FEMA: ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసుపై ఈడీ దర్యాప్తు
ABN , First Publish Date - 2022-11-21T16:30:19+05:30 IST
ఫెమా (విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ విచారణకు పలువురు గ్రానైట్ వ్యాపారులు (Granite Merchants) హాజరయ్యారు.
హైదరాబాద్: ఫెమా (విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ విచారణకు పలువురు గ్రానైట్ వ్యాపారులు (Granite Merchants) హాజరయ్యారు. 2013లో అప్పటి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు (Vigilance officers) నివేదిక సమర్పించారు. రూ.124 కోట్ల పన్ను ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. ఇటీవల 8 గ్రానైట్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల ఆధారంగా గ్రానైట్ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు. గ్రానైట్ కాంట్రాక్టర్లంతా కరీంనగర్ (Karimnagar)కు చెందినవారని సమాచారం.
ఇటీవల మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతోపాటు హైదరాబాద్, కరీంనగర్‌లోని సంస్థలు ఫెమా నిబంధనలను అతిక్రమించినట్లు ఈడీ తేల్చింది. ఈ సంస్థలన్నీ చైనా, హాంకాంగ్‌తోపాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్ ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఈడీ నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. ఇక చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లివెన్ హ్యూ పేరు ఉండటం విశేషం.
కరీంనగర్ క్వారీ లీజు ప్రాంతాల్లో తీగ లాగితే..
గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ కోణంలో ఈడీ సోదాలు నిర్వహించిందని అంతా అనుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించామని తమ ప్రకటనలో ఈడీ అధికారులు వెల్లడించడం గమనార్హం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29.05.2013లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అప్రైజల్ నివేదిక నంబరు 6(సి.నెం.268/ఎన్‌ఆర్/2013) ప్రకారం 7,68,889.937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు ప్రకటనలో ఈడీ వెల్లడించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎగవేసిన సీనరేజ్ ఫీజు రూ. 124,94,46,147. ఎగవేసిన పెనాల్టీ రూ. 624,72,30,735 రెండు కలిపి మొత్తం రూ. 729,66,76,882గా తేల్చింది. అప్పటి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.