అడుగుకో రోగం..!

ABN , First Publish Date - 2023-06-07T00:54:17+05:30 IST

ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో నరాలకు సంబంధించిన డాక్టర్‌ దగ్గర చూపించుకున్నాడు. డాక్టర్‌ పరీక్షించి ఏడు రకాల మందులు రాశారు. ఆ బ్లాకులోని ఫార్మసీకి వెళ్తే ఐదు రకాల మందులిచ్చి మిగిలినవి బయట కొనాలని చెప్పడంతో డబ్బులేక అనేక ఇబ్బందులు పడ్డాడు. సింగ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాస్‌ సంబంధిత ఇబ్బందితో ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఆయనకు హెచ్‌బీవీ, డీఎన్‌ఏ వైరల్‌ లోడ్‌ ఫిబ్రోస్కాన్‌ చేయించుకోవాలని సూచించారు. ప్రిస్ర్కిప్షిన్‌ చీటీపై ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌ నెంబరు రాసిచ్చి అక్కడకు వెళ్లి స్కానింగ్‌ చేయించుకుని పరీక్షల రిపోర్టు తీసుకొస్తే మందులు ఇస్తామని చెప్పడంతో ఆయన జేబు ఖాళీ చేసుకుని ఆ రిపోర్టు తీసుకొచ్చారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు నెల రోజులు.. అరకొరగా మందులు.. ఈలోగా రోగికి రోగం ముదిరితే ఇక అంతే సంగతులు. నాలుగు జిల్లాలకు పెద్దాసుపత్రిగా చెప్పుకొంటున్న కొత్త ప్రభుత్వాసుపత్రిలోని రోగుల పరిస్థితి ఇది. సూపర్‌ స్పెషాలిటీ అని గొప్పలు పోతున్నప్పటికీ పేద రోగులకు అందేది అరకొర వైద్యమే.

అడుగుకో రోగం..!

రక్తపరీక్ష కిట్లు లేవు.. మందుల కొరత

మూడు రోజులు తిరిగితేనే మందులు దొరికేది

ఎంఆర్‌ఐకు 20 రోజుల సమయం

రోజుకు 15 మందికే

లోకల్‌ పర్చేజింగ్‌లో రూ.కోట్లలో బకాయిలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి పేరుకే పెద్దాది. ఇక్కడికి వచ్చిన రోగులకు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పరీక్షలు చేస్తే మందులు దొరకవు. పోనీ పరీక్షలేమన్నా పూర్తిస్థాయిలో జరుగుతున్నాయా అంటే అదీ లేదు. చివరకు డాక్టర్లు సూచించే మందులేమో సగం సగమే ఇచ్చి సరిపెడుతున్నారు. మిగతా సగం బయట కొనాలని చెబుతున్నారు. అలాగే, ఆర్భాటంగా ప్రారంభించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోనూ రోగులకు కష్టాలు మామూలే. గ్యాస్ర్టిక్‌, డయాలసిస్‌ సమస్యలతో వచ్చే రోగుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. కొన్ని రక్త పరీక్షలు, స్కానింగ్‌లు ఇక్కడ లేకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గరకు వెళ్లడం తప్పనిసరవుతోంది. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకుని దాన్ని మళ్లీ డాక్టర్‌కు చూపించుకోవాలంటే కనీసం నెల పడుతోంది.

అరకొర మందులే దిక్కు

ఆసుపత్రికి కావాల్సిన మందులు సీడీఎస్‌ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌) నుంచి సింహభాగం సమకూరుతాయి. కొన్ని మందులు సీడీఎస్‌ లిస్టులో లేకపోతే వాటిని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో వైద్యులు సూచించే మందులు అత్యాధునికంగా ఉంటాయి. ఈ మందులు సీడీఎస్‌ లిస్టులో లేకపోవడంతో ఆసుపత్రి అధికారులు లోకల్‌ పర్చేజింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో మందుల సరఫరాదారులకు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రికి మందులు సరఫరా చేయాలంటే కొంతమంది కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. పాత బకాయిలు తీరిస్తే కానీ కొత్త మందులు సరఫరా చేయలేమని చెబుతున్నారు. ఫలితంగా కొత్తాసుపత్రిని మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఐదు రోజులకే మందులిచ్చినా ఒకటో అరో తగ్గేంచేవారని, ఇప్పుడు ఇచ్చే మందుల్లో నాలుగైదు రకాల మందులు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. ఇదేంటని అడిగితే వచ్చే నెలలో వస్తాయి, అప్పుడు వచ్చి తీసుకోండని సమాధానం ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల నుంచి గ్యాస్‌కు సంబంఽధించిన ఫ్యాంటాప్రోజోల్‌ ట్యాబ్లెట్లు అందుబాటులో లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎంఆర్‌ఐకు 20 రోజులు

ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాలంటే కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. స్కాన్‌ అయిన రెండు మూడు రోజుల తర్వాత వస్తే రిపోర్టులు ఇస్తారు. ఆ తర్వాత డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. ఎంఆర్‌ఐ స్కాన్‌కు చాలా డిమాండ్‌ ఉంటుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు స్కానింగ్‌ తీస్తారు. మధ్యాహ్నం రెండు గంటల పాటు విరామం ఇస్తారు. కానీ, రోజుకు కనీసం 15 మందికి కూడా ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయడం లేదు. ఇన్‌పెషేంట్లకు కూడా ఇక్కడే స్కానింగ్‌ చేస్తుండటంతో ఓపీ రాయించుకున్న వారికి వెంటనే స్కానింగ్‌ చేయడం సాధ్యం కావట్లేదని సిబ్బంది చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన రోగులకు నిరాశే మిగులుతోంది. ఈలోపు రోగం ముదిరి ప్రాణాపాయం జరిగితే దానికి బాధ్యులెవరని రోగులు ప్రశ్నిస్తున్నారు. స్కానింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-06-07T00:54:17+05:30 IST