Chandrababu : సిట్ వేసి చేసేదేమిటి?
ABN , First Publish Date - 2023-05-04T02:35:51+05:30 IST
టీడీపీ నేతలపై పెట్టాల్సిన కేసులన్నీ పెట్టిన తర్వాత కొత్తగా వైసీపీ ప్రభుత్వం సిట్ వేసినంత మాత్రాన ఏమవుతుందని మాజీ ముఖ్యమంత్రి,

పెట్టాల్సిన కేసులన్నీ పెట్టేశారు.. కొత్తగా ఏముంది!
నీ టీవీ, పేపర్లు, సిమెంట్ కంపెనీలకు డబ్బులెక్కడివి?
టీడీపీ హయాంలో నిర్ణయాలపై అనేక కేసులు పెట్టారు
ఈ కేసుల్లో చాలామందిని తీసుకొచ్చి లాకప్‌లో ఉంచారు
నా పేరు, లోకేశ్ పేరు చెప్పాలని వారిని హింసించారు దిగిపోయిన తర్వాత దీనికి రెండింతలు ఉంటుంది
ఈ రాష్ట్రంలో కిమ్ పాలన నడుస్తోందా?
మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అర శాతమే
సీఎంకు, ఆయన పేటీఎం బ్యాచ్‌కి సిగ్గనిపించడం లేదా?
కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం జగన్ ప్రత్యేకత మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు
జగనే పెద్ద అవినీతిపరుడు. ఆయన నన్ను అనేది ఏమిటి? నువ్వు రూ.43వేల కోట్ల ప్రజాధనం దోచావని సీబీఐ కేసులు పెట్టింది. నీ షెల్ కంపెనీలకు డబ్బులు వచ్చాయి. మా పార్టీలో ఎవరికైనా వచ్చాయా? నీ టీవీ, పేపర్లు, సిమెంట్ కంపెనీలకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి?
టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలపై అనేక కేసులు పెట్టారు. ఆ కేసుల్లో చాలామందిని తీసుకొచ్చి లాకప్‌లో పెట్టి నా పేరు, లోకేశ్ పేరు చెప్పాలని హింసించారు. మేం క్లీన్‌గా ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. నాలుగేళ్లు అయిపోయింది. ఇంకేం చేయగలుగుతారు?
జగన్‌కు ఇవి చివరి రోజులు. అయినా సైకో మారడు. తన తత్వం ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఎల్లకాలం ప్రజలు భరించరు. తిరుగుబాటు తప్పదు. దిగిపోయిన తర్వాత దీనికి రెండింతలు ఉంటుంది. ఆ పార్టీ దీనికి సిద్ధంగా ఉండాలి.
– టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలపై పెట్టాల్సిన కేసులన్నీ పెట్టిన తర్వాత కొత్తగా వైసీపీ ప్రభుత్వం సిట్ వేసినంత మాత్రాన ఏమవుతుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, అస్సైన్డ్ భూములు, అవుటర్ రింగ్‌రోడ్డు, మార్గదర్శి వంటి అనేక అంశాలపై కేసులు పెట్టేశారు. కొత్తగా సిట్ వేసి ఏం చేస్తారు? చేయాల్సిన విచారణలు అన్నీ చేసేశారు. సిట్ లేకపోయినా ఇతర ఏజెన్సీలతో కేసులు నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదన్నట్లు టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్న ఆదిరెడ్డి అప్పారావు, వాసుపై కేసు పెట్టారు. మీ పార్టీ వారిపై ఎవరిపై అయినా కేసులు పెట్టారా?’ అని ఆయన నిలదీశారు. అవినాశ్‌రెడ్డి అరెస్టు కా కుండా ఉండటానికి అనేక వందలసార్లు కోర్టులకు వెళ్లారని, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో మూడుకు మూడు సీట్లలో ఓడిపోయినా ఇంకా మొత్తం పాతిక ఎంపీ సీట్లు తమకే వస్తాయని కొనుక్కొన్న సర్వే వేయించుకొన్నారని ఎద్దేవా చేశారు.
రజనీకాంత్ ఏం తప్పు మాట్లాడారు?
తమిళ సినీ హీరో రజనీకాంత్‌కు ఈ రాష్ట్రానికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రాష్ట్రంలో కిమ్ పాలన నడుస్తోందా? ఆయన ఏం తప్పు మాట్లాడారు? మీ పాలన బాగోలేదన్నారా? ఎన్టీఆర్‌తో తన అనుబంధం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి చూశానన్నారు. దానికి ఎందుకంత ఉలుకు? హైదరాబాద్ అభివృద్ధి గురించి 20ఏళ్ల కిందటే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారు. ఇప్పుడు ఆయన్ను ఉరి తీస్తారా? భారతీయ సినిమాకు ప్రపంచ మార్కెట్ నిర్మించినవారిలో రజనీకాంత్ ఒకరు. నేను జపాన్ వెళ్లినప్పుడు ఆయన సినిమాల గురించి అక్కడ గొప్పగా చెప్పారు’ అని చంద్రబాబు అన్నారు. తాను ఎవరినైనా కలిస్తే వైసీపీ నేతలకు నిక్కర్లు తడుస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇద్దరు కలవకూడదా? మీకెందుకు బాధ? ఓడిపోతానని భయమా? వైసీపీలో ఇప్పటికే సంక్షోభం అలుముకొంది. ఈసారి పోటీ చేయబోనని కొందరు చెబుతుంటే ఇచ్చిన పదవులు వద్దని కొందరు తిరస్కరిస్తున్నారు. చివరి రోజులకు వచ్చినప్పుడు అందరూ తలా ఒక రాయి నెత్తిన వేస్తారు’ అని అన్నారు. పొత్తులపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానన్నారు.
రాష్ట్రానికి ఈ పరిస్థితి ఏమిటి?
‘జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడేళ్లలో దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఈ రాష్ట్రానికి వచ్చింది కేవలం అర శాతం లోపు. 2019 అక్టోబరు నుంచి 2022 డిసెంబరు వరకూ దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఏపీకి 0.42 శాతం(రూ.5,751కోట్లు) వచ్చాయని కేంద్రం అధికారికంగా తెలిపింది. ఈ సీఎంకు, ఆయన పేటీఎం బ్యాచ్‌కి సిగ్గనిపించడం లేదా?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఐటీ రంగంలో రాష్ట్రం పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దేశం నుంచి రూ.12.5 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరిగితే అందులోమన రాష్ట్రం వాటా రూ.1,290 కోట్లు అయితే తెలంగాణ వాటా రూ.1.90 లక్షల కోట్లు. రాష్ట్రంలో గతంలో 3శాతం ఉన్న నిరుద్యోగం ఇప్పుడు 6శాతం దాటిపోయింది. దేశ వ్యాప్తంగా 17శాతం నిరుద్యోగం ఉంటే రాష్ట్రంలో 35శాతానికి పైగా ఉంది. విద్యలో, విజ్ఞానంలో పేరు పొందిన రాష్ట్రానికి ఈ పరిస్ధితి ఏమిటి? పెట్టుబడులు, పరిశ్రమలు రాకపోతే యువత ఏం కావాలి? సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టు, పల్ప్ పేపర్ పరిశ్రమ, రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్, టైటాన్ బ్యాటరీలు, అమర్‌రాజా, జాకీ, కియా అనుబంధ కర్మాగారాలు వంటివన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. లులూ గ్రూప్ యాజమాన్యం ఇక జీవితంలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టబోమని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్లింది. ఇక్కడంతా మెంటలోళ్లు ఉన్నారనుకొని ఈ రాష్ట్రానికి రావడానికి ఎవరూ ఇష్టపడని పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సీట్లో ఉండి సిగ్గూ, లజ్జా లేకుండా వ్యవహరించడం వీరికే చెల్లింది. కన్ను ఆర్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం ఈ ముఖ్యమంత్రికే సాధ్యం. ఈ విధ్వంసంతో యువత, రాష్ట్రం నాశనం అవుతున్నాయి. తెలంగాణ ఎంసెట్ రాయడానికి ఏపీ నుంచి 75వేల మంది దరఖాస్తు చేసుకొన్నారంటే ఏ స్థితికి దిగజార్చారో అర్థమవుతోంది’ అని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్ ప్రతిపక్షంలో ఏం చెప్పారో... ఇప్పుడు ఏం చెప్పారో విలేకరుల సమావేశంలో చంద్రబాబు వీడియో ప్రదర్శించారు. ‘ఒక్కదానిలో అయినా ఊసరవెల్లి నైజం ప్రదర్శించకుండా ఉన్నాడా? విశాఖలో ఉన్న విమానాశ్రయం రక్షణ శాఖది. మనం పూర్తిస్థాయిలో వాడుకోలేం. అందుకే కొత్త విమానాశ్రయానికి అన్ని అనుమతులు తెచ్చి భూమి సేకరించి 2019లో మేం శంఖుస్థాపన చేశాం. ఇప్పుడు ఈయన మళ్లీ శంఖుస్ధాపన చేసేదేమిటి? ఏపీలో పెట్టుబడులు పెడితే నిశ్చింత అనేకొనే స్థితి నుంచి ఈ రాష్ట్రానికి వెళ్తే ఏమవుతుందో అనుకొనే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం రాజ్యం ఏలుతోందని మోహన్‌దాస్ పాయ్ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలను ఏపీలో తరచూ మార్చేస్తున్నారని, ఆ రాష్ట్రానికి వెళ్లలేకపోతున్నామని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ బహిరంగంగా చెప్పారు. ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను తెస్తే వాటినీ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేసింది చెప్పుకోవడానికి లేక స్టిక్కర్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాటిని మీ మొహానికి కట్టుకొని తిరగండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఏ సందర్భం వచ్చినా ఆవు కథ చెబుతారు. వెన్నుపోటని అంటారు. అంతకు మించి మాట్లాడటానికి ఏమీ లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలి
‘‘రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నా.. వారికి అండగా నిలవడంలో జగన్‌రెడ్డి విఫలమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలకు పార్టీ శ్రేణ ులు అండగా నిలవాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అకాల వర్షాలు, పంట నష్టాలపై టీడీపీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల్ని ఆదుకోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 4, 5 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్లు ప్రకటించారు. ‘‘అకాల వర్షాలతో ఒక్కో రైతు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారు. వరి, మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.20 వేలు, మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారమివ్వాలి. పిడుగుపాటుకు మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వా లి. అకాల వర్షాలకు దెబ్బతిని, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి’’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.