Kanna Lakshminarayana: రేపు టీడీపీలో కన్నా.... ఆయనతో పాటు...
ABN , First Publish Date - 2023-02-22T21:35:37+05:30 IST
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం టీడీపీలో చేరనున్నారు.
గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో ఆయన పచ్చ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా ఇప్పటికే అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత గుంటూరు జిల్లాకు చెందిన తాళ్ల వెంకటేష్‌యాదవ్ కూడా ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి కన్నాతో పాటు టీడీపీలో చేరుతున్నారు. మాజీ ఎంపీ దివంగత లాల్‌జాన్‌బాషా (Laljanbasha) సోదరుడు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్ నిజాముద్దీన్ కూడా బీజేపీని వీడి కన్నాతో పాటు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
సుమారు రెండు వేల మంది అనుయాయులతో ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో కన్నా ఇంటి వద్ద నుంచి ప్రధాన సెంటర్‌లో ఎన్‌టీఆర్, చంద్రబాబు, లోకేశ్, కన్నా ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంతకుముందు కన్నా ఇంటి వద్దనున్న బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు. నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాధరణ మెండుగా ఉంటుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టు ఉన్న నేతగా ఆయన పేరొందారు. కన్నా చేరికను జిల్లాకు చెందిన యావత్తు టీడీపీ నేతలు స్వాగతించారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీలో చేరే కార్యక్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు స్వాగతించేందుకు వెళుతున్నారు.