MP MVV Satyanarayana: ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై డీజీపీ వింత సమాధానం

ABN , First Publish Date - 2023-06-16T17:41:42+05:30 IST

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వింత సమాధానమిచ్చారు. ఎవరైనా సమాచారం ఇస్తేనే తాము స్పందించగలమని మీడియా ప్రతినిధులకే ఎదురు పశ్న వేశారు. ఎంపీ సమాచారం ఇచ్చిన వెంటనే ట్రేస్ చేశామని తెలిపారు. విశాఖ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారంటూ డీజీపీ కితాబిచ్చారు. ఎంపీకి సెక్యూరిటీ ఉంటుంది కానీ, ఎంపీ కుమారుడికి ఎందుకుంటుందన్నారు. కిడ్నాప్ వ్యవహరం ఎంపీ చెబితేనే తమకు తెలిసిందని ఆయన చెప్పారు.

MP MVV Satyanarayana: ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై డీజీపీ వింత సమాధానం

అమరావతి: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) వింత సమాధానమిచ్చారు. ఎవరైనా సమాచారం ఇస్తేనే తాము స్పందించగలమని మీడియా ప్రతినిధులకే ఎదురు పశ్న వేశారు. ఎంపీ సమాచారం ఇచ్చిన వెంటనే ట్రేస్ చేశామని తెలిపారు. విశాఖ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారంటూ డీజీపీ కితాబిచ్చారు. ఎంపీకి సెక్యూరిటీ ఉంటుంది కానీ, ఎంపీ కుమారుడికి ఎందుకుంటుందన్నారు. కిడ్నాప్ వ్యవహరం ఎంపీ చెబితేనే తమకు తెలిసిందని ఆయన చెప్పారు. కిడ్నాప్ విషయం ఎంపీకి ముందుగా తెలుసా? లేదా? అనే అంశంపై ఆయననే అడగాలని అడగాలంటూ మీడియాకు డీజీపీ సూచించారు. కిడ్నాప్ విషయం ఎంపీకి ఎప్పుడు తెలిసిందనే అంశంపై ఇంకా విచారణ చేయలేదని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌చౌదరితోపాటు, ఆయన వ్యాపార భాగస్వామి, సన్నిహితుడైన ఆడిటర్‌, వైసీపీ నేత, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అయిన గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ వ్యవహారం విశాఖలో కలకలం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం రేకెత్తించింది. ప్రముఖ ప్రజా ప్రతినిధి కుటుంబాన్నే టార్గెట్‌ చేసి, రెండు రోజులు నిర్బంధించారంటే...ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఎంవీవీ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసిన హేమంత్‌కుమార్‌ గతంలో మూడు కిడ్నాప్‌లు చేశాడు.

నాలుగేళ్ల క్రితం మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలిగా పనిచేసిన భోగసముద్రం విజయారెడ్డిని అక్కయ్యపాలెంలో ఆమె ఇంట్లోనే చంపేశాడు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. హేమంత్‌పై నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో హత్యాయత్నం, దాడులు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి 12 కేసులు ఉన్నాయి. ఓ కిడ్నాప్‌ కేసులో జైలుకు వెళ్లిన హేమంత్‌ ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసినప్పుడు కుమారుడు శరత్‌ వద్ద బంగారు ఆభరణాలు, ఎంపీ భార్య జ్యోతి వద్ద ఆభరణాలు, ఆడిటర్‌ జీవీ బయట నుంచి తెప్పించిన రూ.1.75 కోట్లు నగదు తీసుకున్నా నిందితులకు ఆశ చావలేదు. ఇంకా దేనికోసమో ప్రయత్నించారు. అది ఏమిటనేది తెలియదు.

Updated Date - 2023-06-16T17:41:42+05:30 IST