వెంచర్‌ చెరలో ప్రభుత్వ భూమి

ABN , First Publish Date - 2022-10-19T05:05:34+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెంచర్‌ చెరలో ప్రభుత్వ భూమి
ప్రభుత్వ భూమిలో నుంచి వెంచర్‌ కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు

చేర్యాలలో 23 గుంటల దేవాదాయశాఖ భూమి కబ్జా

వెంచర్‌లో కలిపేసిన యాజమాన్యం

ప్రభుత్వ భూమిలోంచి ప్లాట్లకు 20 ఫీట్ల రోడ్లు

 మ్యాప్‌ను మార్చి సహకరించిన రెవెన్యూ అధికారులు

రైతుల భూములనూ కలుపుకునేందుకు యత్నం


కంది, అక్టోబరు 18 : తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నక్షా బాటలు, కట్టు కాలువలు, శిఖం భూములు, చెరువులు, కుంటలు, చివరికి దేవాదాయ భూములు ఆక్రమణలకు గురవుతుంటే ఆపాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కంది మండల పరిధిలోని చేర్యాల గ్రామంలో సర్వే నంబరు 709లో 12 గుంటలు, 713 సర్వే నంబర్‌లో 11 గుంటల దేవాదయశాఖ భూమి ఉన్నది. ఆ భూమి చుట్టూ ఉన్న స్థలాలను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి వెంచర్‌గా మార్చడంతో మధ్యలో సదరు 23 గుంటల భూమి చిక్కుకున్నది. దీంతో వెంచర్‌ యాజమాన్యం ఆ భూమిని చెరబట్టేందుకు సిద్ధమైంది. రెవెన్యూ అధికారులు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో దేవాదాయశాఖ భూమిని వెంచర్‌లో కలిపేసుకున్నారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తడంతో నాలుగు నెలల క్రితం ఆర్‌ఐ, సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బందితో కలసి వెంచర్‌లో ఉన్న సర్వే చేసి దేవాదాయశాఖ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. వెంటనే వెంచర్‌ యాజమాన్యం రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఇంకేముంది కోట్ల రూపాయల విలువైన దేవాదయశాఖ భూమి వెంచర్‌లో కలసిపోయింది. భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకుండా 23 గుంటల భూమికి సంభందించి నక్షాను కూడా రెవెన్యూ అధికారులు మార్చేసినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వెంచర్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ భూమిలోంచి 20 ఫీట్ల రోడ్లు కూడా వేసుకున్నారు.


రైతుల భూములపైనా కన్ను

సదరు వెంచర్‌ చుట్టూ ఎక్కువగా పంట పొలాలు, లావుణి పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములను సైతం వెంచర్‌లో కలిపేసుకోవడానికి రియల్టర్లు పన్నాగం పన్నారు. ఇప్పటికే కొందరిని బెదిరిస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపించారు. వెళ్లేందుకు పొలాల మధ్య ఉన్న 10 ఫీట్ల వెడల్పు బాటను అరకిలోమీటరు మేర 20 ఫీట్ల రోడ్డుగా మార్చారని తెలియజేశారు. ఇందుకోసం అరకిలోమీటరు మేర పక్కన ఉన్న లావుణి పట్టా భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకుంటున్నారు. లావుణి పట్టా ఉన్న రైతులను బెదిరించి ఎంతోకొంత ముట్టజెప్పి రోడ్డు పనులు చేస్తున్నారని వాపోయారు.


ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కంది మండలంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మండలంలో నక్షాబాటలు, దేవాదాయశాఖ భూములు, చెరువు, శిఖం భూములు, కట్టుకాల్వలు అన్యాక్రాంతమవుతున్నాయి. నాలుగు నెలల క్రితం చేర్యాల శివారులో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో మలుపు వద్ద ఉన్న ఓ వెంచర్‌లో అర ఎకరం నక్షాబాటను వెంచర్‌లో కలుపుకోవడానికి అధికారులే సహకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. కందిలోని కిసాన్‌సాగర్‌ చెరువు, దేవుని చెరువు కింద ఏర్పాటైన వెంచర్లు కాల్వలను ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి గ్రామల్లో కాపాడుకుంటూ వచ్చిన భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి వినియోగించడానికి గజం స్థలం కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పలువురు రైతులు వెంచర్‌లో తమ భూములను కలిపేసుకోవద్దని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు కల్పించుకోవాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-10-19T05:05:34+05:30 IST