60 శాతం అక్రమాలు
ABN , First Publish Date - 2022-11-04T12:58:24+05:30 IST
నాలాల్లో పూడికతీతలో అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికపై సాంకేతిక విచారణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. సాంకేతిక
నాలాల పూడికతీతపై విజిలెన్స్ నివేదికలో వెల్లడి
సాంకేతిక విచారణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం
జోన్ల వారీగా ఎస్‌ఈలకు బాధ్యతలు
హైదరాబాద్ సిటీ: నాలాల్లో పూడికతీతలో అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికపై సాంకేతిక విచారణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. సాంకేతిక అంశాల పరిశీలన బాధ్యత సూపరింటెండెంట్ ఇంజనీర్ల(ఎ్‌సఈ)కు అప్పగించింది. ఓ జోన్ పరిధిలోని ఎస్‌ఈ మరో జోన్ పూడికతీతకు సంబంధించిన రికార్డులు పరిశీలించనున్నారు. నివేదికలోని పలు అంశాలకు సంబంధించి సందేహాలున్న నేపథ్యంలో ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం ఎస్‌ఈలు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ .45 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులు సక్రమంగా జరగలేదన్న పౌరుల ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్ ఆదేశించారు. ఏడాదికిపైగా విచారణ జరిపిన సంస్థలోని విజిలెన్స్ విభాగం.. 200 పేజీలతో కూడిన నివేదికను నాలుగు నెలల క్రితం సమర్పించింది. క్షేత్రస్థాయిలో 50 శాతం కూడా పనులు జరగలేదని, వ్యర్థాల తొలగింపు, తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడంలో పలు సర్కిళ్ల ఇంజనీరింగ్ విభాగం అధికారులు విపలమైనట్టు నివేదికలో పేర్కొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో వ్యర్థాలు వేసినట్టు చూపాల్సిన వే బిల్లులూ (తూకం రశీదు) పూర్తిస్థాయిలో లేనట్టు గుర్తించారు. స్ర్టెచ్‌ల వారీగా నాలాలు పరిశీలించడంతోపాటు.. పనులు జరిగాయా? లేదా? తొలగించిన వ్యర్థాలు తరలించారా? వరదలతోపాటు తిరిగి నాలాల్లో చేరాయా? అన్న దానిపై స్థానికుల అభిప్రాయాలు తీసుకున్నట్టు నివేదికలో పొందుపర్చారు.
పూర్తి వివరాలు ఇవ్వని ఇంజనీర్లు
మొత్తం 356 పనులకుగాను.. 148 పనులు సక్రమంగా ఉన్నట్టు నివేదికలో స్పష్టం చేశారు. మిగతా పనులు జరిగిన తీరుపై విజిలెన్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పనులకు సంబంధించి సంబంధిత ఇంజనీర్లు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. చాలా వరకు వ్యర్థాలు తరలించిన వే బిల్లులు సమర్పించలేదు. టెండర్ ప్రక్రియ, ఒప్పందాల వివరాలూ ఇవ్వలేదని నివేదికలో పొందుపర్చారు. వ్యర్థాల తొలగింపు, తరలింపునకు ఆధారాలూ సమర్పించలేకపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సాంకేతిక విచారణలో ఆయా విషయాలను సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 208 పనులు సరిగా జరగలేదని విజిలెన్స్ విచారణ స్పష్టం చేసింది. మొత్తం పనుల్లో ఇది 60 శాతం కావడం గమనార్హం.
ఇదో కొత్త డ్రామా?
ఓ జోన్‌కు సంబంధించిన పూడికతీత పనుల విచారణ బాధ్యతలు మరో జోన్ ఎస్‌ఈకి అప్పగించినట్టు కేంద్ర కార్యాలయంలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్‌ఈలు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన ఏఈ, డీఈ, ఈఈల వివరణ కోరడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇక్కడే ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నివేదికను బుట్టదాఖలు చేసే కుట్రలో భాగంగానే సాంకేతిక విచారణ పేరిట కొత్త డ్రామాకు తెర తీశారన్న ఆరోపణలున్నాయి. పూడికతీత పనులు పర్యవేక్షించాల్సిన అధికారులకే జోన్ మార్చి పరిశీలన బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వాస్తవాలు బయటకు వస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అవగాహనలో భాగంగా సాంకేతికంగా జరిగిన పొరపాట్లనూ కప్పి పుచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గతంలో పనిచేసిన ఎస్‌ఈలు బదిలీ అయి.. ఆ పనులతో సంబంధం లేని అధికారులు వచ్చారు. విచారణలో పక్షపాతం ఉండదని ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎస్‌ఈల నివేదిక వస్తే కానీ.. వాస్తవాలు బయటపడ్డాయా? లేదా? అన్నది తేలనుంది.