2 lakh crore Due : కొండలా ‘పెండింగ్’!
ABN , First Publish Date - 2023-11-15T02:20:06+05:30 IST
ఒకప్పుడు కాంట్రాక్టు పనుల కోసం పోటాపోటీ! ఇప్పుడు... ‘అమ్మో... ఏపీలో ప్రభుత్వ పనులా? మాకొద్దు బాబోయ్’ అని కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి.
కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు బాకీ
ఏటా కచ్చితంగా చేయాల్సిన పనులు, వివిధ శాఖలకు సరఫరాలు (సప్లైస్), రోడ్ల నిర్వహణ వంటివి ఎన్నో ఉంటాయి. ప్రభుత్వం ‘పేరు గొప్ప’గా చేపట్టిన పనులూ ఉన్నాయి. వాటి బిల్లులు కూడా సక్రమంగా చెల్లించలేని దుస్థితి! నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు రూ.10 లక్షల కోట్లు. అయినప్పటికీ.. రూ.2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
చేసిన, చేస్తున్న పనులే అరకొర! వాటిని చేస్తున్న కాంట్రాక్టర్లకూ బిల్లులు సకాలంలో చెల్లించడంలేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వారికి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. చేసిన అప్పులు కట్టలేక, వడ్డీలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్లూ ఉన్నారు.
పూర్తిగా ‘సొంత’ మనుషులకు చెందిన రెండు, మూడు కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే ఠంచనుగా బిల్లులు అందుతున్నాయి. మిగిలిన వారికి కన్నీళ్లూ, కడగండ్లే!
ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ఉపాధి హామీ, వైద్య శాఖ, విద్యాశాఖ (నాడు నేడు)... ఇలా అనేక విభాగాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు దక్కడంలేదు. కోర్టుకు ఎక్కితే తప్ప డబ్బులు రాని పరిస్థితి. దీంతో... నిత్యం కోర్టులో వందల కేసులు పడుతున్నాయి. తాము నాలుగురాళ్లు వెనకేసి... నలుగురికి ఉపాధి చూపించే కాంట్రాక్టర్లకే ఈ దుస్థితి.
రివర్స్ టెండరింగ్‌తోపాటు పలు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన, బాగా ఇష్టమైన ఓ కాంట్రాక్టు సంస్థకు కూడా బిల్లులు చెల్లించడంలేదు. దీంతో ఆ సంస్థ ఎక్కడికక్కడ పనులు ఆపేసింది.
పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ఎంపీ మన రాష్ట్రంలో ఇరిగేషన్ పనులు చేపట్టారు. ఆయనకు దాదాపు రూ.600 కోట్ల దాకా చెల్లింపులు జరపాల్సి ఉంది. బిల్లులు ఇవ్వాలంటూ సీఎంవోకు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. కానీ... దీనికి రాజకీయ ముద్ర వేయడంతో ఆ మాజీ ఎంపీ లబోదిబోమన్నారు.
ఇష్టారాజ్యంగా ‘ఫిఫో’ ఉల్లంఘన
కాంప్రెహెన్సివ్ ఫైనాన్స్‌మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌ఎంఎస్)ను టీడీపీ సర్కారు పకడ్బందీగా రూపొందించి అమలు చేసింది. మొదట వచ్చిన బిల్లును మొదట చెల్లించాలనేది(ఫిఫో) సీఎఫ్‌ఎంఎస్ ప్రధాన ఉద్దేశం. కానీ, వైసీపీ సర్కారు దీనిని తుంగలో తొక్కేసింది. అస్మదీయుల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో ఏ మూలన ఉన్నా పైకితెచ్చి చెల్లింపులు చేసేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితులైన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకు మాత్రమే ఇప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి.
అప్పులు, వడ్డీలు భరించలేక విలవిల
ఆత్మహత్యలూ చేసుకునేంత దుస్థితి
పెండింగ్‌ను తగ్గించి చూపేలా సర్కారు మాయలు
ఏటా మార్చి ఆఖరులో వేలకోట్ల బిల్లులు ‘రద్దు’
వాటిని తదుపరి ఏడాదికి క్యారీ చేయకుండా మోసం
అయినా సీఎఫ్‌ఎంఎస్‌లో 50 వేల కోట్లు పెండింగ్
2-3 అస్మదీయ కంపెనీలకే ఠంచనుగా చెల్లింపులు
మిగిలిన కాంట్రాక్టర్లకు అష్టకష్టాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు కాంట్రాక్టు పనుల కోసం పోటాపోటీ! ఇప్పుడు... ‘అమ్మో... ఏపీలో ప్రభుత్వ పనులా? మాకొద్దు బాబోయ్’ అని కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సాగునీటి ప్రాజెక్టులతోపాటు కొన్ని పనులపై హడావుడి చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. ఇతర పనులదీ అదే పరిస్థితి. దీంతోపాటు గత ప్రభుత్వం చివరి ఏడాది, ఆరునెలల్లో ఉన్న బిల్లులనూ జగన్ సర్కారు ఆపేసింది. ప్రభుత్వంలో రొటీన్ పథకాలు, పనులకు సరఫరా చేసే కాంట్రాక్టర్లకూ బిల్లులు సక్రమంగా అందడంలేదు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులు రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. కానీ, ప్రభుత్వం మాత్రం పెండింగ్ బిల్లులను తగ్గించి చూపించేందుకు ప్రతిఏటా వేలకోట్ల బిల్లులను రద్దు చేస్తోంది. ఆ తర్వాత వాటిలో కనీసం ఒక శాతం బిల్లులను కూడా తిరిగి చెల్లింపుల వ్యవస్థ (సీఎ్‌ఫఎంఎ్‌స)లోకి రానివ్వడం లేదు. సీఎ్‌ఫఎంఎ్‌సలో బిల్లు కనిపిస్తే ‘భారీ పెండింగ్’ బయటపడుతుందనే భయంతో ప్రతిఏటా మార్చి 31వ తేదీన భారీ ఎత్తున బిల్లులు రద్దు చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం సీఎ్‌ఫఎంఎస్ వ్యవస్థలో పెండింగ్ బిల్లులు రూ.50,000 కోట్ల వరకు ఉన్నాయి.
ఎప్పటికప్పుడు రద్దుపద్దులో...
2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి రవాణా, రోడ్లు - భవనాల శాఖకు సంబంధించి రూ.6875 కోట్ల బిల్లులు ‘రద్దు’ చేశారు. సాధారణంగా అయితే, ఇలా రద్దు చేసిన బిల్లులను తదుపరి ఆర్థిక సంవత్సరానికి క్యారీ చేసి, చెల్లింపుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం ఇలా క్యాన్సిల్ చేసిన బిల్లులను తిరిగి చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్లు, భవనాల శాఖలో రూ.590 కోట్ల కొత్త బిల్లులున్నాయి. పాత, కొత్త బిల్లులు కలిపితే ఈ ఒక్క శాఖలోనే రూ.7465 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు. కానీ... సీఎ్‌ఫఎం్‌సలో రూ.395 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తాయి. అంటే... పెద్దల సిఫారసులు ఉన్న బిల్లులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారన్న మాట. అందులోనూ రూ.250 కోట్ల బిల్లులు మాత్రం చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది. అవి కూడా ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు.
‘రోడ్డు’న పడ్డ కాంట్రాక్టర్లు
జగన్ సర్కారు దెబ్బకు రాష్ట్రంలో ఇటు రోడ్లు మాత్రమే కాదు... వాటి కాంట్రాక్టర్ల పరిస్థితీ కుదేలయ్యింది. బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ఇప్పటిదాకా బిల్లుల విడుదల కోసం న్యాయపోరాటం చేస్తున్న వారు ఇకపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు కారణం సర్కారు తీరే. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన, చేసిన పనులకు సంబంధించినవి పక్కనపెడితే... జగన్ సర్కారు వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి 1500 కోట్ల రూపాయలపైనే బిల్లులను పెండింగ్ పెట్టింది. అందులో అసలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) లేని వర్క్‌ల విలువ 800 కోట్లపైనే. జగన్ సర్కారు వచ్చాక రోడ్లు భవనాల శాఖ ఎన్‌డీబీ (న్యూ డెవల్‌పమెంట్ వర్క్స్), రూరల్ రోడ్లు, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు, మెయింటెనెన్స్ వర్క్‌లు చేపట్టారు. ప్రభుత్వం తన అవసరానికి గుండుసూది కొనాలన్నా ఆ ఖర్చులకు జీవో ఉండాల్సిందే. అందుకు ఆర్థిక శాఖ ఆమోదం ఉండాలి. పనులు చేపట్టడానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో చూపుతూ బీఆర్‌ఓ (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) ఇవ్వాలి. కానీ... రూ.800 కోట్ల విలువైన పనులను బీఆర్‌ఓ లేకుండానే ఇచ్చారు. బిల్లుల కోసం ఆర్థిక శాఖను సంప్రదించినప్పుడు... మేం బీఆర్‌వోలు ఇవ్వలేదు కదా, పనులు ఎలా చేశారని అధికారులు ప్రశ్నించడంతో కాంట్రాక్టర్లు అవాక్కయ్యారు. బీఆర్‌ఓలు ఉండి, సీఎ్‌ఫఎంఎ్‌సదాకా వెళ్లిన 700 కోట్ల బిల్లులకే దిక్కులేదు. అలాంటిది... ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చేపట్టిన పనుల పరిస్థితి ఏమిటి?
సాగునీటి గోడు...
ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణ పనులు చూసుకోవాల్సిన సాగునీటి శాఖ ఇంజనీర్లు ప్రస్తుతం కోర్టుల చు ట్టూ తిరుగుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం నిత్యం కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించడమే దీనికి కారణం. విజయవాడలో ప్రత్యేకంగా ఈఎన్‌సీ కార్యాలయం కోసం జలసౌధను నిర్మించారు. ఈ కాంట్రాక్టు సంస్థకూ బిల్లులు చెల్లించలేదని జల వనరుల శాఖ వర్గాలే వాపోతున్నాయి. ఒకప్పుడు జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయాలు బడా కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో కిటకిటలాడేవి. ఇప్పుడు అటువైపు కూడా ఎవరూ చూడటం లేదు.
నేడు కార్యదర్శితో భేటీ
పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక, ఆర్‌అండ్‌బీ శాఖల కార్యదర్శులను కలవాలని కాంట్రాక్టర్లు నిర్ణయించారు. తొలుత ఆర్థికశాఖ కార్యదర్శి అపాయింట్‌మెంట్ కోరగా... అవకాశం ఇవ్వలేదని తెలిసింది. దీంతో బిల్లుల కోసం ఆందోళన చేపట్టాలని వారు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి ఆర్‌అండ్‌బీ కార్యదర్శి ప్రద్యుమ్న ‘బుధవారం మాట్లాడుకుందాం రండి’ అని కాంట్రాక్టర్లకు కబురు పంపించినట్లు తెలిసింది.