పింఛనుదారులకు ‘సాంకేతిక’ భరోసా
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:05 AM
చేతిపై రాతలు కాస్త అరిగినా.. చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తినా వేలిముద్రలు పడేవి కావు. దీంతో పింఛన్ల కోసం వృద్ధులు.. సచివాలయ సిబ్బంది నిరీక్షించే వారు. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్-1 డివైజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారానే మంగళవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు.

ఎల్-1 ఆర్డీ పరికరాలతో వేలిముద్ర సమస్యకు పరిష్కారం
వీటితోనే నేటి నుంచి పింఛన్ల పంపిణీ
చేతిపై రాతలు కాస్త అరిగినా.. చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తినా వేలిముద్రలు పడేవి కావు. దీంతో పింఛన్ల కోసం వృద్ధులు.. సచివాలయ సిబ్బంది నిరీక్షించే వారు. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్-1 డివైజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారానే మంగళవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఎల్-0 ఆర్‌డీ పరికరాలను సచివాలయ సిబ్బందికి ఇచ్చారు. ఇవి సరిగా పనిచేయలేదని పలుమార్లు ఫిర్యాదుచేసినా అప్పట్లో పట్టించుకోలేదు. వేలిముద్రలు పడకపోవడంతో గంటల కొద్దీ పండుటాకులు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఎల్-1 ఆర్‌డీ పరికరాలను యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అఽథారిటీ ఆఫ్ ఇండియా) ఆధార్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. దీనిపై గీతలు పడినా, తేమ ఉన్నప్పటికీ వేలిముద్రలను నాణ్యతగా స్కాన్ చేస్తుంది. అలాగే అక్రమాలకూ చెక్ పెడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలను రూపొందించి పింఛన్లను పక్కదారి పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు యూఐడీఏఐకి చేరాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎల్-1 పరికరాలను కొనాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 5,264 పరికరాలు పంపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎల్1 ఆర్డీ స్కానర్లను అన్ని సచివాలయాలకు పంపామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆధార్ అనుసంధానంతో కూడిన ఈ పరికరం పింఛనుదారులకు సాంకేతిక భరోసాలాంటిదన్నారు. వీటి ద్వారా ఎటువంటి లోపాలకు తావులేకుండా వేలిముద్రలు పడతాయని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారులు నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ జగదీష్ సోమవారంరాత్రి తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్-1 పరికరాల ద్వారా 2,61,841 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయన్నారు.
- తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి