బీజేపీ సీనియర్‌ నేత మందాడి కన్నుమూత

ABN , First Publish Date - 2022-11-14T02:42:52+05:30 IST

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

బీజేపీ సీనియర్‌ నేత   మందాడి కన్నుమూత

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర

కవి, రచయిత, గాయకుడిగా గుర్తింపు

ఆయన ఒత్తిడితోనే తెలంగాణకు

అనుకూలంగా 1971లో జనసంఘ్‌,

1997లో బీజేపీ తీర్మానాలు

2004లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లోకి..

2012లో తిరిగి బీజేపీ గూటికి మందాడి

రేపు హనుమకొండలో అంత్యక్రియలు

హనుమకొండ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మందాడికి భార్య తారమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయనస్వగ్రామం జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ మండలం ఇప్పగూడ. 1936 సెప్టెంబరు 2న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన కరుడుగట్టిన జాతీయవాది. పక్కా తెలంగాణవాది. మంచి కవి, రచయిత, గాయకుడు, వక్త కూడా. ఆయన వెయ్యికిపైగా పాటలు రాసి, పాడారు. జనసంఘ్‌, బీజేపీలో ఉంటూనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు చేశారు. సమైక్యవాదాన్ని బలపరిచే జనసంఘ్‌ చేత 1971లో, బీజేపీ చేత 1997లోనూ తెలంగాణ ఏర్పాటుపై తీర్మానాలు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పాట రూపంలో అసెంబ్లీలో ఎలుగెత్తారు. 1952లో ఆయన ఆర్‌ఎ్‌సఎ్‌్‌సలో చేరి ప్రచారక్‌గా క్రియాశీల పాత్ర పోషించారు. 1957లో భారతీయ జనసం్‌ఘలో చేరారు.

బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ సాంస్కృతిక రాష్ట్ర కన్వీనర్‌గా పని చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం సమయంలో మందాడి జనసం్‌ఘలో ఉన్నప్పటికీ పరోక్షంగా మద్దతు ఇచ్చారు. బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీ జెండా కింద తెలంగాణ ప్రజా పరిషత్‌ అని పెట్టి తెలంగాణ సాధనకు ఊరూరా తిరిగారు. ఆయన ఒత్తిడితోనే పార్టీ చివరకు కాకినాడలో తెలంగాణకు అనుకూలంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటులో మందాడి పాలుపంచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పాటలు పాడుతూ, ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఉద్యమ సమయంలో 2004లో హనుమకొండ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పక్షాన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేసీఆర్‌తో విభేదించారు. తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. 2012లో తిరిగి బీజేపీలో చేరారు.

నాయకుల సంతాపం

మందాడి మృతికి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మందాడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. బీజేపీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగాలతో మందాడి అందర్నీ ఆకర్షించారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ ఎంపీ కేలక్ష్మణ్‌, ఆ పార్టీ నేతలు పీ మురళీధర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు కూడా సంతాపం తెలిపారు. మందాడి అంత్యక్రియలను మంగళవారం హనుమకొండలోని పద్మాక్షిగుట్ట వద్ద గల హిందూ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

Updated Date - 2022-11-14T02:42:53+05:30 IST

News Hub