సన్న బియ్యం... చూడు కయ్యం...

ABN , First Publish Date - 2022-10-16T06:31:29+05:30 IST

సన్న బియ్యం... చూడు కయ్యం...

సన్న బియ్యం... చూడు కయ్యం...
హనుమకొండలోని ఇందిరానగర్‌లో రేషన్‌షాపు వద్ద సన్న బియ్యం ఇవ్వనందుకు జనం నిరసన

రేషన్‌ సరఫరాలో గందరగోళం

కొన్ని చోట్ల సన్నవి.. కొన్ని చోట్ల దొడ్డు బియ్యం పంపిణీ

పలుచోట్ల డీలర్లకు, కార్డుదారులకు మధ్య వాగ్వాదం

ఈ సారి బియ్యం సరఫరాలో ఆలస్యం

ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ కాని బియ్యం

కొరవడిన పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ


హనుమకొండ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పేదల ఆకలి తీర్చే రేషన్‌ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. అధికారుల తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ నెలలో ఒక్కో లబ్ధిదారుడికి 10కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు పూర్తిస్తాయిలో రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. మరోవైపు సన్న బియ్యం, దొడ్డు రకం పంపిణీ చేసే సమయంలో రేషన్‌ దుకాణాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సన్న బియ్యం విషయమై వినియోగదారులు, డీలర్లకు, ప్రజలకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. 


రేషన్‌ ఆలస్యం

ఈ నెల రేషన్‌ కేంద్రాలకు రేషన్‌ బియ్యం సరఫరాలో ఆలస్యం జరిగింది. సాధారణంగా ప్రతీ నెల 1వ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపుల ద్వారా డీలర్లు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలి. కానీ బియ్యం సరఫరాలో జాప్యం వల్ల ఈనెల 6 నుంచి సరఫరా చేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖ అధికారులే డీలర్లను కోరారు. దీనితో జిల్లాలో వారం రోజులు ఆలస్యంగా బియ్యం పంపిణీ మొదలైంది. పౌరసరఫరాల శాఖ నుంచి ఆ బియ్యం కూడా పూర్తి స్థాయిలో రేషన్‌ షాపులకు చేరలేదు. ఇప్పటి వరకు 10 నుంచి 20 శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. మామూలుగా ప్రతీ నెల 26వ తేదీ నాటికి బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు రేషన్‌ బియ్యం చేరుకుంటాయి. అక్కడి నుంచి 30 లేదా 31వ తేదీ నాటికి రేషన్‌ షాపుల్లో డంప్‌ అవుతాయి.  కానీ ఈ సారి చాలా షాపులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా కాలేదు. విడతల వారీగా అందుతున్నాయి. దీంతో కార్డుదారుల్లో ఎవరికీ పూర్తిగా బియ్యం పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 50 నుంచి 60 శాతం మాత్రమే బియ్యం పంపిణీ కావడంతో గడువు పెంచే అవకాశం ఉంది.


గందరగోళం

రేషన్‌ బియ్యం పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వచ్చిన బియ్యం ఏవి సన్నవో, ఏవి దొడ్డువి అనే వివరాలు లేకపోవడంతో లబ్ధిదారులు అయోమయం చెందుతున్నారు. సన్న బియ్యం వస్తే తీసుకువెళుతుండగా దొడ్డు బియ్యం వస్తే వాటిని తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో దొడ్డు బియ్యం నిల్వలు పలు రేషన్‌ దుకాణాల్లో మిగిలిపోతున్నాయి. దొడ్డు బియ్యం వచ్చినప్పుడు షాపుల వద్ద ఏ ఒక్కరు కనిపించడం లేదు. సన్న బియ్యం ఇస్తున్నారని తెలిస్తే మాత్రం గంటలతరబడి క్యూలైన్‌లో ఉంటూ బియ్యాన్ని తీసుకొని వెళుతున్నారు. బియ్యాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చునని ప్రభుత్వం చెప్పడంతో ఎక్కడ సన్న బియ్యం ఇస్తే అక్కడ బారులు తీరుతున్నారు. 


ప్రచారం

రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. కానీ షాపుల్లో మాత్రం ఇస్తున్నది మాత్రం దొడ్డు బియ్యమే. ఇదేమిటని కార్డుదారులు డీలర్లను నిలదీస్తున్నారు. ఏం చెప్పాలో డీలర్లకు పాలుపోవడం లేదు. అప్పుడప్పుడు సన్న బియ్యం కూడా సరఫరా అవుతున్నాయి. అవి ఎప్పుడు? ఎంత మేరకు వస్తాయో డీలర్లకే తెలియడం లేదు. వచ్చినప్పుడు ఇస్తే.. రానప్పుడు కూడా అవే కావాలని కార్డుదారులు నిలదీస్తుండడంతో డీలర్లకు, వారికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 


ఇరకాటం

ఈ సారి అదనపు కోటా కలుపుకొని కార్డుదారులకు 10కిలోల చొప్పున ఇచ్చే క్రమంలో జిల్లాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మొదట 10 కిలోల్లో 5 కిలోలు సన్న బియ్యం, 5 కిలోలు దొడ్డు బియ్యం ఇవ్వాల్సిందిగా సూచించింది. ఈ మేరకు జిల్లా  పౌరసరఫరాశాఖ అధికారులు తమ వద్ద నిలువ ఉన్న సన్నబియ్యాన్ని సరఫరా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మిగతా 5కిలోలు కూడా సన్నబియ్యమే ఇవ్వాలని చెప్పడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. తమ వద్ద సన్నబియ్యం నిల్వలు లేకపోవడంతో చేతులెత్తేశారు. మిగతా 5 కిలోలు దొడ్డు బియ్యాన్నే డీలర్లకు పంపించారు. దీంతో డీలర్లకు కూడా 5 కిలోలు సన్న, 5 కిలోలు దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడంతో కార్డుదారులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మొత్తం సన్న బియ్యమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దొడ్డు బియ్యమే రావడంతో కొన్ని చోట్ల డీలర్లు కార్డుదారులకు 5 కిలోల సన్నబియ్యం కూడా ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు షాపుల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణలకు దిగుతున్నారు.


డీలర్ల అత్యుత్సాహం

డీలర్లకు కూడా సన్న బియ్యం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వాటిని వినియోగదారులకు పంపిణీ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సన్న బియ్యం వస్తే డీలర్లు తమకు అనుకూలంగా ఉండేవారు, తెలిసినవారికి ఫోను ద్వారా సమాచారం ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన మిగతా వినియోగదారులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వారికి మాత్రం స్టాకు ఉన్న దొడ్డు బియ్యాన్నే ఇచ్చి సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాక కొన్నిచోట్ల లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా డీలర్లే కిలోకు రూ.8 నుంచి రూ.9వరకు చెల్లించి తీసుకుంటున్నారు. కార్డుదారులు రేషన్‌ దుకాణానికి రాగానే వేలి ముద్రలు వేయించుకొని బియ్యానికి సరిపడా నగదు ఇచ్చి పంపుతున్నారు. ఉచిత బియ్యాన్ని నల్లబజారుకు తరలించడంలో డీలర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా తరూచూ ఏదో ఒక ప్రాంతంలో అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టికుంటుండడం ఇందుకు ఉదాహరణ.


తనిఖీలేవి?

హనుమకొండ జిల్లాలో 2,28,940 రేషన్‌కార్డులు ఉన్నాయి. 414 రేషన్‌ షాపులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌ దుకాణం పరిధిలో 400 నుంచి 500 వరకు రేషన్‌ కార్డులంటాయి. జిల్లాకు ప్రతీ నెల 9098.36 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతాయి. అయితే జిల్లాలో రేషన్‌ దుకాణాలపై పౌరసరపరాల శాఖ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గతంలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు తరుచూ రేషన్‌ దుకాణాలను తనఖీలు చేసేవారు. దుకాణాల్లో క్రయవిక్రయాలకు, నిల్వలకు వ్యత్యాసం ఉంటే వెంటనే సదరు డీలరుపై కేసు నమోదు చేసేవారు. ప్రస్తుతం అలాంటిదేవి జరగడం లేదు.

Updated Date - 2022-10-16T06:31:29+05:30 IST