YS Viveka Case: అవినాశ్‌కు మళ్లీ నోటీసులు.. ఎప్పుడు రమ్మన్నారంటే..
ABN , First Publish Date - 2023-05-20T11:52:12+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పులివెందుల (Pulivendula) బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యంలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీస్‌లు అందాయి. శుక్రవారం ఉదయం 11 గంటలు...వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తప్పనిసరిగా సీబీఐముందు విచారణకు హాజరు కావాల్సిన సమయం. హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. కానీ... మధ్యలోనే రూటు మారింది.
ఆయన కాన్వాయ్ జాతీయ రహదారివైపు మళ్లింది. ఆయన లాయర్లు మాత్రమే సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అవినాశ్ రెడ్డి విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు వివరించారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. ఊహించని పరిణామంతో సీబీఐ అధికారులు విస్తుపోయారు. నాలుగు రోజుల కిందటే ఆయన విచారణకు రావాల్సి ఉంది. కానీ... ‘ఇంత ఆకస్మికంగా పిలిస్తే రాలేను. ముందస్తు కార్యక్రమాలున్నాయి’ అని తెలిపారు. దీంతో శుక్రవారం తప్పనిసరిగా రావాలని అప్పుడే సీబీఐ అధికారులు చెప్పారు. అవినాశ్‌ను అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని సీబీఐ ఇదివరకే స్పష్టం చేసిన తరుణంలో ఉత్కంఠ కూడా పెరిగింది. కానీ... తల్లి అనారోగ్యానికి గురి కావడంతో విచారణకు రాలేకపోతున్నానని ఆయన సమాచారం పంపారు. ఇంతలోనే మళ్లీ సీబీఐ నోటీసులివ్వడంతో ఉత్కంఠ నెలకొంది.