Hyderabad: ఇంటికో దొంగల ముఠా.. నగరాలకు కలిసి వెళ్లి దోచేస్తారు
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:45 AM
ఆ ఏరియాలో ఇంటికో దొంగల ముఠా ఉంటుంది. ఇంట్లో అందరూ దొంగతనాలు చేసేవాళ్లే. హరియాణా, రాజస్థాన్‌కు చెందిన మొత్తం 10 మంది దొంగల ముఠాలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇంకా మిగతావారు దొరకాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- ఇటీవల చిక్కిన ఏటీఎం దొంగల ముఠా
- వారంతా రాజస్థాన్, హరియాణాకు చెందినవారే
- విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి
హైదరాబాద్ సిటీ: ఆ గ్రామాల్లో ఇంటికో దొంగల ముఠా ఉంది. నలుగురైదురు కలిసి నగరాల్లో రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌తో దోపిడీలకు పాల్పడతారు. ఇటీవల కేవలం 3 నిమిషాల్లో ఏటీఎంలో నింపిన రూ.29 లక్షలు కొట్టేసిన ప్రొఫెషనల్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరియాణా, రాజస్థాన్(Haryana, Rajasthan)కు చెందిన మొత్తం 10 మంది దొంగల ముఠాలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: New software: ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట..
వారిలో రాహుల్ ఖాన్, ముస్తకీమ్ ఖాన్, షారుక్ బషీర్ ఖాన్, రఫీక్ ఖాన్, సుబ్ధిన్ ఖాన్, జహుల్ బద్దన్ ఖాన్, వహీం ఖాన్, షకీల్‌ఖాన్ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములుగా (చిన్నాన్న పెదనాన్న పిల్లలు) పోలీసులు గుర్తించారు. మిగిలిన ఇద్దరులో ఒకరు బిహార్, మరొకరు హరియాణాకు చెందినవారు. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి హరియాణా, రాజస్థాన్ వెళ్లిన పోలీస్ బృందాలు ఆసక్తికర విషయాలను గుర్తించారు.
అన్నదమ్ములంతా కలిసి..
ఏటీఎం చోరీ నిందితులంతా రాజస్థాన్, హరియాణా రాష్ట్రాలకు బోర్డర్‌లో ఉన్న నూహ్, ఢీగ్ జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. ఆ గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తాయి. మరి కొందరు టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ నేరాలకు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇలా ప్రతి ఇంటిలోనూ ముగ్గురు నుంచి నలుగురు యువకులు ఒక ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అక్కడి ప్రాంతాలపై పట్టు సాధిస్తారు.
దొంగతనాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను రెక్కీ చేసి గుర్తిస్తారు. పక్కాగా దోపిడీ చేయొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాత సొంతూరుకు వెళ్తారు. అక్కడి అన్నదమ్ములతో చర్చించి అందరూ కలిసి ముఠాగా ఏర్పడి ఆ నగరానికి వెళ్తారు. ముందుగా ఎక్కడో ఒక చోట కారును చోరీ చేస్తారు. దాని రూపురేఖలను, రంగును మార్చేసి దోపిడీకి స్కెచ్ వేసిన ప్రాంతానికి కారులో వెళ్తారు. దొంగతనానికి గుర్తించిన ఏటీఎంలోకి చొరబడి సీసీటీవీలపై నల్లటి స్ర్పే కొట్టి, అలారమ్ వైర్‌ను కట్ చేసి, సరిగ్గా 3 నిమిషాల్లో అందినంతా దోచుకెళ్తారు.
అప్పులు తీర్చడం.. జల్సాలు చేయడం..
ఎన్ని లక్షల డబ్బును దోచినా వారి జీవన విధానాన్ని మార్చుకోరని పోలీసుల విచారణలో తేలింది. ఎవరికీ సరైన ఇల్లు ఉండదు. సగం సగం పూర్తయిన ఇళ్లు, మొండి గోడలు దర్శనమిస్తుంటాయి. దోచేసిన డబ్బుతో ముందుగా అప్పులు తీర్చేస్తారు. మిగిలిన డబ్బుతో జల్సాలు చేస్తారు. మళ్లీ డబ్బులు అవసరమైనప్పుడు ఏదో ఒక నగరంలో వలస వెళ్లిన తమ కుటుంబ సభ్యుల సహకారంతో మరో దోపిడీకి ప్లాన్ చేస్తారని పోలీసుల విచారణలో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..
పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..
Read Latest Telangana News and National News