Share News

మెట్రోకు మొదటి అడుగు

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:06 AM

విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టాకు ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) ఇచ్చారు. శిస్ర్టా సంస్థ.. ఏపీఎంఆర్‌సీ అధికారులతో భేటీ కావటంతో పాటు క్షేత్రస్థాయిలో సర్వే కూడా ప్రారంభించింది.

మెట్రోకు మొదటి అడుగు

సీఎంపీ సర్వేకు ఏపీఎంఆర్‌సీ అధికారులు ఓకే

శిస్ర్టా సంస్థకు ఎల్‌వోఏ విడుదల

సీఎంపీ సర్వే ప్రారంభం.. మూడు నెలల్లో పూర్తి

కేంద్ర ప్రభుత్వం వద్దకు సర్వే రిపోర్టు

అనంతరం పనులు ప్రారంభమయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టాకు ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) ఇచ్చారు. శిస్ర్టా సంస్థ.. ఏపీఎంఆర్‌సీ అధికారులతో భేటీ కావటంతో పాటు క్షేత్రస్థాయిలో సర్వే కూడా ప్రారంభించింది.

నూరుశాతం నిధులు కేంద్రమే భరించేనా?

విజయవాడ మెట్రో ప్రాజెక్టును నూరుశాతం ఖర్చు భరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీఎంఆర్‌సీ రాసిన లేఖ మేరకు తాజా సీఎంపీ తయారు చేయాల్సిందిగా కేంద్రం నిర్దేశించింది. సీఎంపీ రూపకల్పనకు ఏపీఎంఆర్‌సీ అంగీకారం తెలపటంతో.. కన్సల్టెంట్‌ ఎంపికను వేగంగా చేపట్టింది. ఇంతకుముందు విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారుచేసిన శిస్ర్టా సంస్థే ఈ సీఎంపీ బాధ్యతలను కూడా దక్కించుకుంది. కన్సల్టెన్సీ సంస్థతో మాట్లాడి అగ్రిమెంట్‌ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం సీఎంపీ రూపొందించటానికి అనుమతులు ఇచ్చింది. 18న ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు శిస్ర్టాకు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) ఇచ్చారు. అనంతరం శిస్ర్టా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకల సర్వేను చేపట్టడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలో నిర్దేశించింది. దీంతో శిస్ర్టా ప్రతినిధులు ఇప్పటికే సర్వే చేపట్టడానికి రంగంలోకి దిగారు. మూడు నెలల్లో దీనిని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏపీఎంఆర్‌సీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమోదింపజేస్తారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ సీఎంపీ ఆధారంగా విజయవాడ మెట్రోకు ఉన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోగలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఆర్‌సీ అధికారులు కోరినట్టుగా నిధులు ఎంత మేరకు విడుదల చేయాలో నిర్ణయించుకుంటుంది. కోలకతాలో మాదిరిగా కేంద్ర మే పూర్తి నిధులతో మెట్రో ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంటుంది. సీఎంపీ పూర్తయ్యే వరకు విజయవాడ మెట్రోకు నిధుల అంశం కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. విజయవాడ మెట్రోరైల్‌ మొదటి కారిడార్‌.. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ఎన్‌హెచ్‌-16 మీదుగా ఎన్టీఆర్‌ జిల్లా రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వరకు ఉంది. రెండో కారిడార్‌.. కృష్ణాజిల్లాలోని పెనమలూరు సెంటర్‌ నుంచి ఎన్టీఆర్‌ జిల్లాలో బందరు రోడ్డు మీదుగా బస్టాండ్‌ వరకు సాగుతుంది. ఈ రెండు కారిడార్లకు రూ.11,009 కోట్ల వ్యయమవుతుంది.

Updated Date - Mar 21 , 2025 | 01:07 AM