Share News

ఇదేం భద్రత?

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:10 AM

పేరుకే రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయం. భద్రతలో మాత్రం అధమం. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భద్రతపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా ఆక్టోపస్‌ బృందం రెండు రోజుల పాటు నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో వాటన్నింటినీ ధ్రువీకరించింది. సంఘ విద్రోహ శక్తులు తేలిగ్గా ప్రవేశించే అనేక మార్గాలను ఉటంకించిన ఈ బృందం.. ఆలయంలోని అనేక అంశాల్లో, మార్గాల్లో నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపించింది.

ఇదేం భద్రత?
ఆలయం, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో ఆక్టోపస్‌ సమావేశం

దుర్గగుడిలో భద్రతా చర్యలను వేలెత్తిచూపిన ఆక్టోపస్‌ టీమ్‌

రెండు రోజుల మాక్‌డ్రిల్‌లో లోపాలు కనుగొన్న బృందం

నామమాత్రపు చర్యలతో నడిపిస్తున్నారని ఉద్ఘాటన

ఆలయంలోకి తేలిగ్గా ప్రవేశించే మార్గాలపై దృష్టి

అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలేవని ప్రశ్న

ఎవరుపడితే వారు ఆలయంలోకి వచ్చేస్తున్నారని వెల్లడి

లగేజీల చెకింగ్‌ లేదంటూ ఆగ్రహం

ఇంద్రకీలాద్రి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దేవస్థానంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్న క్రమంలో ప్రత్యేక ఆక్టోపస్‌ బృందం ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజాము వరకు మాక్‌డ్రిల్‌ నిర్వహించింది. ఈ మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్న నిపుణుల బృందం కీలకమైన లోపాలను గుర్తించినట్లు సమాచారం. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి..

  • ఆలయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అటు భక్తులను కానీ, ఇటు సిబ్బందిని కానీ హెచ్చరించటానికి సైరన్‌ వంటి సౌకర్యం కల్పించలేదు.

  • ఆలయానికి చుట్టుపక్కల తేలిగ్గా రాకపోకలు సాగించటానికి అనేక మార్గాలు ఉన్నాయి.

  • గుర్తింపు లేని వ్యక్తులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లతో మహామండపం, ఘాట్‌రోడ్డు, ప్రొటోకాల్‌ వరకు కూడా వచ్చేస్తున్నారు.

  • ఆలయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేందుకు క్రెసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ లేదు.

  • ప్రధాన ప్రాంతాల్లో బిల్డింగ్‌ మ్యాప్‌లు, ఫ్లోర్‌ మ్యాప్‌లు లేవు.

  • మహామండపంలో చాలాచోట్ల గేట్లకు తాళాలు వేసి, కొన్నిచోట్ల వెల్డింగ్‌ చేసి ఉంచారు. అత్యవసర సమయంలో గేట్ల తాళాలు అందుబాటులో లేకపోవటం పెద్ద లోపంగా గుర్తించారు.

  • మెడికల్‌ సెంటర్‌లో తగినంత సిబ్బంది లేకపోవటాన్ని, సీసీ టీవీ నిర్వహణ సక్రమంగా లేకపోవటాన్ని కూడా గుర్తించారు.

  • ఎలక్ర్టికల్‌ సిస్టమ్‌ ఆఫ్‌, ఆన్‌ చేయటానికి ఉండే సిబ్బంది పేర్లు, వారి ఫోన్‌ నెంబర్లు అందుబాటులో లేవు.

  • భద్రతా చర్యలరీత్యా సెల్‌ జామర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల సిబ్బంది, అధికారులు మాట్లాడుకోవటానికి, సంప్రదించటానికి సరైన టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేదు.

  • అంతరాలయంలోకి భక్తులు కాలేజీ బ్యాగ్‌లు, లగేజీ బ్యాగ్‌ల సహా ప్రవేశిస్తున్నారు. వీటికి సంబంధించి ఎటువంటి తనిఖీలు లేవు.

  • రెగ్యులర్‌గా మెటల్‌ డిటెక్టర్‌, హ్యాండ్‌ డిటెక్టర్లను నిర్వహించడం లేదు. ఏదో పెద్ద ఉత్సవాలప్పుడు తప్ప వీటిని ఏర్పాటు చేయట్లేదు. అప్పుడు కూడా వీఐపీలమంటూ కొంతమంది తమ గుర్తింపు కార్డులు చూపించుకుని యథేచ్ఛగా గుంపులుగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు.

  • దేవస్థానం రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బందికి గుర్తింపు కార్డులు లేకపోవటంతో వారెవరనేది తెలుసుకోవడం కష్టమే అవుతుంది. ఆలయానికి సంబంధించి భద్రతాధికారి ఎవరూ లేకపోవటం పెద్ద తప్పిదమే. కేవలం ప్రైవేట్‌ సెక్యూరిటీ వారినే భద్రతాధికారిగా చూపిస్తున్నారు.

..ఈ లోపాలన్నింటినీ గుర్తించిన ఆక్టోపస్‌ బృందం సంఘ విద్రోహ శక్తులు సులభంగా ఆలయంలోకి ప్రవేశించి భద్రతకు విఘాతం కలిగించవచ్చని అభిప్రాయపడింది. సూచించిన అనేక అంశాలు ఆర్థికపరమైనవి కూడా కాకపోవడంతో ఆలోచించి చర్యలు తీసుకోవాలని ఆక్టోపస్‌ బృందం భావించింది. సదరు నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దేవదాయ కమిషనరే దుర్గగుడి ఈవో కావడంతో ఆక్టోపస్‌ బృందం సూచించిన సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశాలు లేకపోలేదు. అలాగే, తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి ఆలయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకునేందుకు అధ్యయనం చేయించాలని, నివేదిక తెప్పించుకుని, ఆ మేరకు నిపుణులతో చర్చించి, ఆక్టోపస్‌ సలహాలు కూడా తీసుకుని, కార్యాచరణకు ఉపక్రమించాలని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆక్టోపస్‌ మాక్‌డ్రిల్‌

ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత, ఆలయ పరిరక్షణలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆక్టోపస్‌ విభాగం అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అవాంఛనీయ శక్తులు మెట్లమార్గం నుంచి ఇంద్రకీలాద్రిపైకి చేరుకోగా, ఆలయ అధికారులు, వన్‌టౌన్‌ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఆక్టోపస్‌ విభాగం అధికారులు.. దుండగుల వద్ద ఉన్న పేలుడు సామగ్రి, ఆయుధాలు నిర్వీర్యం చేసి, వారిని అదుపులోకి తీసుకుని, భక్తులను ఎలా రక్షించారనే విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు, సెక్యూరిటీ, వైద్య, రెవెన్యూ సిబ్బంది ఎలా వ్యవహరించాలనే విషయాన్ని వివరించారు. ఈ మాక్‌డ్రిల్‌లో ఆక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీ రాజారెడ్డి, డీఎస్పీ తిరుపతయ్య ఆధ్వర్యంలో అధికారులు, వన్‌టౌన్‌ పోలీసులు, రెవెన్యూ, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:10 AM