'Vishnu Swamy': గుడి ఎనకా నా సామి విష్ణు లీలలు
ABN , First Publish Date - 2023-06-10T02:49:36+05:30 IST
కిందటి ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ.. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్యసాకేత క్షేత్రానికి వచ్చి 108 అడుగుల రామానుజాచార్యులవారి సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు గుర్తుందా? ఆరోజు.. చినజీయర్ స్వామి ప్రధాని వెన్నంటేఉండి ఆయనకు అన్నీ వివరించారు.

చినజీయర్ ఆశ్రమ యువరాజు విలాసాలు
పగలు స్వామి అవతారం.. రాత్రికి రాక్‌స్టార్
ఖరీదైన కారులో అమ్మాయిలతో షికార్లు.. స్నేహితులతో కలిసి పబ్‌లు, హోటళ్లకు
రియల్టర్లతో ఆర్థిక బంధాలు?.. వాటితోనే పక్కదారి!.. ఉత్తరాధికారిగా ప్రచారం
‘విష్ణు స్వామి’ వ్యవహారాలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ పరిశోధనాత్మక కథనం
విష్ణు స్వామి.. ఆయన పగలు యోగి. రాతిరైతే భోగి. ఉదయం నుంచి సాయంత్రం దాకా.. ఎంతో నిష్ట కలిగిన స్వామి అవతారం. సాయంత్రం కాగానే అవతార మార్పిడి జరుగుతుంది. మడిబట్టలు మరుగై.. జీన్స్, టీషర్ట్ ఒంటిపైకి వస్తాయి. ఖరీదైన కార్లలో పరిమితికి మించిన వేగంతో షికార్లు.. స్నేహితులతో కలిసి పబ్‌ల్లో హంగామా ఆయన సాయంకాలపు అభిరుచులు!! తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా స్వాములు, బాబాలు ఎంతోమంది! అలాంటివాళ్లలో ఈయనా ఒకరైతే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ, ఈయన.. త్రిదండి చినజీయర్ స్వామి మేనల్లుడు. ఆయన వెన్నంటే ఉంటూ.. ఆశ్రమ వ్యవహారాలన్నీ అంతా తానై నడుపుతున్న విష్ణు స్వామి.. చినజీయర్ స్వామికి తెలియకుండా ఆయన వెనకాల సాగిస్తున్న వ్యవహారాలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ పరిశోధనాత్మక కథనం.
(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం): కిందటి ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ.. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్యసాకేత క్షేత్రానికి వచ్చి 108 అడుగుల రామానుజాచార్యులవారి సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు గుర్తుందా? ఆరోజు.. చినజీయర్ స్వామి ప్రధాని వెన్నంటేఉండి ఆయనకు అన్నీ వివరించారు. చాలామంది గమనించి ఉండరుగానీ.. చినజీయర్‌స్వామితోపాటు ప్రధాని వెంట మరో ‘యువ’ స్వామి కూడా ఉన్నారు. ఆ తర్వాత.. జనసేనాని పవన్ కల్యాణ్ ముచ్చింతల్ క్షేత్రానికి వచ్చినప్పుడు కూడా ఆ చిన్న స్వామిదే హడావుడి. అంతెందుకు.. ఇటీవలే జరిగినా ‘ఆదిపురుష్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా చినజీయర్ స్వామితో పాటు వచ్చిన ఓ యువ స్వామిని గమనించే ఉంటారు! ఆ యువ స్వామి పేరు.. విష్ణు స్వామి. చినజీయర్ స్వామికి అన్నీ ఆయనే. ఇటీవలే ఆయన వెంట అమెరికాకు కూడా వెళ్లారు. జీయర్ ఆశ్రమంలో చినజీయర్ తర్వాత విష్ణు స్వామి మాటే చెల్లుబాటు అవుతుంది. ఆశ్రమంలో అందరూ ఆయన్ను ‘చిన్న స్వామి’ అనే అంటారు. నంబర్-2గా పరిగణిస్తారు. తెల్లటి ధోవతి, ఉత్తరీయం ధరించి.. పూజాపునస్కారాలు చేస్తూ.. పరమ ధార్మికుడిలా, బుద్ధిమంతుడిలా కనిపించే సదరు చిన్నస్వామిలో మరో కోణం కూడా ఉంది! అది జల్సాపురుషుడి కోణం. ఆ అవతారం ధరించినప్పుడు ఆయన.. జీన్‌ప్యాంట్, టీషర్ట్‌లో, ఖరీదైన కార్లలో అమ్మాయిలతో కలిసి సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతారు. నిత్యం పూజలు చేసే అవే చేతులతో విష్ణు స్వామి.. రివాల్వర్ కూడా తిప్పుతారు. స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పబ్‌లకు వెళ్లి సేదతీరుతారు. మద్యపానం, ధూమపానం చేసేవారిని చుట్టూ పెట్టుకుని.. చెవులు హోరెత్తించే సంగీతం వినిపిస్తుండగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు.
ఇంతకీ ఎవరీయన?
ఆశ్రమంలో చినజీయర్ తరువాత అంత పవర్‌ఫుల్ అయిన విష్ణు స్వామి ఎవరనేది చాలా మందికి తెలియదు. ఈ విష్ణుస్వామి.. సాక్షాత్తూ చినజీయర్ స్వామి సోదరి కుమారుడు. తెలిసిన వారెవరైనా ఆ సంబంధం గురించి అడిగితే.. అదంతా పూర్వాశ్రమం సంగతి అని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ విష్ణు స్వామి జీయర్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో.. విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండే వారు. తరువాత కాలంలో జీయర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యత తీసుకున్నారు. చినజీయర్ స్వామి ఉత్తరాధికారి విష్ణు స్వామే అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. జీయర్ ట్రస్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వ్యవహారాలను వారసుడిగా ఈయనకే అప్పజెప్తారని.. అందుకే ఆశ్రమంలో ఆయన ప్రభ అంతలా వెలిగిపోతోందని సమాచారం.
పేరు లేకుండానే..
రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే.. దేశంలో తిరిగే ఏ వాహనం వివరాలైనా ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుంది. ఆ నంబర్‌తో సెర్చ్ చేస్తే.. వాహన యజమాని పేరు, చిరునామా వంటివి వస్తాయి. కానీ విష్టుస్వామి తిరిగే కారు వివరాలు అలా రావు. వాహన యజమాని పేరు అనే చోట.. ‘నల్’ అని వస్తుంది. మరి అలా వచ్చేలా ఎలా మేనేజ్ చేశారో తెలియదు. అలాగే.. ఆయన కారు నంబరు ఏపీ 37 సీయూ 0999 కాగా ఇందులో సున్నా తీసేసి నంబర్ ప్లేట్‌పై ఏపీ 37 సీయూ 999గా పేర్కొన్నారు. ఇది రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించడమే.
జోరుగా షికార్లు.. కారుపై చలాన్లు
పంచెకట్టు మార్చి జీన్‌ప్యాంటు వేసి విలాసవంతమైన కారులో బయటకు వెళ్లినప్పుడు.. ఈ స్వామి వేగాన్ని అందుకోవాలంటే కష్టమే. ఆయన నిత్యం తిరిగే కారు (ఏపీ37సీయూ0999) వేగం గంటకు 100 కి.మీ పైనే. కిందటినెల 4న అప్పాజంక్షన్ వద 121 కి.మీ వేగంతో వెళుతున్న విష్ణు స్వామి కారు స్పీడ్‌గన్‌కు చిక్కింది. అలాగే 12వ తేదీన రాజేంద్రనగర్‌లో 117 వేగంతో స్పీడ్ వెళుతున్నట్లు చలానా ఉంది. గతంలో కట్టంగూర్ వద్ద 112 కి.మీ వేగంతో వెళుతూ స్పీడ్‌గన్‌కు దొరికారు. ఈ చలానాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
రియల్ సంబంధాలు
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహం ఏర్పాటు తరువాత ఆశ్రమం చుట్టు పక్కల భూముల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంగా ఉండడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇటీవల 111జీవో కూడా ఎత్తివేయడంతో ఆశ్రమానికి ఇరువైపులా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చాలామంది.. పలు వెంచర్లు, విల్లాల ప్రారంభోత్సవానికి జీయర్ స్వామిని ఆహ్వానించేందుకు వస్తుంటారు. ఇలా వస్తున్నవారిలో కొందరితో విష్ణుస్వామికి ఏర్పడ్డ పరిచయాలు ఆర్థిక సంబంధాలుగా మారినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తనకున్న పరపతితో కొన్ని భూవివాదాలను కూడా ఆయన పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. ఈ రియల్ సంబంధాలే విష్ణుస్వామిని పక్కదారి.. పబ్‌ల దారి పట్టించాయనే ప్రచారం సాగుతోంది. చట్టం అనుమతించిన వయసు వస్తే పబ్‌కే కాదు.. తమకు ఇష్టం వచ్చినచోటుకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. కానీ.. ‘మద్యమాంసాలు మనిషికి చేటు చేస్తాయి’ అని ప్రవచించే చినజీయర్ స్వామి మేనల్లుడై ఉండీ.. ఆయనతోపాటే పూజాకార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి.. ఆశ్రమవాసి అయి ఉండీ పబ్‌కు వెళ్తే.. ఆ చెడ్డపేరు తనకు కాదని, చినజీయర్ స్వామికి వస్తుందన్న గ్రహింపు విష్ణు స్వామికి లేకపోవడమే గమనార్హం.