చిన్నపొరపాటు చేసినా నో ఎంట్రీ
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:48 AM
జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడమే కాదు.. పరీక్షలకు వెళ్లే ముందు ఏ చిన్న పొరబాటూ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలు మంగళవారం నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి.

2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్
తిరుపతి(విద్య), మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడమే కాదు.. పరీక్షలకు వెళ్లే ముందు ఏ చిన్న పొరబాటూ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలు మంగళవారం నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. పేపర్-1 పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా (బీఈ, బీటెక్) జరుగుతుంది. 9వ తేదీ ఉదయం పేపర్-2ఏ (బీఆర్క్) పరీక్ష, పేపర్-2బీ ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి. గతంలోనే మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్‌టీఏ నిబంధనలను తప్పకుండా అనుసరించాలి. అడ్మిట్ కార్డుల్లోనూ వాటిని పొందుపరిచారు.
నిర్దేశిత సమయానికి రెండు గంటలు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి అరగంటముందే కేంద్రంలోకి అనుమతిస్తారు.
సాధారణ వస్త్రాలనే ధరించాలి. ఆభరణాలు, వాచీలు ధరించకూడదు. సాధారణ చెప్పులనే వేసుకోవాలి.
బ్లూ, బ్లాక్ కలర్ బాల్‌పాయింట్ పెన్నులను తీసుకువెళ్లాలి.
ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌నే అనుమతిస్తారు.
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్టులను వెంట తీసుకెళ్లాలి.
ఎన్‌టీఏ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో సూచించిన బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోనే ఇక్కడా అతికించాలి.
ఆ పక్కనే ఉన్న మరో బాక్స్‌లో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి.
మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.
విద్యార్థి అడ్మిట్ కార్డుతోపాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరొక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తీసుకువెళ్లాలి.