Share News

Andhra Pradesh: పుస్తకాలకు టెండర్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:35 AM

ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్యపుస్తకాల టెండర్లు ప్రధానంగా గైడ్‌లు ముద్రించే సంస్థలకే దక్కాయి. చిన్న ప్రింటింగ్‌ కంపెనీలు కఠిన నిబంధనల కారణంగా టెండర్లకు అర్హత పొందలేకపోయాయి. ఈ చర్యపై విమర్శలు వస్తున్నాయి.

 Andhra Pradesh: పుస్తకాలకు టెండర్‌

గైడ్‌లు ముద్రించే పబ్లిషర్లకే ఎక్కువ వర్క్‌

చిన్న ముద్రణదారుల ఉపాధిపై చావుదెబ్బ

ఆరోపణలున్న పబ్లిషర్లకూ అవకాశం

పాఠశాల విద్యాశాఖ తీరుపై విమర్శలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అనుకున్నంతా అయింది. విక్రయ పాఠ్యపుస్తకాల టెండర్లలో సింహభాగం గైడ్‌లు ముద్రించే కంపెనీలే దక్కించుకున్నాయి. రాబోయే రెండు విద్యా సంవత్సరాలకు సేల్‌ బుక్స్‌ టెండర్లు తాజాగా ఖరారయ్యాయి. మొత్తం 7 పబ్లిషింగ్‌ సంస్థలు టెండర్లలో అర్హత సాధించగా వాటిలో ఐదు సంస్థలు గైడ్లు ముద్రించేవే. 4, 9 తరగతులు విశాలాంధ్రకు, 1, 2, 10 తరగతులు వీజీఎ్‌సకు, 6వ తరగతి ప్రజాశక్తి బుక్‌హౌ్‌సకు, 3, 5, 7 తరగతులు ఎస్‌ఆర్‌కు, 8వ తరగతి శిరిడీ, విజయవాణి పబ్లిషర్లకు దక్కాయి. ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతుంటే పాఠశాల విద్యాశాఖ విధించిన నిబంధనలతో చిన్న ప్రింటర్లు ఈ టెండర్లకు అర్హత సాధించలేకపోయాయి. పాఠ్యపుస్తకాల ముద్రణలో గైడ్‌లు ముద్రించే ప్రింటర్లు, ప్రచురణకర్తల(పబ్లిషర్ల)ను మొదటినుంచీ దూరంగా ఉంచుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్‌ను వాడుకోకూడదని నిబంధనలున్నా వాటిని ఉల్లంఘించి మరీ ఈ కంపెనీలు గైడ్‌లు రూపొందిస్తున్నాయి. తొలుత గైడ్‌లు విక్రయించి, తర్వాతే పాఠ్యపుస్తకాలు అమ్మకానికి పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఎక్కువమంది విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు బదులు ఆయా కంపెనీల స్టడీ మెటీరియళ్లు, గైడ్‌లు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావంతో పాటు ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ కూడా తగ్గిపోతోంది. ఈ కారణాలతో కొన్నేఏళ్లుగా ఈ కంపెనీలకు పాఠ్యపుస్తకాల కాంట్రాక్టు ఇవ్వడం లేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఓ సలహాదారు ఒత్తిడితో గైడ్‌లు ముద్రించే సంస్థలకూ అవకాశం కల్పించారు. అలా అవకాశం పొందిన ఓ కంపెనీ ప్రభుత్వ కంటెంట్‌తో స్టడీ మెటీరియల్‌ తయారుచేసుకుని అమ్ముకుంది. అది అప్పట్లో పెద్ద వివాదమైంది. అదే కంపెనీకి ఇప్పుడు కూడా అవకాశం లభించింది!


చిన్న ప్రింటర్లు దూరం

రాష్ట్రంలో 50కిపైగా ప్రింటింగ్‌ కంపెనీలున్నాయి. వాటిలో ఐదారు మాత్రమే పెద్దవి కాగా, మిగిలినవన్నీ చిన్న, మధ్య తరగతి కంపెనీలే. ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇటీవల పాలసీ తీసుకొచ్చింది. పాఠశాల విద్యాశాఖ దానిని పట్టించుకోలేదు. చిన్న కంపెనీలు టెండర్లలోకి రాకుండా కఠిన నిబంధనలు పెట్టింది. ఇప్పటి వరకూ గత మూడేళ్లలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.5కోట్ల టర్నోవర్‌ ఉండాలనే నిబంధన ఉండగా, ఇప్పుడు గత మూడేళ్లలో ప్రతి సంవత్సరం రూ.10కోట్ల టర్నోవర్‌ ఉండాలన్నారు. గత మూడేళ్లలో కచ్చితంగా రెండేళ్లు పాఠ్యపుస్తకాలు ముద్రించి ఉండాలనే నిబంధన కూడా విధించడంతో చిన్న కంపెనీలు టెండర్లకు పూర్తిగా దూరమైపోయాయి. అందరూ ఊహించినట్లే గైడ్లు ముద్రించే కంపెనీలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వారికే పెద్దమొత్తంలో వర్క్‌లు లభించాయి. దీంతో పాఠశాల విద్యాశాఖ తీరుపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ విధానాలనే ఎలా కొనసాగిస్తారని చిన్న ప్రింటర్లు ప్రశ్నిస్తున్నారు.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 05:35 AM