బొల్లారం మున్సిపాలిటీకి మహర్దశ

ABN , First Publish Date - 2022-11-28T23:21:51+05:30 IST

మినీ ఇండియాగా పేరున్న బొల్లారం మున్సిపాలిటీలో అభివృద్ధి జోరందుకుంది. ఓవైపు సీఎం కేసీఆర్‌ కేటాయించిన రూ. 25 కోట్ల స్పెషల్‌ ఫండ్‌తో చేపట్టిన పనులు, మరోవైపు రూ. 28 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు చకచకా జరుగుతున్నాయి.

బొల్లారం మున్సిపాలిటీకి మహర్దశ

సీఎం ప్రత్యేక నిధులతో తీరనున్న సమస్యలు

రూ. 25 కోట్ల స్పెషల్‌ ఫండ్‌తో అభివృద్ధి పనులు

రూ. 28.69 కోట్లు మిషన్‌ భగీరథ నిధులతో ఇంటింటికీ తాగునీరు

జిన్నారం, నవంబరు 28: మినీ ఇండియాగా పేరున్న బొల్లారం మున్సిపాలిటీలో అభివృద్ధి జోరందుకుంది. ఓవైపు సీఎం కేసీఆర్‌ కేటాయించిన రూ. 25 కోట్ల స్పెషల్‌ ఫండ్‌తో చేపట్టిన పనులు, మరోవైపు రూ. 28 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అధిక పరిశ్రమలు గల మున్సిపాలిటీగా, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఉపాధి కేంద్రంగా ఉన్న బొల్లారంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పరిష్కారానికి మున్సిపల్‌ ఆదాయం సరిపోక ఇక్కట్లు పడుతున్న వేళ సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలో ఇచ్చిన హమీ మేరకు ఇటీవల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు.

సమస్యలకు నెలవు

హైదరాబాద్‌కు సరిహద్దుల్లో ఉన్న బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో 325 వరకు పరిశ్రమలు ఉన్నాయి. 70 వేల జనాభా ఉండగా ఇందులో అత్యధికులు వలస కార్మికులే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చినవారు 50వేల మంది ఉన్నారు. ఏటా రూ. 10 కోట్ల ఆదాయం ఉన్నా సమస్యలూ అదేస్థాయిలో నెలకొన్నాయి. 22 కాలనీలు ఉన్న పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి రూ. 53 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.

తీరనున్న వెతలు

సీఎం స్పెషల్‌ ఫండ్‌తో ప్రధాన సమస్యలు తీరనున్నాయి. రూ. 3 కోట్లతో నూతన మున్సిపల్‌ ఆఫీసు, రూ. 2 కోట్లతో సమీకృత మార్కెట్‌, రూ. కోటితో డంప్‌యార్డ్‌, రూ. 50 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, రూ. 1.88 కోట్లతో హనుమాన్‌ ఆలయం నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు, ఐటీసీ పరిశ్రమ వెనుక నుంచి రూ. 1.38 కోట్లతో బీటీ రోడ్ల పనులు చేయాలని నిర్ణయించారు. కుడికుంట, మీదికుంట, మాధవాని కుంటల అభివృద్ధికి రూ. 1.85 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25 లక్షలు కేటాయించారు. పలు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపటనున్నారు. మిషన్‌ భగీరథ నిధులతో మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీరనున్నది. నిత్యం 20 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 2 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఈ నిధులతో 45 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం 22 కాలనీల్లో పైప్‌లైన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సరిపడా నీటి సరఫరా జరగనుంది.

Updated Date - 2022-11-28T23:21:52+05:30 IST