మెస్సీ మంత్రం ఆమె జీవితాన్నిమలుపు తిప్పింది..

ABN , First Publish Date - 2022-12-19T14:20:32+05:30 IST

మెస్సీ అనే పదంతో మొదలైన ఆమె ప్రయాణం చివరికి అతని కోసం.....

మెస్సీ మంత్రం ఆమె జీవితాన్నిమలుపు తిప్పింది..

కేరళలో ఒక మారుమూల గ్రామం. 2005 పూర్తయ్యి 2006 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది ప్రపంచం. అందరూ అవే పనులలో చాలా సందడిగా ఉన్నారు. కానీ దీనికి విభిన్నంగా మరోవైపు ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్ పట్టుకుంది చాలా మందికి. షాహిన్ ఇంట్లో టీ.వి ముందు కూర్చొని స్పోర్ట్స్ ఛానల్ చూస్తోంది. ఆమె తనకు ఏదైనా సందేహం వస్తే ఇంట్లో వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకెళ్ళి అడిగేది. అలాగే ఒకసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో వాళ్ళను అడిగింది 'మెస్సీ ఎవరు?' అని. అలా మెస్సీ అనే పదంతో మొదలైన ఆమె ప్రయాణం చివరికి అతని కోసం దేశాలు దాటేలా చేసింది. ఆసక్తి కరమైన షాహీన్ జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటే..

టీవిలో ప్రసారమవుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ లు చూస్తూ మెస్సీ వైపు ఆకర్షించబడింది షాహీన్. అతని పేరు విన్న తరువాత నుండి అతని గురించి సెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉండేది. అలా ఆమెకు తెలియకుండా మెస్సీ ఆమెకు ఒకానొక పాఠ్యాంశ గ్రంథం అయిపోయాడు. అతని గురించి న్యూస్ పేపర్స్ నుండి నెట్ వరకు అన్నిచోట్లా వెతికేది. చిన్నప్పుడు ఎదుగుదలకు సహకరించే హార్మోన్స్ సరిగా లేకపోయినా మెస్సీ ఎదుగుదల, వాటిని అతను అధిగమించిన తీరు తెలుసుకుని షాహిన్ చాలా ప్రభావితమైంది. దాంతో అతని మీద ఆసక్తి ఇంకా పెరిగింది. మెస్సీ కారణంగా ఆమె ఆటలో ఉన్న అన్ని విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది.

2010 సంవత్సరంలో మారడోనా న్యాయకత్వంలో మెస్సీ పాల్గొన్నాడు. అయితే ఆ ఆటలో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేక పోయాడు. ఇది చూసిన షాహీన్ చాలా డిజప్పాయింట్ అయ్యింది. దీని తరువాత మెస్సీ ఎక్కడా కనిపించలేదు. అతను అలా విఫలమైనప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు? అతని మనసులో ఏముండి ఉంటుంది? వంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంది. మెస్సీ ఎక్కడైనా ఇంటర్వూ ఇస్తున్న వీడియోస్ కనిపించినా అతను మాట్లాడే భాష షాహీన్ కు అర్థమయ్యేది కాదు. అతని స్పానిష్ షాహీన్ కు ఏదో వేరే గ్రహం భాషలాగా అనిపించేది. ఈ క్రమంలో 2012 సంవత్సరంలో ఫుట్ బాల్ ఛాంపియన్ మారడోనా కేరళకు వచ్చాడు. ఆ సందర్భంలో అతను మళయాళీ ప్రజలతో జర్నలిస్ట్ ల సహయంతో అక్కడి ప్రజలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్చించడం షాహీన్ ను ఇంప్రెస్ చేసింది. జర్నలిస్ట్ అయితే ఎంతో మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం వస్తుందని, దాని వల్ల సాధ్యం కానిది ఏదీ లేదని ఆమెకు అర్థమయ్యింది. జర్నలిస్ట్ అయ్యాక భాష ఒకటి వస్తే ఇక ఎలాంటి సమస్య ఉండదని నిర్ణయించుకుంది. దాంతో మెస్సీ గురించి ఏం తెలుసుకోవాలన్నా భాష నేర్చుకోవడం ముఖ్యమని అర్థమైంది.

Untitled-3.gif

భాష నేర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నట్టు చెప్పింది. 2013 సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం జవహార్ లాల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 2019 సంవత్సరంలో తన విద్య కంప్లీట్ అయ్యే లోపు స్పానిష్ భాషలో ఎం.ఏ పూర్తి చేసింది. ఈ సమయంలో ఎంతో మంది ఆమెను ఎన్నో రకాలుగా కామెంట్ చేసారు. 'స్పానిష్ నేర్చుకుని స్పెయిన్ లో ఎక్కడికి వెళతావు?' అని వేళాకోళం ఆడేవారు.

వాటన్నిటి అధిగమించి మరీ ఆమె తన లక్ష్యాన్ని పూర్తిచేసుకుంది. దానితరువాత ఆమె మెస్సీ ఇంటర్వూలు అన్నీ చూసి అర్థం చేసుకోగలిగింది. అంతేనా తాను కూడా ఎంతో ధైర్యంగా మెస్సీని ఇంటర్య్వూ చేయగలను అన్న ధీమాకువచ్చింది. పెళ్ళై ఒక బిడ్డకు తల్లి అయిన ఈమె మాడ్రిడ్ నగరంలో ఉన్న జర్నలిజం స్కూల్ లో జర్నలిజం స్టూడెంట్ గా చేరింది.

దీని తరువాత స్పానిష్ మంత్రిత్వశాఖ సహాయంతో స్పానిష్ టీచర్ గా అవకాశం పొందింది. ఇలా ఆమె మెస్సీని బార్సిలోనా జెర్సీలో చూడటానికి తనవంతు ప్రయత్నాలు చేసింది. ఆమె ప్రయత్నం ఫలితంగా ఆమెకు స్టేడియంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. అయితే బారికేడ్ దగ్గర నిలబడుకుని చూడటం తప్ప వేరే ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఆమె లోపలికి వెళ్ళినా, ఫోటోలు తీసినా, వేరే ఏమి చేసినా ఆమెను అడ్డుకునేవారు ఉండరు కానీ.. అలా చేస్తే అన్నేళ్ళు ఆమె కష్టపడి సంపాదించినది మొత్తం బూడిదలో పోసిన పన్నీరయినట్టు ఆమెను సింపుల్ గా బ్యాన్ చేసే అవకాశం ఉండటంతో ఆమె తన ఎక్సైట్మెంట్ ను అణుచుకుని ఉండిపోయింది. అయితే కేరళ నుండి తన ప్రయాణం మొదలు పెట్టిన షాహిన్ మెస్సీని ఇంటర్వ్యూ చేయాలన్న తన కలను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ లో మెస్సీ గెలవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈమెకు ఎంతగానో సహకరించిన ఈమె భర్త కృషి కూడా ఈమె విజయంలో భాగమై ఉంది.

ఇలా ఒక వ్యక్తిమీద ఆసక్తి ఆమెను భాష నేర్చుకునేవైపు మాత్రమే కాకుండా దేశం దాటే అవకాశాన్ని కూడా ఇచ్చింది. మెస్సీపై ఈమె అభిమానం ఈమెను స్పెషల్ గా నిలబెట్టింది. అన్నట్టు వరల్డ్ కప్‌లో మెస్సీ సేన విజయం సాధించింది.. ఆమె కోరుకున్నట్టుగానే చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న దిగ్గజం మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించింది....

Updated Date - 2022-12-19T14:37:09+05:30 IST