బెజవాడ వేదికగా బెట్టింగ్ బాగోతం
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:05 AM
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో బెజవాడ లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. రకరకాల బెట్టింగ్ యాప్‌లకు బుల్లితెర నటులు ప్రమోషన్లు చేసిన విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్‌ల నివారణ ఉద్యమం తెలంగాణను ఓ ఊపు ఊపుతోంది. ఇప్పటికే 11 మంది బుల్లితెర నటులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేశారు.

హైదరాబాద్ బుల్లితెర నటులతో నగర బుకీలకు లింకులు
చిట్టినగర్, సత్యనారాయణపురం బుకీలే ప్రధానం
పంజాగుట్ట పోలీసులకు చిక్కిన ఆధారాలు
త్వరలో నగరానికి రానున్న తెలంగాణ పోలీసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో బెజవాడ లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. రకరకాల బెట్టింగ్ యాప్‌లకు బుల్లితెర నటులు ప్రమోషన్లు చేసిన విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్‌ల నివారణ ఉద్యమం తెలంగాణను ఓ ఊపు ఊపుతోంది. ఇప్పటికే 11 మంది బుల్లితెర నటులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు సాంకేతికంగా చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చినట్టు తెలిసింది. ఇందులోబెజవాడకు సంబంధించిన బుకీల లింకులు బయటపడినట్టు సమాచారం. రకరకాల యాప్‌ల్లో బెజవాడ బుకీలు బెట్టింగులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం జరిగిన వరల్డ్ చాంపియన ట్రోఫీలోనూ కోట్ల రూపాయల బెట్టింగులను బుకీలు నిర్వహించారు. ఇప్పుడు ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పందేలను బెట్టింగ్ యాప్‌ల ద్వారా పరుగులు తీయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విజయవాడకు చెందిన బుకీలు వేర్వేరు పేర్లతో సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా బుల్లితెర నటులను ఫాలో అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆ ఇద్దరే కీలకం
బెట్టింగ్‌లు నిర్వహించడంలో రెండు తెలుగు రాషా్ట్రల్లో పేరు మోసిన ఇద్దరు వ్యక్తుల పేర్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఇందులో ఒకరు చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, మరొకరు సత్యనారాయణపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం బుల్లితెర నటులను విచారణ చేసే పనిలో ఉన్న పంజాగుట్ట పోలీసులు త్వరలో విజయవాడ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చిట్టినగర్‌కు చెందిన వ్యక్తిపై ఇప్పటికే బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాదులో ఉంటూ విజయవాడలో బెట్టింగులను నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లనుప్రమోట్ చేస్తున్న బుల్లితెర నటులతో ఈ ఇద్దరికీ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారని విశ్వసనీయంగా తెలిసింది. వారితోపాటు ఇంకా ఎవరెవరున్నారు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బయటకు కనిపించకుండా వ్యవహారాలు
చిట్టినగర్‌కు చెందిన వ్యక్తి హైదరాబాదులో ఉంటూ ఇక్కడ సబ్ బుకీలను తయారు చేశాడు. వాళ్ల ద్వారా మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నాడు. సత్యనారాయణపురానికి చెందిన ఓ బుకీ రాజవిల్లాల్లో ఉంటూ ఉమ్మడి జిల్లాకు నలుదిక్కులా బుకీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బుకీ నగరంలో నడిబొడ్డున ఓ భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ప్రతి ఇసుకలోనూ బెట్టింగ్ సొమ్ము ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరి బుకీల పేర్లను పంజాగుట్ట పోలీసులు డైరీలో రాసుకున్నట్టు తెలిసింది. హైదరాబాదులో ఉండే కామన ఫ్రెండ్స్ ద్వారా ఈ బుకీలు బుల్లితెర నటులకు దగ్గరైనట్టు సమాచారం.