New Zealand vs Pakistan: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్.. కానీ పాక్‌కు అదృష్టం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-09T13:25:17+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ అత్యంత కీలక దశకు చేరింది. నేడు సిడ్నీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు..

New Zealand vs Pakistan: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్.. కానీ పాక్‌కు అదృష్టం ఏంటంటే..

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) అత్యంత కీలక దశకు చేరింది. నేడు సిడ్నీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల (New Zealand vs Pakistan) మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. దీంతో ఇక ఏ జట్టుకూ రెండో అవకాశమే లేదు. గెలిస్తే సరి.. లేకుంటే ఇంటికే. సూపర్‌-12లో కివీస్‌ అద్భుత ఆటతీరుతో ఆసీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి నాకౌట్‌ దశకు చేరింది. ఓ మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. అటు పాక్‌ (Pakistan) ప్రస్థానం మాత్రం కిందామీదా పడుతూ సాగింది. భారత్‌, జింబాబ్వే చేతిలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడాక ఆ టీమ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్స్‌ కూడా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ టోర్నీ నుంచి బయటికి వెళ్లాల్సిన జట్టుకు నెదర్లాండ్స్‌ విజయంతో ఊహించని రీతిలో అదృష్టం కలిసొచ్చింది. ఈ ఉత్సాహంతో బంగ్లాపై గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు ప్రత్యర్థి కివీస్‌పై పాక్‌కు మెరుగైన రికార్డు ఉండడం సానుకూలాంశం. కానీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్‌ ఈసారి పాక్‌కు చెక్‌ పెట్టాలన్న కసితో ఉంది. ఇదిలా వుండగా ప్రస్తుత టోర్నీలో ఎస్‌సీజీ మైదానంలో కివీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో, పాక్‌ ఆడిన ఓ మ్యాచ్‌లోనూ విజయాలు సాధించాయి.

ఓపెనర్లు కుదురుకుంటే..

పాక్‌ సాధించిన విజయాల్లో ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌లకు ఎలాంటి భాగస్వామ్యం లేకపోయింది. టీ20 ఫార్మాట్‌లో ఈ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లయినప్పటికీ ఫామ్‌ లేమితో ఒత్తిడిలో ఉన్నారు. బంగ్లాపై 128 పరుగుల ఛేదనలో కూడా విఫలమయ్యారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో వారి బ్యాట్లు గర్జిస్తే మాత్రం కివీస్‌ బౌలర్లకు కష్టకాలమే. మిడిలార్డర్‌లో ఇఫ్తికార్‌, షాన్‌ మసూద్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. అయితే పాక్‌ బలమంతా వారి బౌలింగే. పేసర్లు షహీన్‌ అఫ్రీది, రౌఫ్‌, నసీమ్‌ షా, మహ్మద్‌ వసీంలపై ఆధారపడింది. బంగ్లాపై నాలుగు వికెట్లతో షహీన్‌ ఫామ్‌లోకి రావడం జట్టు బౌలింగ్‌ బలాన్ని మరింత పెంచినట్టయింది.

ఆల్‌రౌండ్‌ ప్రతిభతో..

పాక్‌ మాదిరే కివీస్‌ బౌలర్లు కూడా ప్రత్యర్థి జట్లపై చెలరేగుతున్నారు. ఇదే మైదానంలో ఆసీస్‌, శ్రీలంక టాపార్డర్‌ను పేసర్లు బౌల్ట్‌, సౌథీ కుప్పకూల్చి జట్టుకు సునాయాస విజయాలనందించారు. ఇదే తరహాలో ఫామ్‌లో లేని పాక్‌ ఓపెనర్లను దెబ్బతీసి ఆదిలోనే ఒత్తిడిలోకి నెట్టాలనుకుంటున్నారు. లోకీ ఫెర్గూసన్‌ కూడా పదునైన బంతులతో వికెట్ల వేట కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో టాపార్డర్‌లో ఫిన్‌ ఆలెన్‌, కాన్వే, కెప్టెన్‌ విలియమ్సన్‌తో పాటు మిడిలార్డర్‌లో ఫిలిప్స్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అలాగే వేలి గాయం తర్వాత బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ కూడా ఆకట్టుకుంటున్నాడు. కానీ లెగ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంతో కేన్‌, మిచెల్‌ ఇబ్బందిపడుతున్నారు. దీంతో షాదాబ్‌ పాక్‌ జట్టుకు కీలకం కానున్నాడు.

తుది జట్లు

పాకిస్థాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌(వికెట్ కీపర్), బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ హరీస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌, మహ్మద్‌ వసీం జూనియర్, నసీమ్‌ షా, షహీన్‌, రౌఫ్‌.

న్యూజిలాండ్‌: ఆలెన్‌, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిలిప్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, బౌల్ట్‌, సోధీ, ఫెర్గూసన్‌

Updated Date - 2022-11-09T13:31:42+05:30 IST