డాన్ అవ్వాలనే..!
ABN , First Publish Date - 2023-12-12T00:49:40+05:30 IST
తిరుమల బడిలో చదువుతున్న ముగ్గురు పిల్లలు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవడంతో తల్లిదండ్రులు సహా అందరూ ఊపిరి పీల్చుకున్నా, ఇళ్లొదిలి పోవడానికి వారు చెబుతున్న కారణాలు విన్న పోలీసులు మాత్రం నివ్వెరపోయారు.

- ఇళ్ల నుంచి పారిపోయిన తిరుమల విద్యార్థులు
తిరుమల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల బడిలో చదువుతున్న ముగ్గురు పిల్లలు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవడంతో తల్లిదండ్రులు సహా అందరూ ఊపిరి పీల్చుకున్నా, ఇళ్లొదిలి పోవడానికి వారు చెబుతున్న కారణాలు విన్న పోలీసులు మాత్రం నివ్వెరపోయారు. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపుతోందో ఈ ఉదంతం తెలియజేస్తోంది. డాన్‌లుగా మారి కోట్లు సంపాదించి తిరిగి రావాలనే అమాయకపు ఆలోచనతోనే వీరు ముగ్గురూ వెళ్లిపోయారని వెల్లడైంది.
గతేడాది విడుదలైన కామెడీ థ్రిల్లర్ ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 ఏళ్లున్న ముగ్గురు పాఠశాల పిల్లలు దావూద్ ఇబ్రహీంను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే రూ.50 లక్షల ప్రైజ్ మనీ తీసుకోవచ్చని భావించి ఇంటి నుంచి పారిపోవడం ఈ సినిమా మూల కథ. సరిగ్గా అదే తరహాలో తిరుమలకు చెందిన 13 ఏళ్ల ముగ్గురు పిల్లలు ఏకంగా తామే డాన్‌లుగా మారుదామని సిటీకి బయలుదేరారు.
ఎలా వెళ్లారంటే..
ఈ నెల 6వ తేదీన బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మధ్యాహ్నం 1.48 గంటల సమయంలో పిల్లలు తిరుమలలో ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతికి వెళ్లినట్టు తెలిసింది. 2.30 గంటలకు తిరుపతి బాలాజీ బస్టాండ్‌లో వీరు సీసీ కెమరాల్లో కనిపించారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. దీంతో ఆందోళన పెరిగింది. పోలీసులు తీవ్రంగా గాలింపు మొదలుపెట్టారు.మరుసటిరోజు ఉదయం విద్యార్థుల్లో ఒకరు తన తల్లికి ఫోన్ చేశాడు. భయంగా ఉందని, స్నేహితులు ఎక్కడికో తీసుకెళుతున్నారని చెప్పాడు. తన పక్కన ఉన్న ప్రయాణికుడి ఫోన్‌లో ఆ పిల్లవాడు తల్లికి ఫోన్ చేశాడు. ఆమె ఆ ప్రయాణికుడి ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు.ముగ్గురూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నారని, తర్వాత స్టేషన్ కామారెడ్డి వస్తుందని అతను తెలిపాడు. ఆమె తిరుమల పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ ప్రయాణికుడితో మాట్లాడి ముగ్గురినీ రైల్వే పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు గురువారం ఉదయం 9.20 గంటలకు కామారెడ్డి ఆర్పీఎఫ్ పోలీసుల వద్దకు చేరుకున్నారు.ఆ తర్వాత తిరుమల పోలీసులు విద్యార్థులను తిరుమలకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆకలితో ఇంటికి ఫోన్
కేవలం రూ. 700 డబ్బులు, ఒక ల్యాప్‌ట్యాప్‌తో ఈ ముగ్గురు స్నేహితులూ తిరుమల వదిలి బయలుదేరారు. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా తిరుగుతూ ఉండడంతో తల్లిదండ్రులు వీరిని మందలించేవారు. దీంతో తాము జల్సాగా బతకాలంటే కోట్లు సంపాయించాలనుకున్నారు. ఇందుకు పెద్ద నగరాలకు చేరుకుని డాన్‌లుగా మారాలని అనుకున్నారు. ఆన్‌లైన్‌లో గేములు అడితే కూడా కోట్లు వస్తాయనుకున్నారు. మధ్యాహ్నం బిర్యాని తినడానికి, ట్రైన్ టికెట్‌కే చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. రాత్రి, ఉదయం ట్రైన్‌లో ఆకలితో పస్తులుండాల్సి వచ్చింది. భయం మొదలైంది. ఈ క్రమంలోనే ఒకరు పక్క ప్రయాణికుడిని అడిగి తల్లికి ఫోన్ చేశాడు. పిల్లలు చెప్పిన సంగతులన్నీ విన్న సీఐ చంద్రశేఖర్ వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అదృష్టవశాత్తూ పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరారని, చైల్డ్ ట్రాఫికింగ్‌లో పడివుంటే పరిస్థితులు దారుణంగా ఉండేవన్నారు.విద్యార్థులను సోషల్‌మీడియాకు, సినిమాలకు దూరంగా ఉంచాలని సూచించారు.