బీఆర్‌టీఎస్ రోడ్డే బెటర్
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:03 AM
నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా రోడ్డు మార్గంపై ప్రయాణికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా విమానాశ్రయానికి వెళ్లే మార్గాన్ని పలువురు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రయాణం సులభం కావడంతో పాటు నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైల్వేస్టేషన్ నుంచి విమానాశ్రయానికి దగ్గరి దారి
విశాలమైన రోడ్డు కావడం ప్రయాణానికి అనుకూలం
ఇటు పడవల రేపు నుంచి రైవస్ కాల్వ వెంబడి రామవరప్పాడు రింగ్ వరకు..
అటు మీసాల రాజారావు బ్రిడ్జి నుంచి రైల్వే ఖాళీ స్థలం మీదుగా రైల్వేస్టేషన్‌కు..
రోడ్డును అభివృద్ధి చేస్తే నగరంలో ట్రాఫిక్ తగ్గినట్టే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టును అనుసంధానించటానికి బీఆర్‌టీఎస్ రోడ్డు చక్కటి మార్గం. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కంటే విశాలమైన రోడ్డు ఇది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.154 కోట్లతో జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా అభివృద్ధి పరిచారు. బస్సులు తిరగటానికి వీలుగా ప్రత్యేక డెడికేటెడ్ కారిడార్‌గా దీనిని నిర్మించారు. అలాంటి ఈ మార్గంపై ప్రస్తుతం ఒక్క బస్సు కూడా తిరగట్లేదు. డెడికేటెడ్ మార్గం నిరుపయోగంగా ఉంది. రైల్వేస్టేషన్ నుంచి నగరంలోకి వెళ్లాలంటే ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు మార్గాల్లోనే బస్సులు వెళ్తున్నాయి తప్ప బీఆర్‌టీఎస్ రోడ్డును ఉపయోగించట్లేదు. దీనివల్ల ట్రాఫిక్ అంతా ఈ రెండు రోడ్లపైనే ఉంటోంది. వెరసి రామవరప్పాడు రింగ్ వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. విజయవాడ నగరంలో నానాటికీ పెరుగుతున్న అంతర్గత ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని వాహనాల మళ్లింపునకు ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్-ఎయిర్‌పోర్టు కనెక్టివిటీగా బీఆర్‌టీఎస్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది.
నగరానికి నడిబొడ్డున..
బీఆర్‌టీఎస్ రోడ్డు అనేది పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల సరిహద్దున సీతన్నపేట ప్రాంతంలో మొదలవుతుంది. మీసాల రాజారావు బ్రిడ్జికి అనుసంధానంగా ప్రారంభమవుతుంది. పడవల రేవు సెంటర్ దగ్గర ముగుస్తుంది. మొత్తం 6.30 కి లోమీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డును అప్పట్లో పాత సత్యనారాయణపురం రైల్వేలైన్ స్థానంలో ఏర్పాటు చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి పథకం జేఎన్‌ఎన్యూఆర్‌ఎం స్కీమ్‌లో భాగంగా రూ.154 కోట్లతో ఈ అధునాతన రోడ్డును నిర్మించారు. బీఆర్‌టీఎస్ పథకంలో భాగంగా నిధులు తెచ్చి రోడ్డును వేశారు కానీ, ఆ తర్వాత బస్సులు తిప్పలేదు. కొద్దిరోజులుగా ఆర్టీసీ బస్సులు తిప్పినా సరైన కనెక్టివిటీ లేకపోవటం వల్ల వయబిలిటీ లేక ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
రైల్వేస్టేషన్‌కు ఇలా కలపొచ్చు
బీఆర్‌టీఎస్ రోడ్డుకు అనుసంధానంగా మీసాల రాజారావు బ్రిడ్జి ఉంది. దీనికి అవతల రైల్వేస్థలం ఉంది. ఈ స్థలంలో కొంతమేర కార్పొరేషన్ అధికారులు రోడ్డు వేసి వదిలేశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు తమ స్థలం అని గోడలు కట్టారు. ఈ స్థలం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే.. వచ్చే రోడ్డు నేరుగా రైల్వే క్వార్టర్స్ సరిహద్దుకు చేరుతుంది. డీజిల్ లోకో షెడ్ వెంబడిగా ఉన్న డీఆర్‌ఎం కార్యాలయం రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌కు నేరుగా వస్తుంది. ఈ మార్గం మరో 8 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు మార్గాన్ని విస్తరించగలిగితే బీఆర్‌టీఎస్ రోడ్డుకు నేరుగా రైల్వేస్టేషన్ నుంచి అనుసంధానం ఏర్పడుతుంది. ఎయిర్‌పోర్టుకు ఇలా అనుసంధానం చేయొచ్చు బీఆర్‌టీఎస్ రోడ్డు పడవల రేవు వద్ద ముగిసి ఏలూరు రోడ్డుకు అనుసంధానమవుతుంది. అక్కడి నుంచి రైవస్ కాల్వ వెంబడి ఉన్న ఆక్రమణల మీదుగా ముందుకు సాగితే వేమినేని రామస్వామి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డును విస్తరించుకుంటూ పోతే.. సరిగ్గా ఈ రోడ్డు రామవరప్పాడు రింగ్ దాటాక రామవరప్పాడు రైల్వేస్టేషన్ కొత్త వంతెన రోడ్డుకు అనుసంధానమవుతుంది. అలా ఈ మార్గం ఎన్‌హెచ్-16కు కలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరవచ్చు. అలాగే, ఎనికేపాడు వద్ద 100 అడుగుల రోడ్డుకు కాస్త ముందు ఎన్‌హెచ్-16కు అనుసంధానం కావచ్చు. ఇలా కూడా ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది.
సీఆర్‌డీఏ, వీఎంసీల చొరవతో..
ఈ రోడ్డును సీఆర్‌డీఏ, వీఎంసీలు సంయుక్త అభివృద్ధి చేయటం ద్వారా రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడటంతో పాటు రామవరప్పాడు రింగ్‌పై రద్దీ తగ్గుతుంది. దూరప్రాంత బస్సులు, సిటీ, రూరల్ బస్సులు, నాన్‌స్టాప్ బస్సులు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, కార్లు వంటివి నేరుగా రైల్వేస్టేషన్ నుంచి ఎనికేపాడు మీదుగా ఎన్‌హెచ్-16కు వెళ్లిపోతాయి. రైల్వేస్టేషన్ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఈ రోడ్డు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీంతో ఏలూరు రోడ్డుపై ట్రాఫిక్‌ను తగ్గించుకోవచ్చు.