. కానీ ఆయన నోబెల్ బహుమతిని అందుకోలేదు. ఈయన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావడానికి కృషి చేసినవారిలో మొదటివారు. 1929 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఎక్కువసార్లు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు.
నెహ్రూ తన జీవిత కాలంలో సుమారు 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారని మీకు తెలుసా.. అవును నిజం. ఆయన తన జీవితంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. 1930-1935 సంవత్సరాల కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఇతర ఉద్యమాలలో కూడా పాల్గొన్న కారణంగా అనేక సార్లు అరెస్ట్ అయ్యారు.
ఇలా ఆయన తన జీవిత కాలంలో దాదాపు 3,259 రోజులు జైలులోనే గడిపారు. ఇవి 9ఏళ్లకు సమానం. నెహ్రు జైలు జీవితం గడుపుతున్నప్పుడే.. తన జీవిత చరిత్రకు పుస్తక రూపం ఇచ్చారు. ఈ పుస్తకం అమెరికాలో 1936సంవత్సరంలో విడుదలైంది.
కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఈయన కుటుంబంలో.. నెహ్రూ ఒక్కరే పేరొందిన వ్యక్తి అనుకుంటే పొరబడినట్టే. ఈయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిలో ఈయన అక్క విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి మహిళ కాగా... నెహ్రూ చెల్లెలు కృష్ణహతీసింగ్ రచయిత్రిగా గుర్తింపు పొందారు. నెహ్రూ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సరైన సౌకర్యాలు లేకున్నా.. దాదాపు 15లక్షల మంది తరలి వెళ్లారు.
భారతదేశ మొదటి ప్రధాని, బాలల దినోత్సవానికి మూలకారకుడు అయిన పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇవీ.