నేడు కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ
ABN , First Publish Date - 2023-02-13T01:17:50+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలు కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలు కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పరమశివుడి వరంతో కన్నప్పగా మారిన తిన్నడికి కొండపై స్థానం లభించింది. భక్తుడికి పైన స్థానమిచ్చి కింద దేవదేవుడు కొలువైన క్షేత్రం ఇది. భక్తుడికి తొలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ పలకడం ఇక్కడ ఆనవాయితీ. 13రోజులపాటు జరిగే ఉత్సవాల్లో కన్నప్ప ధ్వజారోహణం ప్రథమఘట్టం. ముందుగా ముక్కంటి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అలంకార మండపం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వేదపండితులు ప్రత్యేక పూజలు చేశాక, కన్నప్ప ధ్వజారోహణ మహాకత్రువును నిర్వహించి, దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఉభయదాతలుగా శ్రీకాళహస్తికి చెందిన శ్రీబోయ కులస్తుల వారి సంఘం వారు వ్యవహరిస్తారు.