Leharayi film review: ‘సారీ’ మా వల్ల కాదు

ABN , First Publish Date - 2022-12-09T11:14:33+05:30 IST

ఈ వారం చాలా చిన్న సినిమాలు పదికి పైగా విడుదల అవుతున్నాయి. అందులో 'లెహరాయి' ఒకటి. రంజిత్ అనే కుర్రాడు నాలుగేళ్ల క్రితం 'జువ్వ' అనే సినిమాతో ఆరంగేట్రం చేశాడు.

Leharayi film review: ‘సారీ’ మా వల్ల కాదు
Leharayi

సినిమా: లెహరాయి

నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, రావు రమేష్, వి కె నరేష్, సంధ్య జనక్, అలీ తదితరులు

ఛాయాగ్రహణం: ఎం ఎన్ బాల్ రెడ్డి

సంగీతం: ఘంటాడి కృష్ణ

నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్

రచన మరియు దర్శకత్వం: రామకృష్ణ పరమహంస మైల

-- సురేష్ కవిరాయని

ఈ వారం చాలా చిన్న సినిమాలు పదికి పైగా విడుదల అవుతున్నాయి. అందులో 'లెహరాయి' ఒకటి. రంజిత్ అనే కుర్రాడు నాలుగేళ్ల క్రితం 'జువ్వ' అనే సినిమాతో ఆరంగేట్రం చేశాడు. కానీ అది అంతగా విజయం సాధించలేదు. ఇప్పుడు అతను ‘లెహరాయి’ అనే ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సౌమ్య మీనన్ ఇందులో కథానాయికగా నటించింది. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చాలా కాలం విరామం తరువాత ఈ సినిమాకి సంగీతం అందించారు. రామకృష్ణ పరమహంస దీనికి దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (Leharayi film is released with Ranjith and Sowmya Menon as the lead pair with Rao Ramesh and VK Naresh playing important roles)

Leharayi story కథ:

మేఘన (సౌమ్య మీనన్) అనే అమ్మాయి తాను ఎప్పుడూ ప్రేమలో పడను అని, తండ్రి గౌరవానికి వ్యతిరేకంగా ప్రవర్తించను అని తన తండ్రికి (రావు రమేష్) మాటిస్తుంది. కార్తీక్ (రంజిత్) అనే అబ్బాయికి ‘సారీ’ అనే పదం నచ్చదు. ఎందుకంటే ‘సారీ’ చెప్పేకన్నా, చేసిన పని సరిదిద్దుకోవాలని అని అతని అభిప్రాయం. అటువంటి కార్తీక్, మేఘన ఒకే కాలేజీలో చదవుతూ వుంటారు. తొలి చూపులోనే మేఘనని చూసి ప్రేమలో పడిపోతాడు కార్తీక్. మేఘన వెనకాల ఒక రౌడీ ప్రేమిస్తున్నాను అంటూ వెనకాల పడతాడు, వాడి నుండి ఒకసారి తప్పించుకోవడానికి మేఘన కార్తీక్‌ని ప్రేమిస్తున్నాను అని అందరి ముందూ చెపుతుంది. అది ఆమె తండ్రి కూడా చూస్తాడు, చూసి కలత చెందుతాడు. ఇంటికి వచ్చిన మేఘన తను కార్తీక్ ని నిజంగా ప్రేమించటం లేదని, తప్పించుకోవడానికి వేరే దారి లేక అలా చేశాను అని చెప్పి తండ్రికి నచ్చచెపుతుంది. కార్తీక్ మాత్రం మేఘన తనని నిజంగానే ప్రేమిస్తోందని మేఘన మీద మరికొంచెం ఆశలు పెంచుకుంటాడు. అయితే మేఘన తండ్రి మాత్రం కార్తీక్‌కి ‘సారీ’ చెప్పేద్దాం అని కూతురికి చెప్తాడు. కానీ వాళ్లకి కార్తీక్‌కి ‘సారీ’ అన్న పదం నచ్చదు అని తెలిసి ఆగిపోతారు. ఇంతకీ మేఘన, కార్తీక్‌కి ‘సారీ’ చెప్పిందా, కార్తీక్‌కి ఎందుకు ఆ పదం అంటే పడదు, దాని వెనకాల వున్న కథ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

leharayi1.jpg

విశ్లేషణ:

దర్శకుడు రామకృష్ణ పరమహంస మైల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే అతను మామూలు కథనే ఎంచుకొని సినిమా తండ్రి కూతురు అనుబంధంతో మొదలు పెడతాడు. అయితే సినిమా కథ ఆ అనుబంధం మీద ఉంటుంది అనుకుంటే, అది కొద్దిసేపు మాత్రమే, ఆ తరువాత కథ వేరే వేపుకు వెళ్లిపోతుంది. లీడ్ యాక్టర్ ఎంట్రీ కూడా అదొక వెరైటీగా ఉంటుంది. అతనికి ‘సారీ’ అన్న పదం చెపితే కోపం వస్తుంది. కొడతాడు కూడా. ఇంకా స్టోరీ లీడ్ పెయిర్, వాళ్ల ప్రేమ గొడవలు అటు వెళుతుంది. కూతురు ప్రేమలో పడిందని తండ్రి బాధపడటం కూతురు నచ్చచెప్పటం ఇవన్నీ మామూలుగా వున్నాయి. ఆ తరువాత తండ్రీ కూతుళ్లు కార్తీక్‌తో సారీ చెప్పించటం కోసం చేసిన ప్రయత్నాలు మరీ సిల్లీగా దర్శకుడు చిత్రీకరించాడు. ఇక్కడే సినిమా కథ గాడి తప్పింది. సినిమాలో భావోద్వేగాలు కనిపించలేదు. ‘సారీ’ పదం వింటే కథానాయకుడికి ఎందుకు పడదో దర్శకుడు అంత గట్టిగా చెప్పలేకపోయాడు.

దర్శకుడు వాటి మీద దృష్టి పెట్టి, తండ్రి కూతుళ్ల అనుబంధం ఆ భావోద్వేగాల మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. అదీ కాకుండా సినిమాలో రావు రమేష్, వి కె నరేష్ లాంటి ఇద్దరు ముగ్గురు పేరున్న నటులు తప్పితే, చాలా మందిని ఎదో మొహమాటం కోసం సినిమాలో అలా నిలబెట్టి తీసేశాడు. వాళ్ల మొహాల మీద ఒక ఎమోషన్ ఉండదు, ఎక్స్ ప్రెషన్ కనపడదు. దర్శకుడు పూర్తిగా గందరగోళంలో పడినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే లవ్ స్టోరీ తీయాలా, లేక తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం చూపించాలా అన్న దానిమీద, చివరికి రెండింటినీ సరిగ్గా తీయలేక అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అనిపించాడు. అంతే కానీ, సినిమాగా చూస్తే మాత్రం మొత్తం విఫలం అయ్యాడనే చెప్పాలి. అలీ లాంటి పాత్రని ఎందుకు పెట్టాడో తెలియదు. ఊరికే మధ్యలో వస్తాడు, ఒక పాట కూడా పెట్టాడు అలీ కి. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడి తమ్ముడు ఇందులో హీరో కాబట్టి, బొత్స ఎదో మొహమాటానికి తమ పార్టీకే చెందిన అలీ కి కూడా ఏదైనా ఇవ్వండి అని చెప్పరేమో, అందుకని అలీ నీ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. అలీ పాత్ర అయితే ఫోర్స్ గా పెట్టినట్టుగా కనపడుతుంది. ఆ పాట తరువాత మళ్లీ అలీ కనిపించడు.

leharayi2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే రంజిత్ బాగానే చేశాడు, పరవాలేదు అనిపించాడు. మొహంలో భావాలు సరిగ్గా చూపించటంలో ఇంకా కొంచెం కష్టపడాలి. సౌమ్య మీనన్ కథానాయికగా బాగానే చేసింది, బాగుంది కూడా. కొన్ని సన్నివేశాల్లో ఆమె మొహం సరిగ్గా చూపించలేదు, కొన్ని సన్నివేశాల్లో బాగానే వుంది. అది ఏమైనా మరి సాంకేతిక లోపమో లేక ఆమె మొహానికి మేకప్ సరిగ్గా వేసుకోకపోవడమో. కానీ ఆమె చాల డిగ్నిఫయిడ్ గా చేసింది. రావు రమేష్ తండ్రిగా చక్కగా చేశాడు కానీ, అతని పాత్ర ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. సినిమాలో అతని పాత్ర ఒక హైలైట్ అని చెప్పాలి. అలాగే నరేష్ ఇంకో పక్క చాల బాగా చేశాడు. ముఖ్యంగా ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం చెప్పినప్పుడు చాల బాగా చేశాడు అని చెప్పాలి. ఈ ఇద్దరు సీనియర్ నటులు ఉండబట్టి సినిమా కొంచెం అయినా బాగుంది అని చెప్పవచ్చు. అలీ ఒక సన్నివేశంలో, అలాగే ఒక సాంగ్ లో కనపడతాడు. అంతే. విలన్‌గా వేసిన అబ్బాయి కూడా బాగున్నాడు. ఘంటాడి కృష్ణకి సంగీత దర్శకుడిగా ఇది ఒక కమ్ బ్యాక్ సినిమా. అతను సంగీతం పరవాలేదు అనిపించదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రంగానే వుంది. మాటలు అక్కడక్కడా బాగున్నాయి.

చివరగా, ‘లెహరాయి’ సినిమా ఈరోజు విడుదల అయినా పది సినిమాల్లో ఒకటిగా ఉండిపోతుంది. ‘సారీ’ ఈ సినిమా అంత గుర్తుపెట్టుకోవలసిన సినిమా అయితే మాత్రం కాదు.

Updated Date - 2022-12-09T11:55:29+05:30 IST