సింబల్ ఆఫ్ చారిటీగా సత్యసాయి సేవా సంస్థ
ABN , First Publish Date - 2022-11-18T00:05:17+05:30 IST
కొండపాక ఆనంద నిలయం ఆవరణలోని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన సత్యసాయితో కలిసి హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు.

ఆపదలో అండగా నిలవడంలోనే ఆనందం
పిల్లల గుండెకు భరోసాగా ఆస్పత్రి
ఇక్కడ ఏర్పాటు చేయడం మన అదృష్టం
ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
కొండపాక, నవంబరు 17 : విద్యా, వైద్యంతో పాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న సత్యసాయి సేవా సంస్థ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కొండపాక ఆనంద నిలయం ఆవరణలోని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన సత్యసాయితో కలిసి హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత గుండె ఆపరేషన్ చికిత్సలు చేసే దక్షిణ భారతదేశంలోనే మొదటి ఆస్పత్రిని సత్యసాయి సేవా సంస్థ వారు కొండపాకలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతీ వంద మందిలో ఒక చిన్నారి గుండె సంబంధిత వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఆస్పత్రి ఈ ప్రాంతవాసులకే కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శిబిరాలను ఏర్పాటు చేసి గుండె వ్యాధితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ఈ ఆస్పత్రిలో చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల గుండెకు సత్యసాయి ఆస్పత్రి భరోసాగా నిలుస్తుందన్నారు. ఆస్పత్రికి ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందన్నారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో 100 పడకలతో అధునాతన విధానంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు అదృష్టమన్నారు. ఎవరి శక్తి మేరకు వారు ఆపదలో ఉన్నవారికి ప్రజాహిత సేవలు అందిస్తే ఎంతో ఆనందం దక్కుతుందన్నారు. ఈ విద్యాలయం, వైద్యాలయం, ఆనంద నిలయం కొండపాకలో వచ్చేలా కర్త, కర్మ, క్రియగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. సద్గురు మధుసూదన సాయి మాట్లాడుతూ గత సంవత్సరం విద్యాలయం ప్రారంభోత్సవంలో వైద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరగా నేడు వైద్యాలయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ వైద్యాలయం ద్వారా కావాల్సిన వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. మనుషుల్లో ఉండే భగవంతుని గుర్తించడమే నిజమైన మాధవ సేవ అని ఆయన తెలియజేశారు. నవంబరు 23 రోజున సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకుని నేడు ఈ వైద్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వైద్యాలయం త్వరగా పూర్తయ్యేలా కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అనంతుల అశ్వినిప్రశాంత్, ఎంపీపీ రాగల సుగుణదుర్గయ్య, సర్పంచ్ చిట్టి మాధురి, సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు జగన్నాథశర్మ, కొండలరావు, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ సంపత్‌రెడ్డి, ఆనంద నిలయం ట్రస్టు ప్రతినిధులు పెద్ది వైకుంఠం, బెజిగామ వెంకటేశం, గట్టు రవి, టీఆర్‌ఎస్ నాయకులు దేవి రవీందర్, గుడాల భాస్కర్, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.