తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తిప్పలు!

ABN , First Publish Date - 2023-02-23T03:26:06+05:30 IST

గన్నవరం ఘటనపై పోలీసులు, ప్రభుత్వ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నానా తంటాలు పడ్డారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తిప్పలు!

గతంలో వైసీపీ వాళ్లపైనా పోలీసులు ఇలానే చేశారు

సలహాదారు సజ్జల వ్యాఖ్యలు.. పట్టాభిపై దాడిని సమర్థించే యత్నం

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గన్నవరం ఘటనపై పోలీసులు, ప్రభుత్వ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నానా తంటాలు పడ్డారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. గతంలో వైసీపీ నేతల పట్లా పోలీసులు ఇలాగే ప్రవర్తించారంటూ టీడీపీ నేత పట్టాభిపై దాడిని సమర్థించేలా ఆయన మాట్లాడారని ఆక్షేపిస్తున్నాయి. సజ్జల బుధవారమిక్కడ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టాభి రెచ్చగొట్టినందునే గన్నవరం సంఘటన జరిగిందన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారని.. ఉమెన్‌ పార్లమెంటు సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఊరూరా తిప్పి హైదరాబాద్‌లో వదిలారని చెప్పారు. పట్టపగలు పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డిని వెంటాడి చంపలేదా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాత్రి పగలూ చెన్నై, బెంగళూరుల్లో పోలీసులు తిప్పలేదా అని ప్రశ్నించారు. పోలీసులు వందల కిలోమీటర్లు తిప్పడం చంద్రబాబే నేర్పారని అన్నారు. సంబంధం లేని ఘటనలతో పట్టాభిపై దాడిని ముడిపెడుతూ.. గతంలో మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ చేస్తున్నామన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నాయి. గన్నవరం ఘటనపై నిజానిజాలు తేలుస్తామని.. నిజనిర్ధారణ కమిటీని వేస్తామనో.. న్యాయ విచారణ జరిపి తప్పు ఎవరిదో తేలుస్తామనో ప్రభుత్వ సలహాదారుగా ఆయన చెప్పి ఉంటే బాగుండేదని.. కానీ నిస్సిగ్గుగా సమర్థించేందుకు యత్నించారని విమర్శిస్తున్నాయి.

Updated Date - 2023-02-23T03:26:08+05:30 IST

News Hub