నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ABN , First Publish Date - 2023-01-09T01:01:56+05:30 IST
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అధికారులను, ఆర్‌బీకే సిబ్బందిని హెచ్చరించారు.

పెడన, జనవరి 8 : ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అధికారులను, ఆర్‌బీకే సిబ్బందిని హెచ్చరించారు. వడ్లమన్నాడు గ్రామంలో చెన్నూరు రహదారి వెంబడి నిల్వ ఉంచిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడారు. గోనె సంచులు ఇస్తున్నారు కానీ, రవాణా వాహనాలు ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. మండలానికి ఎన్ని వాహనాలు కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న ట్రాక్టర్లను కూడా వినియోగించాలని తహసీల్దార్ మస్తానాకు సూచించారు. మిల్లుల యాజమాన్యంతో ఫోనులో ఆమె మాట్లాడి ధాన్యం వెంటనే దించుకోవాలని సూచించారు. సాయంత్రం 5 గంటలకల్లా ధాన్యం రొడ్ల మీద కనపడకూడదని ఆదేశించారు. జిల్లా రైతు సలహామండలి సభ్యుడు పెన్నేరు ప్రభాకరరావు, వీఆర్వోలు ఉదయభాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు.
రంగుమారిన ధాన్యం కొనాలి
రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం ఆమె గురివిందగుంట గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రంగుమారిన ధాన్యాన్ని పది శాతం వరకు మాత్రమే ఆన్‌లైన్ చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటున్నామన్నారు. పదిశాతం కంటే ఎక్కువగా ఉంటే రైతులు ఆర్‌బీకేల ద్వారా నేరుగా మిల్లర్లకు విక్రయించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రంగుమారిన ధాన్యానికి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ధర కన్నా ఎక్కువ ధర వస్తే మిల్లర్లకు అమ్ముకోవచ్చన్నారు. డీఎ్‌సవో పార్వతి, తహసీల్దార్ పి. మధుసూదనరావు, గుడ్లవల్లేరు తహసీల్దార్ రహమాన్, వ్యవసాయాధికారి జి.వి. శ్రీనివాసరావు, ఆర్‌ఐ మణికుమార్‌లు పాల్గొన్నారు.