Ambati Rayudu: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు.. ఏం జరగబోతోంది?
ABN , First Publish Date - 2023-05-11T16:19:03+05:30 IST
సీఎం జగన్ (CM Jagan) ను క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో రాయుడు భేటీ అయ్యారు. జగన్‌ను అంబటి రాయుడు కలవడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) ను క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో రాయుడు భేటీ అయ్యారు. జగన్‌ను అంబటి రాయుడు కలవడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. రాయుడు వైసీపీలో చేరుతారని కొందరు అంటుంటే.. కాదుకాదు ఏపీలో క్రికెట్ అకాడమీ పెట్టేందుకు జగన్‌తో భేటీ అయ్యారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జగన్‌ను ప్రశంసిస్తూ రాయుడు పోస్టులు పెడుతున్నారు. దీన్ని బట్టి ఆయన త్వరలో వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు నేరుగా జగన్‌ను కలవడంతో గతంలో జరిగిన ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. ఏపీకి చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు (Chennai Super Kings) ఆడుతున్నాడు. గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చర్చ అన్ని రకాలుగా సాగుతుంది. రాయుడు.. గుంటూరు జిల్లా పొన్నూరు లేదా రేపల్లె నుంచి పోటీ చేస్తాడంటూ అప్పుడే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాయుడు వయస్సు 37 ఏళ్లు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ముగిసిన తర్వాత రాయుడు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
క్రికెట్ కెరీర్ ముగిస్తే ప్రజల్లోనే ఉంటానని తన మనసులో మాటను అంబటి రాయుడు ఇటివలే బయటపెట్టారు. ఇప్పుడు ఇదే మంచి తరుణంగా భావించినట్లున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాయుడు తెలుగు రాష్ట్రాలకు సుపరితుడు. అతను పుట్టింది గుంటూరు అయినా హైదరాబాద్ (Hyderabad)లో పెరిగారు. రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే కాదు గతంలో కూడా చర్చ జరిగింది.
అదేమంటే రాయుడు బీఆర్‌ఎస్ (BRS)లో చేరుతారని అనుకున్నారు. సీఎం కేసీఆర్ అంటే కూడా రాయుడికి ప్రత్యేకమైన అభిమానం. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి రాయుడు వెళ్లారు. అప్పుడు కూడా జగన్‌పై ప్రశంసలు కురిపించినట్లే కేసీఆర్‌ను కొనియాడారు. ఓ సారి ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల పరిచయ కార్యక్రమంలో రాయుడు చేతిని కేసీఆర్ (KCR) ముద్దడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌసిక్‌రెడ్డి (Kaushik Reddy)తో కలిసి రాయుడు క్రికెట్ ఆడాడు. కేసీఆర్‌తో రాయుడికి ఉన్న అనుబంధంతో బీఆర్‌ఎస్‌లో చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ స్వరాష్ట్రం అయితే బాగుంటుందని అనుకున్నారో ఏమో.. అందుకే ఇప్పుడు రూటు మార్చి జగన్ కొనియాడుతున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఇప్పుడు జగన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత క్రికెటర్లలో తెలుగు ఆటగాడైన అంబటి రాయుడి కథ కూసింత వేరేగా ఉంటుంది. టాలెంట్, పర్ఫామెన్స్ అన్నీ సరిపడా ఉన్నా.. అదృష్టం కలిసిరాక స్టార్ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు. దాంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అంబటికి బాగానే కలిసొచ్చింది. లిటిల్ మాస్టర్ పర్యవేక్షణలో అంబటి రాయుడు కొంచెం తన ప్రవర్తనతో పాటు ఆటలోనూ మార్పులు చేసుకుని తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. కానీ, అదే సమయంలో మిగతా ఆటగాళ్లు బాగా రాణించడం రాయుడును టీమిండియాకు దూరం చేసిందనే చెప్పాలి.
అంబటి కెరీర్‌లో వివాదాలెన్నో..
అంబటి రాయుడి కెరీర్‌లో అనేక వివాదాలున్నాయి. 2012 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అంబటి.. మీడియం పేసర్, ప్రస్తుత టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్‌ని బూతులు తిట్టి వార్తల్లో నిలిచాడు. అలాగే 2014లో ఇండియా-ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన సమయంలో అంపైర్‌తో గొడవపడ్డాడు. ఇక 2016 ఐపీఎల్‌లోనైతే ఏకంగా తన జట్టు సభ్యుడు, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తోనే ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత 2018 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ అంపైర్లతో గొడవపడడంతో రెండు మ్యాచుల నిషేధానికి గురయ్యాడు.