CBI : సీబీఐకి ఎర్రజెండా

ABN , First Publish Date - 2022-10-31T04:57:28+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) రాష్ట్ర సర్కారు ఎర్రజెండా చూపింది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి సంబంధించి ఇన్నాళ్లుగా ఇస్తూ వస్తున్న ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది.

CBI : సీబీఐకి ఎర్రజెండా
CBI

కేంద్ర దర్యాప్తు సంస్థకు సాధారణ సమ్మతిని

ఉపసంహరిస్తూ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

ఆగస్టులోనే జీవో విడుదల.. ఇన్నాళ్లూ గోప్యత

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చిన ఏఏజీ

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) రాష్ట్ర సర్కారు ఎర్రజెండా చూపింది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి సంబంధించి ఇన్నాళ్లుగా ఇస్తూ వస్తున్న ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 31న సీఎం కేసీఆర్‌ బిహార్‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు.. అన్ని రాష్ట్రాలూ సీబీఐకిచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆ పిలుపు ఇవ్వడానికి ఒకరోజు ముందే.. అంటే ఆగస్టు 30న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఈమేరకు జీవోఎంఎస్‌ నంబరు 51 జారీ చేశారు. కానీ, ఇన్నాళ్లుగా ఆ విషయాన్ని బయటపెట్టకుండా గుట్టుగా ఉంచారు. ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. అయితే, రెండు నెలలుగా గోప్యంగా ఉంచిన ఈ జీవో గురించి అనూహ్యంగా బయటపడింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. కోర్టు తన ఆదేశాల్లో ఈ విషయాన్ని పేర్కొనడంతో ఇది బయటికొచ్చింది. ఓ వైపు ఢిల్లీ మద్యం కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేయడం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు బహిర్గతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త కాదు..

సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రెడ్‌ సిగ్నల్‌ చూపడం ఇదేం కొత్త కాదు. గతంలో పశ్చిమబెంగాల్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ, కేరళ, ఝార్ఖండ్‌, మిజోరం రాష్ట్రాలు ఇదే తరహాలో తమ తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నాయి. ఏపీలో 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం ఇలాగే సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా.. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించింది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అలాగే జరిగింది.

సాధారణ సమ్మతి ఎందుకు...

దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలూ ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. వాటిప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు.

Updated Date - 2022-10-31T04:57:31+05:30 IST