వదల బొమ్మాళీ.. వదల

ABN , First Publish Date - 2022-01-19T08:58:13+05:30 IST

ఓసారి కరోనా బారినపడి కోలుకున్నవారు.. గత రెండు వేవ్‌లలో తప్పించుకున్నవారు..

వదల బొమ్మాళీ.. వదల

  • మొదటి రెండు వేవ్‌లలో మిస్‌ అయినవారు ఇప్పుడు కరోనా బారిన
  • భారీగా పాజిటివ్‌ రేటు.. కొన్ని జిల్లాల్లో 25కు పైనే
  • ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంటికొకరికి.. ప్రైవేటులోనూ
  • సచివాలయ అధికారులు, ఉద్యోగులు 100మందికి..
  • పలు ఠాణాల్లో 70 మంది పోలీసులకు పాజిటివ్‌
  • ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రిలో పది మంది సిబ్బందికీ..
  • పెద్ద సంఖ్యలో బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లు నమోదు
  • మరో 15 రోజుల్లో పతాక స్థాయికి కేసులు
  • కర్ప్యూ, లాక్‌డౌన్‌ అవసరం లేదు: క్యాబినెట్‌లో చర్చ
  • ఈ నెల 21 నుంచి జైళ్లలో ములాఖత్‌ల నిలిపివేత
  • రాష్ట్రంలో కొత్తగా 2,983 కేసులు; ఏడు నెలల గరిష్ఠం
  • హైకోర్టు ఆదేశాలతో లక్షకు పైగా టెస్టుల నిర్వహణ
  • పండుగ, కోడి పందేల ఎఫెక్ట్‌.. ఖమ్మంలో 473 కేసులు
  • 18 దాటినవారందరికీ ముందుజాగ్రత్త డోసు ఇవ్వండి
  • డోసుల వ్యవధిని తగ్గించండి: కేంద్రానికి హరీశ్‌ లేఖ


హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఓసారి కరోనా బారినపడి కోలుకున్నవారు.. గత రెండు వేవ్‌లలో తప్పించుకున్నవారు.. టీకా రెండు డోసులూ తీసుకున్నవారు.. ఇలా రాష్ట్రంలో అందరూ వైర్‌సకు గురవుతున్నారు. కొందరైతే మూడోసారీ మహమ్మారికి చిక్కుతున్నారు. కొవిడ్‌ సోకని ఉద్యోగి లేని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కనిపించడం లేదు. సర్కారీ ఉద్యోగుల కుటుంబాల్లో ఇంటికొకరైనా పాజిటివ్‌ ఉంటున్నారు. సచివాలయంలో కొవిడ్‌ హడలు పుట్టిస్తోంది. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి మరోసారి వైరస్‌ సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానీయ, ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుకు కూడా పాజిటివ్‌ వచ్చింది. బీఆర్కే భవన్‌లోని వైద్య శాఖ పేషీలో నలుగురికి, రెవెన్యూ శాఖలో మరో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. సాధారణ పరిపాలన, విద్యా శాఖతో పాటు పలు విభాగాల్లో 15 మందిపైగా మహమ్మారి బారినపడ్డారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పేషీలో ముగ్గురు పీఎ్‌సలకు కూడా కొవిడ్‌ వచ్చింది. మొత్తంగా సచివాలయంలోనే వందమంది వరకు కరోనా బారినపడినట్లు సమాచారం.


ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా ఆయన స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. తగిన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌ సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో 20 మందికి, నార్సింగ్‌లో 18 మందికి, హయత్‌నగర్‌లో 15 మందికి, చైతన్యపురిలో 8 మందికి,  మేడ్చల్‌లో 9 మంది పోలీసులకు పాజిటివ్‌గా తేలింది. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో వెయ్యి మంది సిబ్బంది వైరస్‌కు గురయ్యారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఆస్పత్రిలో వైద్యుడితో పాటు 9 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.


పాజిటివ్‌ రేటు పైపైకి

వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 3.66. కానీ, క్షేత్ర స్థాయిలో ఇది చాలా భారీగా ఉంటోంది. కొన్ని జిల్లాల్లో 25 శాతం దాటింది. ముఖ్యంగా ఐదారు జిల్లాల్లో పెద్దయెత్తున కేసులు వస్తున్నాయి. బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు (టీకా పూర్తిగా పొందినవారు) భారీగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులంటున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత సోమవారం మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి సీఎం వైద్యారోగ్య శాఖ అధికారులను ఆరా తీశారు. ఆస్పత్రుల్లో చేరికలు పెద్దగా లేవు కాబట్టి కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ అవసరం లేదని సీఎం అభిప్రాయపడినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కాగా, మరో 15 రోజుల్లో కేసులు పతాక స్థాయికి చేరతాయని, తర్వాత తగ్గుతాయని సర్కారు ఒక అంచనాకు వచ్చింది. ఈ నెల 21 నుంచి అన్ని జైళ్లలో ములాఖత్‌లను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా, రైతుబంధు సంబురాలు, సంక్రాంతి తర్వాత ఖమ్మం జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 392, మంగళవారం 473 నమోదయ్యాయి. కోడి పందేల్లో పాల్గొనేందుకు ఈ జిల్లా వారితోపాటు తెలంగాణలోని పలు జిల్లాలవారు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం మీదుగా ఏపీకి తరలి వెళ్లారు. వీరిలో చాలామందికి పాజిటివ్‌ నిర్ధారణవుతోంది. 

  

లక్షకు పైగా పరీక్షలు.. 2,983 కేసులు

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం లక్షపైగా టెస్టులు చేశారు. 1,07,904 మందికి పరీక్షలు నిర్వహించగా 2,983 కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఇవే గరిష్ఠం. వైర్‌సతో మరో ఇద్దరు మృతి చెందారు. ఇంకా 22,472 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌లలో హైదరాబాద్‌లో 1,206, మేడ్చల్‌లో 259, రంగారెడ్డిలో 227, హనుమకొండలో 118, సంగారెడ్డిలో 96 నమోదయ్యాయి. ములుగు తప్ప అన్ని జిల్లాల్లో కేసులు రెండంకెలు దాటాయి. కాగా, వారం రోజుల నుంచి గాంధీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు చెప్పారు. వీటిలో డెల్టా కేసులు ఉన్నాయని.. దీనికితోడు ఒమైక్రాన్‌ కేసులు వస్తున్నాయని తెలిపారు.  వీరిలో వృద్ధులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారే అధికులని వివరించారు. గత 9 రోజుల్లో వైరస్‌ సోకిన గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సంఖ్య 180కి పెరిగింది.


18 దాటిన వారందరికీ ముందుజాగ్రత్త డోసు ఇవ్వండి

దేశంలో 18 ఏళ్లు దాటినవారందరికీ ముందుజాగ్రత్త డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య  మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ఈ డోసు గడువును 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు, ముందుజాగ్రత్త డోసు మధ్య గడువును 3 నెలలకు తగ్గ్గించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. దీర్ఘకాల వ్యాధులతో సంబంధం లేకుండా.. 60 ఏళ్లు దాటిన అందరికీ ముందుజాగ్రత్త డోసు ఇవ్వాలన్నారు. అలాగే రెండో డోసు వ్యవధిని తగ్గించాలని సూచించారు.

Updated Date - 2022-01-19T08:58:13+05:30 IST