బాబు విజన్‌తో ఏపీ బాగు!
ABN , First Publish Date - 2023-04-29T03:28:23+05:30 IST
ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు.

ఎన్టీఆర్ యుగపురుషుడు.. బాబు విజనరీ
విజన్ 2047తో అభివృద్ధిపథం.. ఎన్టీఆర్ ఆత్మ ఆయనతోనే
చంద్రబాబు టాలెంట్ బయటివారికే ఎక్కువ తెలుసు
హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారు: రజనీకాంత్
పేదరికం లేని ఆంధ్రను సృష్టిస్తాం.. ఎన్టీఆర్‌కు అదే నివాళి
పేదలు పేదల్లా మిగిలిపోతే సంక్షేమానికి అర్థమే లేదు
ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి.. వచ్చేవరకూ టీడీపీ పోరు
శత జయంతి సభలో చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత ఎన్టీఆర్‌తో తన అనుభవాలు.. అనుబంధం.. చంద్రబాబుతో స్నేహం గురించి వివరించారు. ‘ఈ సభను చూస్తుంటే రాజకీయాలు మాట్లాడాలని నా బుద్ధి చెబుతోంది.. కానీ నా అనుభవమేమో ‘వద్దురా రజనీ.. జాగ్రత్త’ అని హెచ్చరిస్తోంది. అయినా నా ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబునాయుడు ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగానైనా ఆయన గురించి, రాజకీయాల గురించి మాట్లాడకపోతే నాగరికం అనిపించుకోదు’ అని తెలిపారు. చంద్రబాబు 30 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని.. మోహన్‌బాబు పరిచయం చేశారని చెప్పారు. అప్పటి నుంచి హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబును కలిసి మాట్లాడేవాడినని.. దాంతో తన అవగాహన పెరిగిందన్నారు. ‘ఆయనకు ఇండియన్ పాలిటిక్స్ మాత్రమే కాదు.. వరల్డ్ పాలిటిక్స్ కూడా తెలుసు. ఆయన ఒక విజనరీ. జనాలకు మంచి చేయాలని 24 గంటలూ ఒకటే ఆలోచన. ఇండియాలోని పెద్ద పెద్ద పొలిటీషియన్లందరికీ చంద్రబాబు గురించి తెలుసు. ఆయన టాలెంట్ ఏంటో ఇక్కడ ఉన్నవారి కంటే బయటివారికే ఎక్కువగా తెలుసు. ఎవరి ఊహకూ అందని రోజుల్లోనే 1996లో చంద్రబాబు తన విజన్-2020 ప్రణాళిక ద్వారా డిజిటల్ వరల్డ్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి ఉన్న భవిష్యత్ గురించి చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారు. బిల్‌గేట్స్ లాంటి బిజినెస్ టైకూన్స్ వచ్చి అభినందించడమే కాదు.. వాళ్ల కంపెనీలను ఇక్కడ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాదిమంది తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా.. లగ్జరీగా బతుకుతున్నారంటే దానికి చంద్రబాబే కారణం. తర్వాత 22 ఏళ్ల తర్వాత నేను మొన్న హైదరాబాద్ వెళ్లాను. రాత్రిపూట బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ మీదుగా వెళ్లాను. న్యూయార్క్‌లో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా అని అనిపించింది. హైదరాబాద్ నగరం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రశేఖరరావు (తెలంగాణ సీఎం కేసీఆర్) కూడా ఇదే విషయాన్ని చెప్పారు’ అని తెలిపారు.
నేను ఎక్కడున్నా..
చంద్రబాబు పదవిలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడు అపాయింట్‌మెంట్ అడిగితే అప్పుడు ఇస్తారని రజనీకాంత్ అన్నారు. ప్రతి సంవత్సరం నా జన్మదినం రోజున ఎక్కడున్నా సరే నాకు శుభాకాంక్షలు చెబుతారు. నాలుగు నెలల క్రితం కలిశాను. ఇప్పుడు ప్రతిపక్ష నేత కదా... పెద్దగా పని ఉండదు. రాష్ట్రానికి ఏం చేయాలన్నదే ఆలోచన. 2047 ప్లాన్ చెప్పారు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తే దేశంలో ఏపీ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇది జరగాలంటే దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని.. ఎన్టీఆర్ ఆత్మ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నా’ అని రజనీకాంత్ చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
ఆరేడేళ్ల వయసులో పాతాళభైరవి చూశా..
ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ సినిమాను 1956-57లో నేను మొదటిసారి చూశాను. అప్పుడు నాకు ఆరేడేళ్ల వయసుంటుంది. వెండితెరపై చూసిన 20 అడుగుల పాతాళ భైరవి విగ్రహం నా మైండ్‌లో నాటుకుపోయింది. అప్పటి నుంచి ఏ మహిళ ప్రతిమ చూసినా అది భైరవియేనా అని అడిగేవాడిని. అంతగా నా మనసులో నాటుకుపోయింది. తర్వాత నా మొదటి సినిమాలో కెమెరా ముందు ఫస్ట్‌షాట్‌లో పాల్గొన్నప్పుడు అబ్బూరి రాంబాబు నాకు రాసి ఇచ్చిన డైలాగ్.. ‘భైరవి ఇల్లు ఇదేనా’ అనేది మా ఫస్ట్ డైలాగ్. మూడు సంవత్సరాలు విలన్‌గా, సైడ్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నటించాను. తర్వాత ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ నన్ను హీరోగా బుక్ చేసుకోవడానికి వచ్చారు. కానీ హీరోగా చేయడం నాకు ఇష్టం లేదు. ఒకసారి కథ వినాలని అడిగారు. సినిమా టైటిల్ ‘భైరవి’ అని చెప్పారు. వెంటనే హీరోగా చేయడానికి ఒప్పుకొన్నాను. ఇది ఆ జగన్మాతే నాతో చేయించిందని భావిస్తున్నాను.
63లో చూశా
అప్పటివరకు తెరమీద మాత్రమే చూసిన ఎన్టీఆర్‌ను 1963లో ప్రత్యక్షంగా చూశాను. ‘లవకుశ’ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక థియేటర్‌కు వచ్చినప్పుడు చూశాను. 1966లో ‘శ్రీకృష్ణపాండవీయం’ చూశాను. అందులో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ నటన చూసి బాగా ప్రభావితమయ్యాను. నా 18వ ఏట బస్ కండక్టర్ అయ్యాను. ఒక సందర్భంలో నాటకం వేశాం. అందులో నేను దుర్యోధనుడి పాత్ర వేసి ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేశాను. అంతే.. ఒకటే చప్పట్లు. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నటుడిగా సక్సెస్ అవుతావని ప్రోత్సహించారు. అందుకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.
ఆ సినిమాలో నేనే ఉండాలని..
ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’ సినిమాలో నటించాను. అప్పుడు నాకు కోపం ఎక్కువ. సెట్‌లో అందరి మీదా అరిచేసేవాడిని. దాంతో నన్ను ఆ సినిమాలో నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆయనకు కోపం వస్తుంటే.. ప్రేమగా చూసుకోండి.. రజనీకాంతే సినిమాలో ఉండాలని చెప్పారు.
దుర్యోధనుడి పాత్ర చేయాలనుకున్నా..
‘దాన వీర శూర కర్ణ’ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేస్తున్నాను. ఆ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ అత్యద్భుతం. ఆయన్ను చూసి ఎలాగైనా సరే నేను కూడా దుర్యోధనుడి కేరెక్టర్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ గెటప్ నాకు సరికాదని అందరూ వారించడంతో మానుకున్నాను. 1982లో హైదరాబాద్‌లో బొబ్బిలిపులి షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లాను. దర్శకుడు దాసరి నారాయణరావు వచ్చి షాట్ రెడీ అన్నారు. ఎన్టీఆర్ రెండు పేజీల డైలాగ్‌ను ఒకే టేక్‌లో ఫినిష్ చేయడం చూసి ఓ మైగాడ్ అనుకున్నాను. తర్వాత ఆ సినిమాను ప్రసాద్ స్టూడియోలో చూశాను. అందులో ఎన్టీఆర్ నటన చూసి నాకు తెలియకుండానే ఎగిరి గంతేశాను. నభూతో నభవిష్యతి.
రజనీకాంత్‌కు చంద్రబాబు తేనీటి విందు
ఎన్టీఆర్ అసెంబ్లీ, చరిత్రాత్మక ప్రసంగాలతో కూడిన పుస్తకావిష్కరణ సభకు అతిథిగా పాల్గొనేందుకు శుక్రవారం అమరావతి వచ్చిన రజనీకాంత్‌కు, చంద్రబాబు తేనీటి విందు ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఆయనకు సాదర స్వాగతం పలికారు. దుశ్శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.