Share News

సార్ల కోసం..

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:04 PM

పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ వేదికగా ప్రారంభించారు. ఇక నుంచి తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సార్ల కోసం..
నారాయణపేట జిల్లా కేంద్రంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రారంభం కాని సన్న బియ్యం పథకం

ఎమ్మెల్యేలు ప్రారంభిస్తేనే పంపిణీ చేస్తామంటున్న అధికారులు

ఇంకా చాలా దుకాణాలకు చేరని బియ్యం..

నేడు చాలా నియోజకవర్గాల్లో పంపిణీ..

రేషన్‌ అక్రమాలకు చెక్‌ పడినట్లేనా?

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ వేదికగా ప్రారంభించారు. ఇక నుంచి తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు, ఆ తర్వాత రోజు సెలవులు ఉండటం, మంగళవారం రోజు ఎమ్మెల్యేలు అందుకు అనుగుణంగా కార్యక్రమ ఏర్పాట్లు చేసుకోకపోవడంతో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో అన్ని చోట్ల పథకం ప్రారంభం కాలేదు. బియ్యం కూడా అన్ని దుకాణాలకు ఇంకా సరఫరా కాలేదు. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారు. ఆలోపే డీలర్ల నుంచి ఇండెంట్‌ తీసుకుని.. బియ్యం సరఫరా చేస్తారు. సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం కంటే ముందే అన్ని దుకాణాలకు బియ్యం తరలించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ ఇప్పటిరకు దుకాణాలకు తరలింపు పూర్తి కాలేదు. కొన్ని మండలాలకు అసలే వెళ్లలేదు. ఇంకా రెండు మూడు రోజుల సమయం సరఫరాకే సరిపోతుందని అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పుడు అధికారులు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం సీఎం పథకం ప్రారంభించినా.. జిల్లా స్థాయిల్లో మాత్రం సరఫరా పూర్తికాకపోడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట, జడ్చర్ల, గద్వాల తదితర నియోజకవర్గాల్లో మాత్రమే మంగళవారం పంపిణీ ప్రారంభం ప్రారంభమైంది. మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రారంభం కాలేదు. అందుకు కారణం బియ్యం అన్ని దుకాణాలకు చేరకపోడం ఒకటైతే.. ఎమ్మెల్యేలు పథకం ప్రారంభానికి అనుగుణంగా కార్యక్రమాలు పెట్టుకోకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు. మంగళవారం నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తారని దుకాణాలకు వచ్చిన లబ్ధిదారులు.. పంపిణీ లేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.

ఎమ్మెల్యేలు లేకనే..

సాధారణంగా సీఎం పథకం ప్రారంభించిన రోజే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ ప్రారంభం కావాలి. కానీ ఆ రోజు ఉగాది, తర్వాత రోజు రంజాన్‌ సెలవులు ఉండటంతో పంపిణీ ప్రారంభం కాలేదు. ఎమ్మెల్యేలు కూడా వేడుకల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. మంగళవారమైనా పథకం ప్రారంభం కావాల్సి ఉండగా, ఎమ్మెల్యేలు అసలు కార్యక్రమాలు పెట్టుకోలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోవడంతో పంపిణీ మొదలు కాలేదు. అధికారులను పంపిణీ ఏదని అడిగితే ఎమ్మెల్యేలు ప్రారంభించిన తర్వాతనే పంపిణీ చేస్తామని చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు మేలు చేసే పథకం విషయంలో ఇంత నిర్లిప్తతపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో లాంఛనంగా ఒకచోటైనా ప్రారంభిస్తే.. మిగతా చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. నారాయణపేట, జ డ్చర్ల నియోజకవర్గాల్లో మం గళవారం పథకం ప్రారంభం కాగా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో బుధవారం నుం చి ప్రారంభించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో సన్న బియ్యం దుకాణాలకు సరఫరా కావడానికి మరో ఐదు రోజులు పడుతుందని చెబుతున్నారు.

రేషన్‌ అక్రమాలకు చెక్‌ పడినట్లేనా?

ప్రభుత్వం పీడీఎస్‌ బియ్యం పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతీ నెలా పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ.. దొడ్డు బియ్యం కావడంతో తినేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కొందరు ఇళ్లకు తీసుకువచ్చి.. సంవత్సరానికి రెండుసార్లు విక్రయిస్తుండగా, కొందరు రేషన్‌ దుకాణాల్లోనే తంబ్‌ వేసిన తర్వాత బియ్యం తీసుకోకుండా డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. కిలో బియ్యానికి రూ.10 వరకు ఇస్తున్నారు. కేవలం లబ్ధిదారులు దొడ్డు బియ్యం తినడానికి ఇష్టపడకపోవడం వల్లనే ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సన్న బియ్యం అందరికీ పంపిణీ ప్రారంభించిన తర్వాత వాటిని ప్రతీ ఒక్కరూ తినే అవకాశం ఉంది. అప్పుడు రేషన్‌ బియ్యం అక్రమాలు తగ్గుతాయని, సంక్షేమం అప్పుడే కచ్చితంగా లబ్ధిదారులకు అందినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Apr 01 , 2025 | 11:04 PM