CM Jagan: జగన్‌కు నిరసనల సెగ

ABN , First Publish Date - 2023-04-12T19:47:11+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)కు ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram)లో నిరసన సెగ తగిలింది. వైఎస్సాఆర్‌ ఈబీసీ నేస్తం రెండో విడత నిధులను బటన్‌ నొక్కి ప్రారంభించడానికి

CM Jagan: జగన్‌కు నిరసనల సెగ

మార్కాపురం: సీఎం జగన్‌ (CM Jagan)కు ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram)లో నిరసన సెగ తగిలింది. వైఎస్సాఆర్‌ ఈబీసీ నేస్తం రెండో విడత నిధులను బటన్‌ నొక్కి ప్రారంభించడానికి ఆయన బుధవారం మార్కాపురం వచ్చారు. రాష్ట్రంలో జిల్లా విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకటించినప్పుడు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అప్పట్లో 75 రోజులు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మళ్లీ తమ గళం వినిపించేందుకు పలువురు ఆందోళనకారులు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సాధన సమితి నాయకులకు నోటీసులిచ్చి హౌస్‌ అరెస్ట్‌ (House Arrest)లు చేశారు. కానీ స్థానిక జడ్పీ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ (Helipad) వద్ద నుంచి సభాప్రాంగణానికి వెళ్లే దారిలో దోర్నాల బస్టాండ్‌ వద్ద సాధన సమితి నాయకులు నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మరికొందరు సాధన సమితి నాయకులు సభావేదికపై సీఎం జగన్‌ మాట్లాడుతున్న సమయంలో మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఫ్లెక్సీని పైకెత్తి నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలించారు. ముఖ్యమంత్రి ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ కార్యకర్తలు వెళుతున్న సమయంలో పోలీసులు గేట్లు వేసి నిలువరించే ప్రయత్నం చేయగా వారు గోడలు దూకి వెళ్లిపోయారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పట్టణంలో దుకాణాలను మూసివేయించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను సీఎం సభకు మార్కాపురం నియోజకవర్గ నుంచి ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

Updated Date - 2023-04-12T19:47:16+05:30 IST