సిబ్బంది లేక సతమతం
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:02 AM
తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్ లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకం గా పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తోట్లవల్లూరు పీఎస్‌లో ఉండాల్సింది 28 మంది.. ఉన్నది 18
నైట్‌బీట్లు కుదింపు.. పనిచేయని సీసీ కెమెరాలు
నిఘా తగ్గడంతో వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు కత్తిరించుకుపోతున్న దొంగలు
(ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు): తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్ లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకం గా పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎనిమిది కాని స్టేబుళ్లు, రెండు ఏఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోంగార్డుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. సిబ్బంది కొరత ఉండడంతో నైట్‌బీట్లను కుదించారు. దీంతో దొంగలకు భయం కొరవడింది. పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 28 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 18 మంది ఉన్నారు. పదిమంది హోంగార్డులకు ఇద్దరే విధులకు వస్తున్నారు. కానిస్టేబుళ్లు, హోంగార్డుల కొరత ఉండడంతో శాంతిభద్రతల పర్యవేక్షణ కుంటుపడిపోయింది. గతంలో ఒక కాని స్టేబుల్, ఒక హోంగార్డుతో నాలుగు గ్రామాలకొక నైట్‌బీట్ వేసేవారు. 16 గ్రామాల కు నాలుగు నైట్‌బీట్లు వేసేవారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌బీట్ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ ఉండేవారు. కొంతైనా దొంగలకు భయం ఉండేది. ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల మూడు నైట్‌బీట్లను నిలిపివేశారు. ఒక్క నైట్‌బీట్ మాత్రమే వేస్తున్నారు.
స్వేచ్ఛగా పని ముగించుకెళుతున్న దొంగలు
పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరతతో నైట్‌బీట్లు తగ్గిపోయాయి. మరోవైపు నిఘా నేత్రంగా పనికొస్తాయని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలాకాలంగా పనిచేయటం లేదు. కరకట్టపై ప్రతి గ్రామం వద్ద, గ్రామం లోపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. అవి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూ రు, భద్రిరాజుపాలెం ఇలా కరకట్ట వెంట ఐలూరు వరకు సీసీ కెమెరాలు పని చేయ టం లేదు. దీంతో దొంగలు స్వేచ్ఛగా తమపని ముగించుకుని నిఘా నేత్రాలకు చిక్కకుండా బయటపడుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తే ఎలాంటి దొంగతనమైనా ఛేదించేందుకు పోలీసులకు సాధ్యమవుతుంది.
ఉన్నవారినే వినియోగించుకుంటున్నాం
పోలీ్‌సస్టేషన్‌లో ఉన్న 18 మంది సిబ్బందితో డ్యూటీలు నిర్వహిస్తున్నాం. బందోబస్తులకు ఈ 18 మందిలోనే వెళ్లాల్సి వస్తోంది. హోంగార్డులు ఇద్దరే ఉన్నారు. ఉన్నవారిని వినియోగించుకుంటున్నాం. సీసీ కెమెరాలు పనిచేయటం లేదని ఏజెన్సీ వారికి తెలియజేశాం. బాగుచేసేందుకు వాళ్లు రావడం లేదు. - ఎస్సై సీహెచ్ అవినాశ్