అడ్డగోలు నియామకాలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:34 AM
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. సరైన విద్యార్హత లేకున్నా అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీఎం బదిలీలను గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. ప్రతి పనికీ రేటుకట్టి ఫైళ్లు కదిపేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ను, సెర్ప్ అధికారులను బురిడీ కొట్టించి మరీ ఫైళ్లు కదుపుతున్నా పట్టించుకునేవారే లేరు.

మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయంలో నిర్వాకాలు
పదో తరగతి చదివిన మహిళకు ఏపీఎంగా పదోన్నతి
అనేక అవినీతి ఆరోపణలున్నా అడ్డగోలుగా నియామకం
మండల సమాఖ్య అధ్యక్షురాలి సిఫార్సు లేఖే కారణం
సెర్ప్ తిరస్కరించినా పోస్టింగ్ ఇవ్వడంపై అనుమానాలు
(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం) : మచిలీపట్నం మండల వెలుగు కార్యాలయంలో కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ (సీసీ)గా ఓ మహిళ పనిచేస్తోంది. కొన్నేళ్లుగా ఈ కార్యాలయంలో ఆమె హవా సాగుతోంది. అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం)గా ఎవరొచ్చినా ఇబ్బందులు పెట్టడం, ఇక్కడ పనిచేయలేమని వారితోనే చెప్పించటం, ఏదో ఒక రూపంలో వెళ్లిపోయేలా చక్రం తిప్పటం కొంతకాలంగా జరుగుతోంది. ఇటీవల వరకు ఏపీఎంగా పనిచేసిన ఉద్యోగిని ఇక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఇక్కడ ఏపీఎంగా పనిచేసేందుకు ఎవరూ ముందుకురావటంలేదనే కారణం చూపి సీసీగా పనిచేస్తున్న మహిళను ఏపీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవీకాలం పూర్తయినా ఆమె సిఫార్సు లేఖతో ఇలా నియమించారు. మండల స్థాయిలో ఏపీఎంలను నియమించాలంటే.. పరీక్ష పెట్టి, ఐఏఎస్ అధికారి స్థాయిలో ఇంటర్వ్యూ చేసి నియమించేవారు. మచిలీపట్నం మండలంలో మాత్రం పదో తరగతి విద్యార్హత ఉన్న మహిళను ఏపీఎంగా నియమించటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
విచారణ చేసి ఫైల్ పక్కనపెట్టారు
మచిలీపట్నం మండలం ఏపీఎంగా నియమితురాలైన మహిళ గతంలో డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన కమీషన్ లక్షలాది రూపాయలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై పలు ఫిర్యాదులు అందటంతో గతంలో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించిన నివేదికను వెల్లడి చేయకుండా, సదరు సీసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారు. మండల సమాఖ్య కార్యాలయంలో తలలో నాలుకలా వ్యవహరించే ఈ సీసీ.. సీ్త్రనిధి తదితర రుణాలు మంజూరు చేసే సమయంలోనూ తనదైనశైలిలో వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారాంపురం తదితర గ్రామాల్లో నకిలీ డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి బ్యాంకుల ద్వారా రుణాలు పొందారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో నకిలీ డ్వాక్రా సంఘాల బాగోతం బయటపడింది. ఈ అంశంపైనా విచారణ చేసిన అధికారులు నివేదికలను అటకెక్కించారు. ఇటీవల వరకూ మండలంలో ఏపీఎంగా పనిచేసిన ఉద్యోగిని వివిధ రకాలుగా ఇబ్బందులు పాల్జేయటంతో తానిక్కడ పనిచేయలేనని పైఅధికారులకు మొరపెట్టుకుని ఆయన వేరే మండలానికి వెళ్లిపోయారు. దీంతో మండలంలో ఏపీఎం పోస్టు ఖాళీగా చూపి సీసీని ఏపీఎంగా నియమించటం విశేషం. కలెక్టర్‌కు, సెర్ప్ అధికారులకు తెలియకుండా సీసీని ఏపీఎంగా నియమించటంలో డీఆర్‌డీఏ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మండల సమాఖ్యలో రూ.1.10 కోట్ల వరకు నగదు ఉండగా, దానిని దారి మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ అంశంపై పత్రికల్లో వార్తలు రావటంతో అధికారులు ఆ ప్రక్రియకు బ్రేక్‌లు పడ్డాయి.
గతంలో తిరస్కరించినా..
మండల సమాఖ్య కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న మహిళను ఏపీఎంగా నియమించాలని వివిధ రూపాల్లో అధికారులపై ఒత్తిడి వచ్చింది. సీసీని ఏపీఎంగా నియమించే విషయంపై గతంలో డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీగా చేసిన నాగేశ్వరనాయక్ సెర్ప్ అధికారులకు లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించకూడదని సెర్ప్ అధికారులు సూచించడంతో నియామకానికి గండిపడింది. అయినా సమయం కోసం వేచి ఉన్న సీసీ డీఆర్‌డీఏగా పీడీగా ఇటీవల హరిహరనాథ్ బాధ్యతలు తీసుకోవటంతో ఫైల్‌ను తెరపైకి తెచ్చారు. హుటాహుటిన సీసీని ఏపీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అడ్డగోలు బదిలీలు
డీఆర్‌డీఏ పీడీగా హరిహరనాథ్ బాధ్యతలు తీసుకోకముందు మెప్మా పీడీ పి.సాయిబాబు ఇన్‌చార్జి డీఆర్‌డీఏ పీడీగా వ్యవహరించారు. ఈ సమయంలో ఘంటసాల ఏపీఎంను గుడ్లవల్లేరుకు, కోడూరు ఏపీఎంను మొవ్వకు, గుడ్లవల్లేరు ఏపీఎంను పెదపారుపూడికి బదిలీ చేశారు. గత ఏడాది అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిర్వహించారు. డీఆర్‌డీఏలోనూ బదిలీలు చేపట్టినప్పటికీ నాలుగైదు నెలల్లోనే మళ్లీ అనధికారికంగా బదిలీలు చేయటం గమనించదగ్గ అంశం. ఈ బదిలీల్లో ఏదో మతలబు దాగి ఉందని ఆ శాఖ అధికారులు, సిబ్బంది చెప్పుకొంటున్నారు.
తాత్కాలికంగానే నియమించాం..
మచిలీపట్నం మండలంలో ఏపీఎం పోస్టు ఖాళీ కావటంతో పరిపాలనా సౌలభ్యంకోసం సీసీని ఏపీఎంగా తాత్కాలికంగా నియమించాం. త్వరలో వేరే మండలం నుంచీ ఏపీఎంలను తీసుకొచ్చి మచిలీపట్నం మండలానికి నియమిస్తాం. - హరిహరనాథ్, డీఆర్‌డీఏ పీడీ